Hair Care Tips : ఉంగరాల జుట్టు మెరిసిపోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
సాక్షి లైఫ్ : చర్మతత్వాల్లో రకాలు ఉన్నట్లే.. జుట్టు స్వభావంలోనూ తేడాలుంటాయి. అందులోనూ ఉంగరాల జుట్టు (curly hair) ప్రత్యేకమైన ఆకర్షణను ఇస్తుంది. అయితే, సాధారణ జుట్టుకు పాటించే సంరక్షణ పద్ధతులే ఉంగరాల జుట్టుకూ సరిపోతాయనుకోవడం పెద్ద పొరపాటే..! దీని సర్పిలాకార ఆకృతి కారణంగా తలలోని సహజ నూనెలు కురుల చివరి వరకు సరిగ్గా అందవు. ఫలితంగా ఉంగరాల జుట్టు త్వరగా పొడిబారిపోతుంటుంది. అందుకే, ఈ తరహా జుట్టు ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ ముంగురుల మెరుపును కాపాడుకోవడానికి పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఇవే..
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
1. సల్ఫేట్ షాంపూలకు గుడ్‌బై..!
మార్కెట్లో లభించే సాధారణ షాంపూలలో సల్ఫేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టులోని సహజసిద్ధమైన నూనెలను తొలగించి, కురులను నిర్జీవంగా మారుస్తాయి. అందువల్ల, ఉంగరాల జుట్టు ఉన్నవారు ఎల్లప్పుడూ 'సల్ఫేట్ రహిత' (sulfate free) షాంపూలనే ఎంచుకోవాలి.
2. తేమను అందించడం ముఖ్యం..
సహజంగానే పొడిబారే తత్వం ఉన్నందున ఉంగరాల జుట్టుకు 'డీప్ కండిషనింగ్' ఎంతో అవసరం. ఇది జుట్టుకు కావలసిన పోషణను అందించి తేమను నిలిపి ఉంచుతుంది. కండీషనర్ వాడకపోతే జుట్టు మరింతగా చిక్కుపడిపోయే ప్రమాదం ఉంది.
3. తలస్నానానికి ముందు దువ్వద్దు..!
చాలామంది తలస్నానం చేయడానికి ముందు జుట్టును గట్టిగా దువ్వుతుంటారు. ఉంగరాల జుట్టు విషయంలో ఇలా చేస్తే కురులు తెగిపోయే ప్రమాదం ఎక్కువ. జుట్టు చిక్కులు తీయాలనుకుంటే.. స్నానానికి ముందు కాస్త కండీషనర్ రాసి, వేళ్లతోనే మెల్లగా చిక్కులను విడదీయడానికి ప్రయత్నించాలి.
4. కొబ్బరి నూనెతో పోషణ..
మెలికలు తిరిగి, దట్టంగా ఉండే జుట్టుకు ఎక్కువ తేమ అవసరమవుతుంది. ఇందుకోసం ఖరీదైన ప్రొడక్ట్స్ అవసరం లేదు. మన ఇళ్లలో దొరికే స్వచ్ఛమైన కొబ్బరి నూనెను వాడితే సరిపోతుంది. ఇది జుట్టుకు అద్భుతమైన కవచంలా పనిచేస్తుంది.
5. గరుకైన టవల్స్ వద్దు.. టీ-షర్ట్ ముద్దు..!
తలస్నానం చేసిన తర్వాత జుట్టును గరుకుగా ఉండే టవల్‌తో గట్టిగా తుడవడం వల్ల జుట్టులోని తేమ నశించి, కుదుళ్లు బలహీన పడతాయి. కాబట్టి, తడిని పీల్చుకోవడానికి మృదువైన కాటన్ టవల్ లేదా పాత కాటన్ టీ షర్ట్‌ను ఉపయోగించడం ఉత్తమం.
6. సహజంగానే ఆరనివ్వండి..
హెయిర్ డ్రైయర్లతో వేడి గాలిని అందించి జుట్టును ఆరబెట్టే ప్రయత్నం చేయకండి. జుట్టును సహజమైన గాలికే ఆరనివ్వాలి, అప్పుడే కర్ల్స్ వాటి అసలు ఆకృతిని పొందుతాయి. రాత్రి నిద్రపోయేటప్పుడు జుట్టు ఆకారం చెడిపోకుండా ఉండటానికి.. తలపై వదులుగా ఉండే 'పైనాపిల్ బన్' అంటే పైకి వదులుగా ముడి వేసుకోవడం వేసుకోవాలి.
7. హీట్ స్టైలింగ్‌కు దూరం..
ఉంగరాల జుట్టుకు వీలైనంత వరకు హీట్ స్టైలింగ్ పరికరాలను వాడకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో స్టైలింగ్ చేయాల్సి వస్తే.. ముందుగా తేలికపాటి 'కర్ల్ క్రీమ్' లేదా 'హీట్ ప్రొటెక్టెంట్' రాసిన తర్వాతే ఆయా సాధనాలను ఉపయోగించాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే, మీ ఉంగరాల జుట్టు చిక్కులు పడకుండా, ఆరోగ్యంగా మెరుస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
