Type 2 Diabetes : యువతుల్లో వేగంగా పెరుగుతున్న టైప్-2 మధుమేహం..! కారణాలేంటి అంటే..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సాధారణంగా మధుమేహం అనగానే వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ, ఇటీవల కాలంలో ఈ అంచనాలు తారుమారవుతున్నాయి. 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న యువతలో, ముఖ్యంగా యువతుల్లో టైప్-2 డయాబెటీస్ బారిన పడుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోందని ఒక తాజా అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది.'ది లాన్సెట్ రీజినల్ హెల్త్ యూరప్' (Lancet Regional Health Europe) పత్రికలో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం.. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ నిపుణులు ఇంగ్లాండ్‌కు చెందిన జాతీయ డయాబెటిస్ డేటా (2011-2024) ఆధారంగా ఈ విషయాలను స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

పెద్దల్లో తగ్గుతోంది.. యువతలో పెరుగుతోంది..!

ఈ అధ్యయనంలో ఒక ఆసక్తికరమైన, ఆందోళనకరమైన విషయం వెలుగుచూసింది. సాధారణంగా ఎక్కువ సంఖ్యలో మధుమేహం బారిన పడే పెద్ద వయస్కులలో (Older Adults) కొత్త కేసుల నమోదు తగ్గుముఖం పడుతోంది. కానీ 40 ఏళ్ల లోపు వారిలో మాత్రం టైప్-2 మధుమేహం తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. అందులోనూ 20 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ఈ సమస్యకు ప్రధానంగా గురవు తున్నారు.

కేవలం కొన్ని వర్గాలకే పరిమితం కాదు..!

ఇంతకుముందు చిన్న వయసులోనే వచ్చే టైప్-2 డయాబెటీస్  కేవలం కొన్ని మైనారిటీ వర్గాలకే పరిమితమనే భావన ఉండేది. కానీ ఈ కొత్త పరిశోధన ప్రకారం.. 20 నుంచి 29 ఏళ్ల వయసున్న ఆసియా, బ్లాక్, శ్వేతజాతీయుల మహిళలతో పాటు.. 30 నుంచి 39 ఏళ్ల వయసున్న శ్వేతజాతీయుల మహిళల్లోనూ ఈ ముప్పు గణనీయంగా పెరిగింది. దీన్ని బట్టి ఈ ఆరోగ్య సమస్య కేవలం ఒక ప్రత్యేక వర్గానికి పరిమితం కాకుండా అందరికీ విస్తరిస్తోందని పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్ శివానీ మిశ్రా తెలిపారు.

పెరిగిన బిఎమ్‌ఐ (BMI).. తీవ్రమైన స్థూలకాయం..!

యువతలో టైప్-2 డయాబెటిస్ పెరగడానికి ప్రధాన కారణం తీవ్రమైన స్థూలకాయం (Severe Obesity) అని పరిశోధకులు గుర్తించారు. వయోధికులతో పోలిస్తే, యువత డయాబెటిస్ బారిన పడే సమయంలో వారి బాడీ మాస్ ఇండెక్స్ (BMI) పెరిగే వేగం దాదాపు రెట్టింపుగా ఉంది. చిన్న వయసులోనే షుగర్ వ్యాధి నిర్ధారణ అయిన కొందరు యువతులలో బిఎమ్‌ఐ ఏకంగా 40 kg/m కు దగ్గరగా నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

చిన్న వయసులోనే షుగర్ వస్తే ఏమవుతుంది..?

తక్కువ వయసులోనే మధుమేహం రావడం వల్ల జీవితకాలంలో ఎక్కువ కాలం ఈ వ్యాధితో జీవించాల్సి వస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, నరాల బలహీనత వంటి తీవ్రమైన సమస్యలు చాలా తక్కువ వయసులోనే చుట్టుముడతాయి. మహిళల్లో గర్భధారణ సమయంలో తీవ్రమైన ఆరోగ్య చిక్కులు ఎదురవుతాయి. వ్యాధి తీవ్రత పెరిగి అకాల మరణం సంభవించే ప్రమాదం పెరుగుతుంది.

నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

ప్రస్తుతం అమల్లో ఉన్న మధుమేహ నివారణ కార్యక్రమాలు యువతరాన్ని తగినంతగా చేరుకోవడంలో విఫలమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికోసం ప్రభుత్వం, సమాజం కలిసి తక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల ప్రకటనలపై ఆంక్షలు విధించాలి. శారీరక శ్రమ లేకపోవడం, గంటల తరబడి కూర్చుని ఉండటం తగ్గించి దినచర్యలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి.

ప్రమాదంలో ఉన్న యువతను ముందే గుర్తించి డయాబెటిస్ పరీక్షలు నిర్వహించాలి. తీవ్రమైన స్థూలకాయం ఉన్నవారు వైద్యుల పర్యవేక్షణలో బరువు తగ్గించే చికిత్సలు, జీవనశైలి మార్పులు పాటించాలి. చిన్నవయసు నుంచే ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు పాటిస్తూ, బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా ఈ దీర్ఘకాలిక వ్యాధి బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.