Deadly Diseases : వర్షాకాలంలో కలుషిత నీటితో పొంచి ఉన్న ప్రాణాంతక వ్యాధులు
సాక్షి లైఫ్ : వర్షాకాలం వాతావరణాన్ని చల్లబరిచి ఉపశమనం కలిగించినప్పటికీ, తన వెంట అనేక ఆరోగ్య సవాళ్లను తీసుకు వస్తుంది. నీటి నిల్వల వల్ల దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా కేసులు పెరగడమే కాకుండా, కలుషిత నీటి వినియోగం వల్ల అనేక ప్రాణాంతక వ్యాధులు పొంచి ఉంటాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పైప్లైన్ల లీకేజీలు ఏర్పడి లేదా మురుగునీరు త్రాగునీటి లైన్లలో కలిసిపోయి నీరు కలుషితం అవుతుంది. నీరు చూసేందుకు స్వచ్ఛంగా, వాసన లేకుండా ఉన్నప్పటికీ కంటికి కనిపించని ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్లు అందులో దాగి ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది.
ఇది కూడా చదవండి.. Natural Body Detox : మీ శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేసుకోవచ్చు.. ఇలా..
ఇది కూడా చదవండి.. Low-Carb Diet : బరువు తగ్గడానికి లో-కార్బ్ డైట్ పాటిస్తున్నారా..? గుండెకు ముప్పు తెచ్చుకోకండి..!
కలుషిత నీటితో పొంచి ఉన్న వ్యాధులు
డయేరియా..
కలుషిత నీటి వినియోగం వల్ల అత్యంత సాధారణంగా వచ్చే సమస్య ఇది. నీటిలోని బ్యాక్టీరియా, పరాన్నజీవుల వల్ల పేగుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ వస్తుంది. పదేపదే నీళ్ల విరేచనాలు, వాంతుల వల్ల శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోయి డీహైడ్రేషన్‌కు గురవుతారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇది ప్రాణాంతకంగా మారుతుంది.
టైఫాయిడ్ ఫీవర్..
కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపించే 'సాల్మొనెల్లా టైఫీ' అనే బ్యాక్టీరియా వల్ల ఈ తీవ్రమైన అంటువ్యాధి ప్రబలుతుంది.
హెపటైటిస్-ఏ..
ఈ వైరస్ నేరుగా కాలేయం (liver) పై దాడి చేసి, తీవ్రమైన ఇన్ఫెక్షన్ ,వాపుకు దారితీస్తుంది. కలరా, డిసెంట్రీ అంటే రక్త విరేచనాలు వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా నీటి ద్వారానే వ్యాపిస్తాయి.
నిపుణులు సూచిస్తున్న ముందస్తు జాగ్రత్తలు
వర్షాకాలం పూర్తయ్యే వరకు నీటిని బాగా కాచి, చల్లార్చిన తర్వాత లేదా నాణ్యమైన ఫిల్టర్ చేసిన నీటినే తాగాలి. తాగునీటిని నిల్వ చేసే పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, మూత సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. పాత్రల నుంచి నీరు తీసేటప్పుడు చేతులు లోపల పెట్టకూడదు.
వంట చేయడానికి, అలాగే ఉదయం పళ్లు తోముకోవడానికి కూడా కేవలం శుభ్రమైన, సురక్షితమైన నీటినే వినియోగించాలి. ఆహారం తినే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులను తప్పనిసరిగా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇన్ఫెక్షన్లు కేవలం నీటి ద్వారానే కాదు, అపరిశుభ్రమైన చేతుల వల్ల కూడా వ్యాపిస్తాయి.
ఇంట్లో ఎవరికైనా డయేరియా లక్షణాలు కనిపిస్తే, వెంటనే వారికి కొద్దికొద్దిగా ఓఆర్ఎస్ (ORS) ద్రావణం ఇస్తూ ఉండాలి. పరిస్థితి విషమించకముందే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
