Natural Sweeteners : పంచదారకు బదులు ఈ సహజసిద్ధమైన స్వీటెనర్లు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..!
సాక్షి లైఫ్ : పంచదార ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతుంటారు. అందుకే ఈమధ్య కాలంలో చాలామంది టీ, పాలు, స్వీట్లలో తెల్ల పంచదారకు బదులుగా సహజసిద్ధమైన తీపి పదార్థాలను (Natural Sweeteners) వాడుతున్నారు. అయితే, తీపిగా ఉండే ప్రతిదీ ఆరోగ్యకరం కాదు. కానీ కొన్ని సహజసిద్ధమైన ప్రత్యామ్నాయాల్లో తీపితో పాటు ఫైబర్, మినరల్స్, ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవే వాటిని సాధారణ పంచదార కంటే మెరుగైనవిగా మారుస్తాయి.
మీరు కూడా మీ రోజువారీ డైట్‌లో పంచదార వాడకాన్ని తగ్గించాలనుకుంటే ఖర్జూరం, అంజీర్, బెల్లం, తేనె లాంటివి ప్రయత్నించవచ్చు. ఇవి వంటకాలకు చక్కటి రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అయితే, వీటిలోనూ సహజ చక్కెరలు, క్యాలరీలు ఉంటాయన్న సంగతి మర్చిపోవద్దు. కాబట్టి వీటిని కూడా మితంగా తీసుకుంటేనే మేలు. అవేంటో ఇక్కడ చూద్దాం..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
1. ఖర్జూరం (Dates)..
సహజసిద్ధమైన తీపికి ఖర్జూరం పెట్టింది పేరు. ఇందులో తీపితో పాటు ఫైబర్, పొటాషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని నేరుగా తినడమే కాకుండా స్మూతీలు, ఓట్స్, పాయసం లేదా ఇంట్లో చేసుకునే స్వీట్లలో వేసుకోవచ్చు. ఖర్జూరం పేస్ట్‌ను పంచదారకు చక్కటి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. అయితే, మరీ ఎక్కువగా తింటే క్యాలరీలు పెరుగుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
2. కిస్మిస్ (Raisins)..
ద్రాక్ష పండ్లను ఎండబెట్టి తయారు చేసే కిస్మిస్‌లో సహజ చక్కెరలు ఎక్కువ. స్వీట్లు, పాయసం, పోహా, బేకింగ్ వంటకాల్లో వీటిని వాడొచ్చు. ఫైబర్, శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు (Micronutrients) ఇందులో లభిస్తాయి. పంచదారకు బదులుగా కొద్దిగా కిస్మిస్ లేదా దాని పేస్ట్ వాడటం వల్ల వంటకాలకు మంచి తీపి వస్తుంది.
3. అంజీర్ (Figs)..
ఎండు అంజీర్ కూడా పంచదారకు బదులుగా వాడదగిన అద్భుతమైన ఆహారం. ఇందులో పీచుపదార్థం (fiber), అనేక పోషకాలు ఉంటాయి. వీటిని రాత్రి పూట నానబెట్టుకుని ఉదయాన్నే తినొచ్చు లేదా స్మూతీలు, డెజర్ట్‌లలో కలుపుకోవచ్చు. దీని రుచి చాలా తియ్యగా ఉంటుంది కాబట్టి, వంటకాల్లో అదనంగా పంచదార వేయాల్సిన అవసరాన్ని ఇది తగ్గిస్తుంది.
4. బెల్లం (Jaggery)..
చెరుకు రసంతో తయారయ్యే బెల్లాన్ని మనం పూర్వకాలం నుంచి తెల్ల పంచదారకు బదులుగా వాడుతున్నాం. పంచదారతో పోలిస్తే ఇందులో ఐరన్ వంటి కొన్ని ఖనిజాలు ఉంటాయి. టీ, సంప్రదాయ స్వీట్లలో బెల్లం వేసుకోవడం ఆరోగ్యకరం. అయితే బెల్లం కూడా దాదాపు చక్కెర లాంటిదే కాబట్టి పరిమితంగానే తీసుకోవాలి.
5. తేనె (Honey)..
ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన స్వీటెనర్ తేనె. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు, బయో-యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. దీని రుచి పంచదార కన్నా భిన్నంగా, అద్భుతంగా ఉంటుంది. గ్రీన్ టీ, పెరుగు, ఓట్స్ లాంటి వాటిలో కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. అయితే తేనెలోనూ క్యాలరీలు, షుగర్ ఉంటాయి కాబట్టి మోతాదు మించకుండా చూసుకోవాలి.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
