AIIMS Experts’ Study Reveals : వైద్య ఖర్చుల్లో 48 శాతం ప్రజల సొంత సొమ్మే..ఎయిమ్స్’ నిపుణుల అధ్యయనంలో చేదు నిజాలు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దేశంలో వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెరుగుతున్నాయని చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో సామాన్యుడి ఆరోగ్య పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉందని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. హాస్పిటల్ మెట్లెక్కితే సగం జేబు ఖాళీ అవ్వాల్సిందేనని, గ్రామీణ ప్రాంతాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత తీవ్రంగా ఉందని పరిశోధకులు తేల్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎయిమ్స్ మంగళగిరి, పశ్చిమ బెంగాల్ ఎయిమ్స్ కళ్యాణి, ఢిల్లీ మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ నిపుణులు సంయుక్తంగా నిర్వహించిన "భారతదేశంలో ప్రజారోగ్య పరిపాలన" అనే అధ్యయనంలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. 

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?

 

సగం ఖర్చు సొంత జేబు నుంచే..!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ.. మందులు, ల్యాబ్ పరీక్షలు, ఇతర అత్యవసరాల కోసం ప్రజలు ఇప్పటికీ తమ మొత్తం వైద్య ఖర్చులలో దాదాపు 48 శాతం సొంతంగానే భరిస్తున్నారు. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారంగా మారుతోంది. 

నిపుణులు లేని ‘కమ్యూనిటీ’ ఆసుపత్రులుగ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజలకు పెద్ద దిక్కైన కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు (CHC) కేవలం భవనాలకే పరిమితమవుతున్నాయి.ఈ కేంద్రాలలో ఏకంగా 80 శాతం స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిపుణులు లేకపోవడంతో చిన్న సమస్య వచ్చినా రోగులు వందల కిలోమీటర్లు ప్రయాణించి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన కాకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించడం వల్ల నిరంతరం సిబ్బంది కొరత, ఉద్యోగ అస్థిరత వేధిస్తోంది. 

రోజుకు 8 రూపాయలే..

ఆరోగ్యంపై భారతదేశంలో ప్రభుత్వ వ్యయం స్థూల దేశీయోత్పత్తి (GDP) లో కేవలం 2.1 శాతం మాత్రమే. ప్రపంచ సగటు 5 నుంచి 6 శాతంగా ఉంటే, మన దగ్గర కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయి. గణాంకాల ప్రకారం..2022-23 నాటికి ప్రతి వ్యక్తిపై ప్రభుత్వం ఏడాదికి సగటున రూ.2,800 నుంచి రూ.2,900 ఖర్చు చేస్తోంది. అంటే ఒక భారత పౌరుడి ఆరోగ్యం కోసం ప్రభుత్వం రోజుకు పెడుతున్న ఖర్చు కేవలం రూ.8 మాత్రమేనని ఈ నివేదిక విశ్లేషించింది. 

అద్దె ఇళ్లల్లో సబ్ సెంటర్లు.. 

ల్యాబ్‌లు లేని పీహెచ్‌సీలుదేశంలో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని నివేదిక ఎత్తిచూపింది. అనేక ఆరోగ్య ఉప కేంద్రాలు ఇప్పటికీ అద్దె ఇళ్లలో, శిథిలావస్థకు చేరిన భవనాల్లో నడుస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (PHC) కనీస ల్యాబ్ పరీక్షల సౌకర్యాలు లేవు. ఇక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో బ్లడ్ స్టోరేజ్ యూనిట్లు, నవజాత శిశు సంరక్షణ (NICU) కేంద్రాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇదే అరకొర సిబ్బంది కష్టాలు పునరావృతమవుతున్నాయి. 

అసమానతలు..

ఆరోగ్య సేవలు అందించడంలో దేశంలోని రాష్ట్రాల మధ్య తీవ్ర అసమానతలు ఉన్నాయి. కేరళ, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన ఆరోగ్య సూచికలతో ముందంజలో ఉండగా.. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు వైద్య సదుపాయాల కల్పనలో ఇంకా చాలా వెనుకబడి ఉన్నాయని ఎయిమ్స్ నివేదిక స్పష్టం చేసింది. జిడిపిలో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచి, గ్రామీణ వైద్యంలో ఖాళీలను భర్తీ చేయకపోతే సామాన్యుడికి ‘ఆరోగ్య భారతం’ కలగానే మిగిలిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.