Signs of Diabetes : చాలామంది పట్టించుకోని మధుమేహం ముందస్తు హెచ్చరికలు ఇవే..!

షేర్ చేయండి:
Signs of Diabetes : చాలామంది పట్టించుకోని మధుమేహం ముందస్తు హెచ్చరికలు ఇవే..!

సాక్షి లైఫ్ : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ‘డయాబెటిస్’ఒక నిశ్శబ్ద శత్రువులా మారుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా మధుమేహ బాధితులు ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటిగా నిలవడం ఆందోళన కలిగిస్తోంది. క్రమరహిత ఆహారపు అలవాట్లు, గంటల తరబడి కదలకుండా కూర్చొని పనిచేయడం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, శారీరక శ్రమ లోపించడం వంటి కారణాల వల్ల ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

అయితే, మధుమేహం ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎలాంటి స్పష్టమైన సంకేతాలను చూపించదు. రక్తంలో చక్కెర స్థాయిలు నిశ్శబ్దంగా పెరుగుతూ, లోలోపలే శరీరాన్ని గుల్ల చేస్తుంటాయి. సాధారణంగా గాయాలు ఆలస్యంగా మానడం, విపరీతమైన ఆకలి, తరచుగా మూత్రవిసర్జన వంటివి మధుమేహ లక్షణాలని మనకు తెలుసు. కానీ, వీటితో పాటు చాలా మంది సాధారణమైనవిగా భావించి నిర్లక్ష్యం చేసే కొన్ని ముఖ్యమైన హెచ్చరిక సంకేతాల గురించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఎంత విశ్రాంతి తీసుకున్నా తగ్గని ‘అలసట’.. 

రాత్రి వేళల్లో తగినంత నిద్ర పోయినప్పటికీ పగటిపూట విపరీతమైన అలసట, నీరసం వేధిస్తుంటే అది అధిక రక్త చక్కెర స్థాయిలకు సంకేతం కావచ్చు.

కారణం ఏమిటంటే..?.. మనం తినే ఆహారంలోని గ్లూకోజ్‌ను శక్తిగా మార్చడానికి శరీరం ఇన్సులిన్‌ను ఉపయోగిస్తుంది. మధుమేహం ఉన్నవారిలో ఈ ప్రక్రియ సక్రమంగా జరగదు. ఫలితంగా, శరీర కణాలకు తగినంత శక్తి అందక నిరంతరం నీరసంగా అనిపిస్తుంది. అదనంగా, రక్తంలో చక్కెర శాతం పెరిగినప్పుడు అది శరీరంలో వాపును, డీహైడ్రేషన్ ను పెంచుతుంది. ఇది మెదడు పనితీరు, ఏకాగ్రతపై ప్రభావం చూపి, చిరాకుకు దారితీస్తుంది.

2. కంటి చూపు మసకబారడం..

చాలామంది చూపు మసకబారగానే అది కేవలం కంటికి సంబంధించిన సమస్యగా భావించి ఐ-డాక్టర్‌ను సంప్రదిస్తుంటారు. కానీ, ఇది కూడా డయాబెటిస్ లక్షణమే కావచ్చు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మితిమీరినప్పుడు, అది కళ్లలోని సూక్ష్మ రక్తనాళాలపై ఒత్తిడి తెస్తుంది. దీనివల్ల కంటి రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ వైద్య పరిస్థితిని ‘డయాబెటిక్ రెటినోపతి’ అంటారు. ప్రాథమిక దశలోనే దీనిని గుర్తించకపోతే చూపు దెబ్బతినే ప్రమాదం ఉందన్నది నిపుణుల హెచ్చరిక.

3. ప్రయత్నం లేకుండానే హఠాత్తుగా బరువు తగ్గడం.. 

ఎలాంటి ఆహార నియమాలు చేయకుండా, వ్యాయామాలు పెంచకుండానే అకస్మాత్తుగా బరువు తగ్గిపోతుంటే సంతోషించాల్సింది ఏమాత్రం కాదు. శరీరానికి అవసరమైన గ్లూకోజ్‌ను కణాలు గ్రహించలేనప్పుడు, ప్రత్యామ్నాయ శక్తి కోసం శరీరం లోపల ఉన్న కొవ్వును, కండరాలను కరిగించడం ప్రారంభిస్తుంది. దీనివల్ల బరువు వేగంగా తగ్గిపోతారు. బరువు తగ్గడంతో పాటు ఆకలి పెరగడం, తరచుగా దాహం వేయడం వంటివి ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలి.

రాత్రి పూట నిద్ర భంగం అవుతోందా..?

సాధారణంగా రాత్రి పూట ఎక్కువసార్లు మూత్రవిసర్జన కోసం నిద్రలేవడం లేదా నోరు ఎండిపోయి విపరీతంగా దాహం వేయడం వంటివి శరీరంలో చక్కెర ముప్పునకు ప్రధాన సంకేతాలు. చాలామంది దీనిని ఉష్ణోగ్రతల మార్పుగానో లేదా రాత్రి నీళ్లు ఎక్కువ తాగామనో సరిపెట్టుకుంటారు. కానీ, ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

అప్రమత్తంగా ఉండాలి..

కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే, వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏడాదికి ఒకసారైనా హెచ్‌బీఏ1సీ (HbA1c) లేదా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. మైదా, పంచదార వంటి వాటికి దూరంగా ఉండాలి. రోజుకు కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు నడక, యోగా లేదా వ్యాయామం అలవాటు చేసుకోవాలి. ముందస్తుగా గుర్తించడం ద్వారా 'ప్రీడయాబెటిస్' స్థితిలోనే చక్కెర స్థాయిలను అదుపులోకి తెచ్చుకుని, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..? 

 ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ ఎంత ఉండాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.