Healthy Diet Rules: ఆరోగ్యకరమైన డైట్ కోసం పాటించాల్సిన నియమాలు..
సాక్షి లైఫ్ : రోజూ సమయానికి భోజనం చేస్తున్నాం కదా.. అయినా తరచూ ఎందుకు అనారోగ్యాల బారిన పడుతున్నాం..? ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది. కడుపు నిండా తినడం వేరు, శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడం వేరు. మనం తీసుకునే ఆహారం కేవలం ఆకలిని తీర్చేదిగా కాకుండా, శరీరానికి బలాన్నిచ్చేదిగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మన రోజువారీ ఆహారపు అలవాట్లలో మనం చేస్తున్న ప్రధాన పొరపాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?
సమతుల్యత లోపించిన ప్లేట్..
మన భోజనంలో అన్నం లేదా రోటీల శాతం ఎక్కువగా ఉండి, కూరలు, పప్పుల శాతం తక్కువగా ఉంటుంది. కేవలం తెల్ల బియ్యం, మైదాతో చేసిన పదార్థాలు కడుపు నింపుతాయి కానీ, శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లను అందించలేవు. ప్లేట్లో తృణధాన్యాలతో పాటు పప్పులు, కూరగాయలు సమాన పాళ్లలో ఉండాలి.
ప్రాసెస్డ్ ఫుడ్స్ తో చేటు..
చిప్స్, బిస్కెట్లు, ఇన్స్టంట్ నూడుల్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, శీతల పానీయాలు త్వరగా ఆకలి తీరుస్తాయి. కానీ వీటిలో ఉప్పు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు మోతాదుకు మించి ఉంటాయి. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను ఎంత తగ్గిస్తే ఆరోగ్యం అంత మెరుగుపడుతుంది.
పండ్లు, కూరగాయల కొరత..
పదేళ్లు దాటిన ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 400 గ్రాముల పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. అలాగే 25 గ్రాముల సహజ ఫైబర్ (Fiber) శరీరానికి అందాలి. రుతువులను బట్టి దొరికే తాజా పండ్లను రోజూ తీసుకోవడం వల్ల ఫైబర్‌తో పాటు ఎన్నో రకాల విటమిన్లు శరీరానికి అందుతాయి.
బరువును బట్టి ఆరోగ్యాన్ని అంచనా వేయొద్దు..
బయటకు సన్నగా లేదా సాధారణ బరువుతో కనిపించినంత మాత్రాన పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. పైకి ఫిట్ గా కనిపించే వారిలోనూ ప్రోటీన్, ఫైబర్, సూక్ష్మ పోషకాల (Micronutrients) లోపం ఉండే అవకాశం ఉంది. కాబట్టి 'తక్కువ తినడం' కాదు, 'సరైన ఆహారం తినడం' ముఖ్యం.
ఆరోగ్యకరమైన డైట్ కోసం పాటించాల్సిన నియమాలు..
మీ భోజనపు పళ్లెంలో రంగురంగుల కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, తృణధాన్యాలు, నట్స్, సీడ్స్ ఉండేలా చూసుకోండి. కేవలం పండ్లు, కూరగాయలు తినడమే కాదు.. వంటల్లో వాడే నూనె, ఉప్పు, చక్కెరల పట్ల కూడా శ్రద్ధ వహించాలి. మీరు రోజుకు తీసుకునే మొత్తం క్యాలరీల్లో చక్కెర శాతం 10శాతం కంటే తక్కువగా ఉండాలి. రక్తపోటు, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పును అంటే దాదాపు ఒక టీ స్పూన్ మాత్రమే వినియోగించాలి. ఈ చిన్నపాటి మార్పులు మన దైనందిన జీవితంలో చేసుకుంటే, బలహీనత దూరమై సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?
ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
