Mouth Ulcers in Summer : వేసవిలో వేధించే నోటి పుండ్లకు కారణాలేంటి..? నివారణ ఎలా..?
సాక్షి లైఫ్ : ఎండ తీవ్రతకు తోడు వేసవి కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన సమస్యల్లో నోటి పుండ్లు (Mouth Ulcers) ఒకటి. నోటి లోపల బుగ్గలు, నాలుక లేదా చిగుళ్లపై వచ్చే ఈ చిన్న తెల్లటి, ఎర్రటి బొబ్బలు విపరీతమైన నొప్పితో కూడి ఉంటాయి. దీనివల్ల కనీసం నీళ్లు తాగాలన్నా, ముద్ద నోట్లోకి వెళ్లాలన్నా నరకం కనిపిస్తుంది. రోజంతా ఎండలో పనిచేసేవారు, నీళ్లు తక్కువగా తాగేవారు, కాఫీ, టీలు ఎక్కువగా తీసుకునేవారిలో ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. వేసవిలో ఈ సమస్య ఎందుకు తీవ్రమవుతుంది. అందుకు గల కారణాలు, పరిష్కార మార్గాలను గురించి ఇప్పుడు తెలుసుకుందామా మరి..
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఎందుకీ సమస్య..?
వేసవి కాలంలో వాతావరణంలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో జరిగే కొన్ని మార్పులు నోటి పుండ్లకు దారితీస్తాయి.
డీహైడ్రేషన్..
ఎండల వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడి, నోటి లోపలి చర్మం పొడి బారిపోతుంది. ఫలితంగా నోటి కణజాలాలు సున్నితంగా మారి, చిన్నపాటి ఘర్షణకే వాపు, పుండ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఆహారపు అలవాట్లు..
ఎండకాలంలోనూ మసాలాలు, వేపుళ్లు, మిరపకాయలు ఎక్కువగా ఉన్న కారంగా ఉండే ఆహారాలు, వేడివేడి పదార్థాలు తీసుకోవడం వల్ల నోటిలోని సున్నితమైన పొర దెబ్బతింటుంది.
పోషకాల లోపం..
శరీరంలో విటమిన్ ‘బి12’, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లోపాలు ఉన్నవారికి నోటి పూత తరచూ వస్తుంది. వేసవిలో చెమట ద్వారా శరీరం నుంచి అవసరమైన లవణాలు, ఖనిజాలు వేగంగా బయటకు పోవడం వల్ల ఈ ముప్పు మరింత పెరుగుతుంది.
జీర్ణకోశ సమస్యలు..
కడుపు నొప్పి, మలబద్ధకం, ఎసిడిటీ వంటి జీర్ణక్రియ లోపాలు నేరుగా నోటి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వీటితో పాటు మానసిక ఒత్తిడి, నిద్రలేమి, రోగనిరోధక శక్తి తగ్గడం కూడా కారణాలు కావచ్చు.
ఉపశమనం పొందే మార్గాలు ఇవే..
నోటి పుండ్ల తీవ్రతను తగ్గించుకోవడానికి రోజువారీ అలవాట్లలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడమే అత్యంత ముఖ్యం. రోజూ పుష్కలంగా నీరు తాగాలి. వీటితో పాటు కొబ్బరినీళ్లు, చల్లటి మజ్జిగ, రాగి అంబలి, ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉండి నోటి పొడిబారడం తగ్గుతుంది.
కారం, పులుపునకు దూరం..
నోటిలో పుండ్లు ఉన్నప్పుడు మసాలాలు, కారం, ఎక్కువ పులుపు ఉన్న పదార్థాలను అస్సలు ముట్టకూడదు. ఇవి నొప్పిని, మంటను మరింత పెంచుతాయి.
చలవ చేసే ఆహారాలు..
పెరుగు, మజ్జిగ అన్నం, అరటిపండ్లు, పుచ్చకాయ వంటి చలువ చేసే తాజా పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి కడుపును, నోటిని చల్లబరుస్తాయి.
ఉప్పు నీరు పుక్కిలించడం..
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి రోజుకు రెండు మూడు సార్లు పుక్కిలించడం వల్ల బ్యాక్టీరియా నశించి, వాపు, నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
ఎప్పుడు జాగ్రత్తపడాలి అంటే..?
సాధారణంగా నోటి పుండ్లు వారం రోజుల్లో అవే తగ్గిపోతాయి. అయితే, వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..నోటిలో పుండ్లు మరీ పెద్దవిగా ఉన్నా, సాధారణ మందులు వాడినా తగ్గకుండా మూడు వారాల కంటే ఎక్కువ కాలం వేధిస్తున్నా, లేదా పదేపదే వస్తున్నా వాటిని తేలికగా తీసుకోకూడదు. ఆరుబయట, ఎండలో ఎక్కువ సమయం గడిపేవారు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. సమస్య దీర్ఘకాలంగా కొనసాగితే వెంటనే దంత వైద్యులను లేదా జనరల్ ఫిజీషియన్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు యాంటీసెప్టిక్ మౌత్ జెల్స్ లేదా అవసరమైన విటమిన్ సప్లిమెంట్లు వాడటం సురక్షితం.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
