Coronavirus : మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి.. కడపలో కరోనా కలకలం..!
సాక్షి లైఫ్ : నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లాలో మళ్లీ కరోనా కేసులు వెలుగుచూడటం, ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇటీవల నిర్వహించిన ఆర్టీ పీసీఆర్ (RT PCR) పరీక్షల్లో నలుగురికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే, ఈ పరిణామాలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..?
ప్రస్తుతం నమోదైన కేసుల్లో ముగ్గురు స్వల్ప లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా, ఒకరు మాత్రం ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
‘అనారోగ్య సమస్యలు’ ఉన్నవారికే ముప్పు..!
మరణించిన ఇద్దరు బాధితులు కూడా తీవ్రమైన ఇతర ఆరోగ్య సమస్యలతో (Comorbidities) బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. వీరిలో ఒకరు తిరుపతి స్విమ్స్ నుంచి వేలూరు సీఎంసీకి వెళ్లిన తర్వాత పరిస్థితి విషమించి కన్నుమూశారు. కరోనా వైరస్ తీవ్రత మునుపటితో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు తగ్గినప్పటికీ, అనారోగ్యసమస్యలు ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
తీవ్రమైన మధుమేహం, గుండె జబ్బులు
ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు
కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ బాధితులు
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వృద్ధులు
వైరస్ సోకినప్పుడు సాధారణ వ్యక్తుల్లో అది స్వల్ప జ్వరం, జలుబుతో తగ్గిపోవచ్చు. కానీ ఊపిరితిత్తులు, గుండె బలహీనంగా ఉన్నవారిలో ఇది శ్వాసకోశ ఇబ్బందులకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే ముందస్తు నిర్ధారణ, సరైన సమయంలో చికిత్స చాలా ముఖ్యం.
వ్యాక్సిన్ వేసుకున్నా వస్తుందా..?
ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన వారు ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్, కొందరు బూస్టర్ డోస్ కూడా తీసుకున్నట్లు సమాచారం. టీకా వేసుకోవడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గుతుందే తప్ప, వైరస్ అస్సలు సోకదని చెప్పలేమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. దీన్నే వైద్య పరిభాషలో 'బ్రేక్‌థ్రూ ఇన్‌ఫెక్షన్' అంటారు. కరోనా ఇంకా పూర్తిగా అంతరించిపోలేదని ఈ ఘటనలు గుర్తుచేస్తున్నాయి. సమాజంలో తీవ్రమైన వ్యాప్తి ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినా, వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం ఎల్లప్పుడూ మంచిది.
చేతుల పరిశుభ్రత.. సబ్బుతో తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి.
మాస్కు ధరించడం..జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నప్పుడు పది మందిలోకి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్కు ధరించాలి. రద్దీగా ఉండే ఇండోర్ ప్రాంతాల్లో జాగ్రత్త అవసరం.
సొంత వైద్యం వద్దు..జ్వరం లేదా గొంతు నొప్పి తీవ్రంగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
గాలి వెలుతురు.. ఇళ్లు, ఆఫీసుల్లో గాలి ధారాళంగా ఆడేలా (Ventilation) చూసుకోవడం వల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు.
ఇది కేవలం ముందస్తు అప్రమత్తత కోసం చేసిన హెచ్చరికే కానీ, పాత లాక్‌డౌన్ రోజులు మళ్లీ వస్తాయనే ఆందోళన అవసరం లేదు. భయాందోళనలు వీడి, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే మన ఆరోగ్యాన్ని, సమాజ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
