Anemia : రక్తహీనత ఉందా..? నిర్లక్ష్యం వద్దు.. అది పెద్దపేగు క్యాన్సర్‌కు ముందస్తు సంకేతం కావొచ్చు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : శరీరంలో ఇనుము లోపించడం ( iron deficiency)వల్ల రక్తహీనత (anemia) వస్తుందని మనందరికీ తెలుసు. అయితే, ఒక వ్యక్తి తరచుగా ఐరన్ లోపం బారిన పడుతుంటే అది కేవలం పోషకాహార లోపం మాత్రమే కాకపోవచ్చు. తీవ్రమైన రక్తహీనత అనేది పెద్దప్రేగు క్యాన్సర్‌ (colorectal cancer)కు తొలి సంకేతం కావొచ్చన్న విషయం చాలామందికి తెలియదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

 

'ఫెర్రిటిన్' (Ferritin) పరీక్ష ఎందుకు కీలకం..?

రక్తహీనతను లేదా ఇనుము లోపాన్ని గుర్తించడానికి చాలామంది సాధారణ రక్త పరీక్షలు చేయించుకుంటారు. కానీ, శరీరంలో వాస్తవంగా ఎంత ఇనుము నిల్వ ఉందో కచ్చితంగా తెలుసుకోవడానికి 'ఫెర్రిటిన్' పరీక్ష అత్యుత్తమమైనది.

కొన్నిసార్లు సాధారణ రక్త పరీక్షల నివేదికల్లో ఐరన్ స్థాయిలు మామూలుగానే ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ వాస్తవానికి శరీరంలో ఇనుము నిల్వలు పూర్తిగా అడుగంటిపోయి ఉంటాయి. ఫెర్రిటిన్ పరీక్ష ద్వారా కచ్చితమైన నిల్వలను స్పష్టంగా గుర్తించి, ముంచుకొస్తున్న ప్రమాదాన్ని పసిగట్టవచ్చు.

ఆందోళన పెంచుతున్న డబ్ల్యూహెచ్‌ఓ (WHO) గణాంకాలు.. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అత్యధికంగా బలితీసుకుంటున్న క్యాన్సర్ మరణాల్లో పెద్దప్రేగు క్యాన్సర్‌ది రెండో స్థానం. అలాగే అత్యధికంగా సోకే క్యాన్సర్లలో ఇది మూడో స్థానంలో ఉంది.

2022 గణాంకాలను పరిశీలిస్తే..

ప్రపంచవ్యాప్తంగా సుమారు 19 లక్షల కొత్త పెద్దప్రేగు క్యాన్సర్ కేసులు నమోదు కాగా, 9 లక్షల మందికి పైగా ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని దశాబ్దాలుగా 30 ఏళ్లలోపు యువతలోనూ ఈ పేగు క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతుండటం అత్యంత ఆందోళన కలిగించే విషయం.

పెద్దప్రేగు క్యాన్సర్.. ప్రధాన లక్షణాలు ఇవే..

పెద్దప్రేగు లేదా పురీషనాళంలో (Rectum) మొదలయ్యే ఈ క్యాన్సర్‌ను కోలోరెక్టల్ క్యాన్సర్ అంటారు. కింది లక్షణాలను ముందుగానే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు..మల విసర్జన అలవాట్లలో నిరంతర మార్పులు రావడం లేదా, తరచుగా నీళ్ల విరేచనాలు లేదా తీవ్రమైన మలబద్ధకం. మలంలో రక్తం పడటం లేదా రంగు మారడం.ఎలాంటి కారణం, ప్రయత్నం లేకుండానే అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం. తీవ్రమైన ఐరన్ లోపం, నిరంతర అలసట, నీరసం.

తొలిదశలో గుర్తిస్తే పూర్తి విజయం..

క్యాన్సర్ అనగానే భయపడాల్సిన పనిలేదు, తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. ఇందుకు 'లారా' అనే మహిళ ఉదంతమే ఒక చక్కని ఉదాహరణ. లారా శరీరంలో ఐరన్ లోపాన్ని గమనించిన వైద్యులు, తదుపరి పరీక్షల ద్వారా పెద్దప్రేగులో క్యాన్సర్ కణితిని గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి పెద్దప్రేగులోని కణితి ఉన్న భాగాన్ని విజయవంతంగా తొలగించారు. ఆ తర్వాత ముందుజాగ్రత్తగా 12 వారాల పాటు కీమోథెరపీ అందించారు. ప్రస్తుతం లారా పూర్తిగా క్యాన్సర్ రహితంగా, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతోంది. నిరంతర రక్తహీనత, జీర్ణకోశ సమస్యలు లేదా మల విసర్జనలో ఏవైనా మార్పులు గమనిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం బెటర్.

 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.