Irritable Bowel Syndrome : ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ (IBS) అంటే ఏమిటి..? లక్షణాలెలా ఉంటాయి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కడుపునొప్పి, గ్యాస్, తిన్న వెంటనే మోషన్స్ అవ్వడం లేదా తీవ్రమైన మలబద్ధకం.. ఇలాంటి సమస్యలను చాలామంది సాధారణ జీర్ణక్రియ లోపంగానో లేదా గ్యాస్ట్రిక్ సమస్యగానో భావించి లైట్ తీసుకుంటారు. అయితే, ఈ ఇబ్బందులు నెలకు మూడు నాలుగు సార్లకు పైగా వేధిస్తూ, దీర్ఘకాలంగా కొనసాగుతుంటే మాత్రం అప్రమత్తం కావాల్సిందే. ఎందుకంటే అది ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ (IBS) అనే జీర్ణకోశ సమస్యకు సంకేతం కావచ్చు.

ఇది ఒక వ్యక్తి దినచర్యను తీవ్రంగా ప్రభావితం చేసే దీర్ఘకాలిక సమస్య. అంతర్జాతీయ నిపుణుల గణాంకాల ప్రకారం.. ప్రపంచ జనాభాలో దాదాపు 5 నుంచి 10 శాతం మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా పురుషుల కంటే మహిళల్లో, 50 ఏళ్ల లోపు వయసు వారిలో ఈ బాధితులు ఎక్కువగా కనిపిస్తుంటారు.

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

 

ఐబీఎస్ (IBS) ప్రధాన లక్షణాలు ఇవే..

ఈ సమస్య ఉన్నవారిలో కడుపు, ప్రేగులకు సంబంధించిన వివిధ రకాల అసౌకర్యాలు తలెత్తుతాయి. పదేపదే కడుపునొప్పి..కడుపులో తరచుగా తిమ్మిర్లు, నొప్పి రావడం దీని ప్రధాన లక్షణం. సాధారణంగా మలవిసర్జన చేసిన తర్వాత ఈ నొప్పి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. మలవిసర్జనలో మార్పులు..కొందరికి పదేపదే విరేచనాలు (diarrhea) అవుతుంటే, మరికొందరిలో తీవ్రమైన మలబద్ధకం (constipation) కనిపిస్తుంది. కొందరిలో ఇవి రెండూ పదే పదే ఇబ్బంది పెడతాయి. మోషన్ కి వెళ్లొచ్చినా ఇంకా కడుపు ఖాళీ కాలేదనే భావన వేధిస్తుంది. తిన్న కొద్దిసేపటికే పొట్ట ఉబ్బినట్లు అవ్వడం, విపరీతంగా గ్యాస్ చేరడం వంటి లక్షణాలు ఉంటాయి.ఇతర ప్రమాద సంకేతాలు: ఐబీఎస్ తీవ్రత పెరిగితే బరువు తగ్గడం, రక్తహీనత, మలంలో రక్తం పడటం, తరచుగా జ్వరం రావడం వంటి సమస్యలు కూడా తోడవుతాయి.

అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..?

ఐబీఎస్‌కు నిర్దిష్టమైన కారణం ఇదే అని సైన్స్ ఇంకా స్పష్టంగా తేల్చలేదు. అయినప్పటికీ, మెదడుకు-ప్రేగులకు మధ్య ఉండే అనుసంధాన వ్యవస్థ (Gut-Brain Axis) లో లోపాల వల్లే ఇది వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. మెదడు నుంచి ప్రేగులకు అందే సంకేతాల్లో అంతరాయం కలగడం వల్ల ప్రేగుల కదలికల్లో అసాధారణ మార్పులు వస్తాయి.

ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా (గట్ మైక్రోబయోమ్) సమతుల్యత దెబ్బతినడం.

తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన (Anxiety).

వేళాపాళా లేని ఆహారపు అలవాట్లు, నిద్రలేమి.

అతిగా కొవ్వులు, కారాలు, మసాలాలు ఉండే జంక్ ఫుడ్స్ తీసుకోవడం.

నియంత్రణ మార్గాలు.. నిపుణుల సలహాలు.. 

ఐబీఎస్ అనేది ప్రేగుల కణజాలాలను శాశ్వతంగా దెబ్బతీయదు, అలాగే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీయదు. జీవనశైలి, ఆహార నియమాల ద్వారా దీనిని పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చని అమెరికన్ కాలేజ్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ పేర్కొంది.

ఆహార నియమాలు..

ఫైబర్ (fiber) ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు నిర్ణీత సమయానికి భోజనం చేయడం, రోజంతా తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. గ్యాస్ పెంచే పదార్థాలకు దూరంగా ఉండాలి.

ఒత్తిడికి చెక్.. 

మానసిక ఒత్తిడి ప్రేగులపై నేరుగా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి నిత్యం యోగా, ధ్యానం, తేలికపాటి వ్యాయామాలు చేయాలి. కడుపు సమస్యలు చాలా రోజులుగా వేధిస్తున్నట్లయితే సొంత వైద్యం చేసుకోకుండా, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. వైద్యుల పర్యవేక్షణలో సరైన చికిత్స, డైట్ ప్లాన్ పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.

 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.