Diarrhea :వర్షాకాలంలో వేధించే విరేచనాలు.. ఉపశమనం కోసం ఉత్తమ ఇంటి చిట్కాలు..!
సాక్షి లైఫ్ : వర్షాకాలం వస్తూ వస్తూనే అనేక ఇన్ఫెక్షన్లను వెంట తెస్తుంది. ఈ సీజన్‌లో కలుషితమైన నీరు, ఈగలు వాలిన నిల్వ ఆహారం, బ్యాక్టీరియా, వైరస్‌ల కారణంగా ‘డయేరియా’ (నీళ్ల విరేచనాలు) బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. పదేపదే విరేచనాలు కావడం, కడుపునొప్పి, వాంతులు, విపరీతమైన నీరసం దీని ప్రధాన లక్షణాలు. సమయానికి స్పందించకపోతే శరీరంలో నీటి శాతం తగ్గిపోయి ‘డీహైడ్రేషన్’ బారిన పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. విరేచనాల సమస్య ప్రారంభమైనప్పుడు ఇంట్లోనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
1. ఓఆర్ఎస్ (ORS) ద్రావణం ప్రథమ చికిత్స..
విరేచనాలు అవుతున్నప్పుడు శరీరం నుండి నీటితో పాటు పొటాషియం, సోడియం వంటి కీలక ఎలక్ట్రోలైట్లు వేగంగా బయటకు వెళ్లిపోతాయి.
పరిష్కారం..దీనిని నివారించడానికి మెడికల్ షాపుల్లో దొరికే ఓఆర్ఎస్ (ORS) పొడిని నీళ్లలో కలిపి అప్పుడప్పుడు తాగుతుండాలి. ఒకవేళ అది అందుబాటులో లేకపోతే.. కాచి చల్లార్చిన లీటరు నీటిలో, ఆరు చిన్న చెంచాల చక్కెర, అర చెంచా ఉప్పు కలిపి ఇంట్లోనే ఎలక్ట్రోలైట్ ద్రావణాన్ని తయారు చేసుకుని రోగికి ఇస్తూ ఉండాలి.
2. ద్రవ పదార్థాలు పుష్కలంగా తీసుకోండి..
డీహైడ్రేషన్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి రోజంతా తగినన్ని ద్రవపదార్థాలు శరీరానికి అందేలా చూసుకోవాలి.
ఏం తాగాలి..? కాచి చల్లార్చిన స్వచ్ఛమైన నీరు, కొబ్బరి నీళ్లు, స్వల్పంగా పంచదార వేసిన నిమ్మరసం, మజ్జిగ వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
3. లఘు ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వండి..
విరేచనాలు అవుతున్నప్పుడు జీర్ణవ్యవస్థ చాలా బలహీనంగా మారుతుంది. అందువల్ల పొట్టపై భారం పడని తేలికపాటి ఆహారాన్నే ఎంచుకోవాలి.
తీసుకోవలసినవి..బాగా ఉడికించిన మెత్తటి అన్నం, గంజి, పెసరపప్పు కిచిడీ, బ్రెడ్ టోస్ట్, ఉడికించిన బంగాళాదుంపలు సులభంగా జీర్ణమవుతాయి.
అరటిపండు,పెరుగు..అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే తాజా పెరుగులోని ‘ప్రోబయోటిక్స్’ అంటే మంచి బ్యాక్టీరియా ప్రేగుల్లోని ఇన్ఫెక్షన్‌తో పోరాడి జీర్ణక్రియను త్వరగా మెరుగుపరుస్తాయి.
4. వీటికి పూర్తిగా దూరంగా ఉండండి..
జంక్ ఫుడ్ వద్దు..నూనెలు, కారాలు, మసాలాలు ఎక్కువగా ఉండే వేపుళ్లు, ఫాస్ట్ ఫుడ్స్, బయటి ఆహారాన్ని పూర్తిగా పక్కన పెట్టేయాలి. కెఫీన్ పానీయాలు వద్దు.. టీ, కాఫీలు, కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ పొట్టలోని ఇబ్బందిని మరింత ఎక్కువ చేస్తాయి.
5. పరిశుభ్రత చాలా ముఖ్యం..
ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఉండాలంటే పరిశుభ్రత పాటించడం అవసరం. భోజనానికి ముందు, టాయిలెట్ ఉపయోగించిన తర్వాత చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలి.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?
విరేచనాలు అవుతున్నప్పుడు సొంతంగా యాంటీబయాటిక్స్ లేదా ఇతర టాబ్లెట్లు వేసుకోవడం చాలా ప్రమాదకరం. ఒకవేళ విరేచనాలు 24 నుంచి 48 గంటల కంటే ఎక్కువగా అవుతున్నా, మలంలో రక్తం లేదా జిగురు పడుతున్నా, తీవ్రమైన జ్వరం,ఎడతెరిపి లేని వాంతులు అవుతున్నా, లాలాజలం ఆరిపోయి కళ్లు తిరగడం వంటి తీవ్ర డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అర్హులైన వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
