Natural Body Detox : మీ శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేసుకోవచ్చు.. ఇలా..   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పండుగ అంటేనే పిండివంటలు, రకరకాల స్వీట్లు. ఇక రక్షాబంధన్ లాంటి పండుగల్లో కుటుంబ సభ్యులతో కలిసి వీటిని కాస్త ఎక్కువగానే లాగించేస్తుంటాం. ఈ అతిగా తినడం ( over eating) వల్ల మరుసటి రోజు కడుపు ఉబ్బరం, నీరసం, బరువుగా అనిపించడం సహజం. అయితే పండుగ తర్వాత శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి కఠినమైన డైట్‌లు, ఉపవాసాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఐదు సులభమైన అలవాట్లతో మీ శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేసుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

ఉదయాన్నే నీటితో మొదలుపెట్టండి.. 

పండుగ హడావుడిలో తీపి పానీయాలు తాగి, నీరు సరిగ్గా తాగకపోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. కాబట్టి ఉదయం నిద్రలేవగానే పుష్కలంగా నీరు తాగడం అలవాటు చేసుకోండి. గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే మరింత మంచిది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

పీచు పదార్థాలు తప్పనిసరి..

స్వీట్లు, నూనె పదార్థాలు ఎక్కువగా తిన్న తర్వాత తర్వాతి భోజనంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. తాజా పండ్లు, కూరగాయలు, సలాడ్లు, తృణధాన్యాలు, ఓట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోండి. ఇవి పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచడమే కాకుండా జీర్ణవ్యవస్థను వేగంగా గాడిలో పెడతాయి. అయితే ఒకేసారి కాకుండా ఫైబర్ శాతాన్ని నెమ్మదిగా పెంచడం మంచిది.

తేలికపాటి వాకింగ్ చేయండి..

అతిగా తిన్నామని మరుసటి రోజు గంటల తరబడి జిమ్‌లో చెమటోడ్చాల్సిన పనిలేదు. రోజుకు కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు తేలికపాటి నడక (brisk walk) చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది తిన్న ఆహారం సులభంగా జీర్ణమవడానికి, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది.

కొన్నాళ్లపాటు చక్కెరలకు దూరం..

పండుగ రోజున స్వీట్లు ఎలాగూ ఎక్కువగా తింటారు కాబట్టి, ఆ తర్వాత కొన్ని రోజుల పాటు చక్కెరతో చేసిన పదార్థాలకు దూరంగా ఉండటం ఎంతో ముఖ్యం. కేకులు, కూల్ డ్రింక్స్, పేస్ట్రీలను పక్కనపెట్టేయండి. అలాగని భోజనం మానేయకూడదు. వాటికి బదులుగా ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉండే పప్పులు, కూరగాయలను మీ ప్లేట్‌లో చేర్చుకోండి.

నిద్ర, భోజన వేళల్లో క్రమశిక్షణ..

పండుగ వేడుకల్లో నిద్రలేమి, సమయానికి భోజనం చేయకపోవడం వల్ల శరీరం బద్ధకంగా మారుతుంది. కాబట్టి సరైన సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. రాత్రి పూట ఆలస్యంగా, బరువుగా ఉండే ఆహారం తినొద్దు. వాస్తవానికి మన శరీరంలోని కాలేయం, కిడ్నీలు సహజంగానే వ్యర్థాలను బయటకు పంపుతాయి. సరైన నిద్ర, సమయానికి భోజనం చేయడం ఆ అవయవాలకు మనం చేసే అతిపెద్ద సహాయం.

 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.