Hair care : ఖరీదైన షాంపూలు వాడుతున్నా జుట్టు రాలుతోందా..? అసలు కారణం ఇదే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దువ్వెన నిండా వెంట్రుకలు, స్నానాల గదిలో రాలిన జుట్టు.. ఇవి చూసినప్పుడు ఎవరికైనా ఆందోళన కలగడం సహజం. వెంటనే షాంపూలు మార్చేయడం, ఖరీదైన నూనెలు వాడటం చేస్తుంటారు. అయినా ఫలితం శూన్యంగానే ఉంటుందా? అయితే మీరు గమనించాల్సిన విషయం ఒకటుంది. జుట్టు రాలడానికి కేవలం బాహ్య కారణాలే కాదు, శరీరంలోని పోషకాహార లోపమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

కురులు ఆరోగ్యంగా, ఒత్తుగా, నిగనిగలాడుతూ పెరగాలంటే కుదుళ్లకు లోపలి నుంచి సరైన పోషణ అందాలి. ఖరీదైన పూతలు పూసినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. మరి జుట్టుకు ఏయే పోషకాలు అవసరమో, అవి వేటి నుంచి లభిస్తాయో తెలుసుకుందాం..

జుట్టుకు అవసరమైన ముఖ్యమైన పోషకాలు..

1. ప్రొటీన్ (Protein)..

జుట్టు నిర్మాణంలో దాదాపు 90 శాతం 'కెరాటిన్' అనే ప్రొటీన్ ఉంటుంది. శరీరంలో ప్రొటీన్ స్థాయిలు తగ్గితే జుట్టు నిర్జీవంగా మారి, మధ్యలోనే విరిగిపోవడం లేదా ఎదుగుదల ఆగిపోవడం జరుగుతుంది.

లభించే పదార్థాలు..పప్పు ధాన్యాలు, శనగలు, చిక్కుళ్లు, సోయాబీన్స్, పాలు, పెరుగు, పనీర్, గుడ్లు.

2. బయోటిన్ - విటమిన్ బి7 (Biotin)..

కురుల ఎదుగుదలకు బయోటిన్ అత్యంత కీలకమైన విటమిన్. ఇది కేశాల కణాలను దృఢంగా మార్చి జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

లభించే పదార్థాలు: గుడ్డులోని పచ్చసొన, అరటిపండ్లు, వేరుశెనగ, బాదం, చిలగడదుంప, తృణధాన్యాలు.

3. ఐరన్ (Iron)..

రక్త ప్రసరణ ద్వారా కుదుళ్లకు ఆక్సిజన్‌ను చేరవేయడంలో ఐరన్ సహాయపడుతుంది. దీని లోపం వల్ల కేశాలకు సరైన పోషణ అందక, జుట్టు రాలడం మొదలవుతుంది. ఐరన్ పదార్థాలను విటమిన్-సి (నిమ్మ, ఉసిరి లాంటివి) తో కలిపి తీసుకుంటే శరీరం వాటిని త్వరగా శోషించుకుంటుంది.

లభించే పదార్థాలు..పాలకూర, బీట్‌రూట్, దానిమ్మ, బెల్లం, ఖర్జూరం, ఆకుకూరలు.

4. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు (Omega-3)..

తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, కుదుళ్లకు అవసరమైన తేమను అందించడంలో ఇవి సాయపడతాయి. జుట్టు పొడిబారడం, చుండ్రు లాంటి సమస్యలను తగ్గిస్తాయి.

లభించే పదార్థాలు... అవిసె గింజలు, చియా సీడ్స్, వాల్‌నట్స్, కొవ్వు అధికంగా ఉండే చేపలు.

5. విటమిన్ - ఇ (Vitamin E)..


ఇది అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచి, దెబ్బతిన్న కుదుళ్లకు జీవం పోస్తుంది. తద్వారా కొత్త జుట్టు వేగంగా పెరుగుతుంది.

లభించే పదార్థాలు: బాదం, పొద్దుతిరుగుడు గింజలు, అవకాడో, పాలకూర.

6. జింక్ (Zinc)..

దెబ్బతిన్న జుట్టు కణజాలాన్ని బాగుచేయడంలో, తల చర్మంపై నూనె గ్రంథులు సరిగ్గా పనిచేసేలా చేయడంలో జింక్ పాత్ర ఎంతో ముఖ్యం. దీని లోపం కూడా జుట్టు రాలడానికి దారితీస్తుంది.

లభించే పదార్థాలు..

గుమ్మడి గింజలు, నువ్వులు, తృణధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు. బాహ్య సౌందర్య ఉత్పత్తుల మీద పెట్టే శ్రద్ధ, తీసుకునే ఆహారం మీద కూడా పెడితే జుట్టు రాలే సమస్యను సహజంగానే అరికట్టవచ్చు.  

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.