New Rule for Medical Shops : మెడికల్ షాపుల్లో ఇకనుంచి కొత్త రూల్ : ఆ సిరప్‌లకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి..!
సాక్షి లైఫ్ : మందుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. ఇకపై స్థానిక మెడికల్ స్టోర్లలో లభించే ఆల్కహాల్ కంటెంట్ ఉన్న సిరప్లు, ఇతర నోటి ద్వారా తీసుకునే ఔషధాలపై గట్టి నిఘా పెట్టనుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 'డ్రగ్స్ పదవ సవరణ నిబంధనలు, 2026'ను నోటిఫై చేసింది. అధికారిక గెజెట్‌లో ప్రచురితమైన ఆరు నెలల తర్వాత ఈ కొత్త చట్టం అమల్లోకి రానుంది.
ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..?
12శాతం దాటితే 'షెడ్యూల్ H1' పరిధిలోకి..
కొత్త నిబంధనల ప్రకారం, 30 ఎంఎల్ (ml) కంటే పెద్ద ప్యాకేజింగ్ కలిగి ఉండి, అందులో 12 శాతం కంటే ఎక్కువ ఇథైల్ ఆల్కహాల్ ఉన్న అన్ని రకాల ద్రవరూప మందులను 'షెడ్యూల్ H1' జాబితాలోకి చేర్చారు.
నియంత్రణ ఇలా..
ఈ జాబితాలోకి వచ్చిన మందులను మెడికల్ షాపుల వారు కస్టమర్ అడగ్గానే నేరుగా విక్రయించడానికి వీల్లేదు. కచ్చితంగా రిజిస్టర్డ్ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్మాల్సి ఉంటుంది.
రికార్డుల నిర్వహణ..
వైద్య దుకాణాలు కూడా ఈ తరహా మందుల విక్రయాలకు సంబంధించిన పూర్తి రికార్డులను, నిబంధనల ప్రకారం విడిగా నిర్వహించడం తప్పనిసరి.
మత్తు కోసం వాడుతున్నారనే ఆందోళనతోనే..
యాలకులు, అల్లం మరియు ఇతర సుగంధ ద్రవ్యాలతో కూడిన కొన్ని ఆయుర్వేద, అలోపతి టింక్చర్లలో 80 నుంచి 90 శాతం వరకు ఇథైల్ ఆల్కహాల్ ఉంటోంది. ఇప్పటివరకు వీటికి 'షెడ్యూల్ కె' కింద లైసెన్సింగ్ నిబంధనల నుండి మినహాయింపు ఉండేది. అయితే, ఈ మందులను చికిత్స కోసం కాకుండా, చాలామంది మత్తు కోసం దుర్వినియోగం చేస్తున్నట్లు పలు రాష్ట్రాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి.
ప్రభుత్వ తాజా సవరణ..
12 శాతం కంటే ఎక్కువ ఇథైల్ ఆల్కహాల్ ఉండి, 30 ml కంటే పెద్ద ప్యాకింగ్‌లో ఉండే ఔషధాలకు ఇకపై ఎలాంటి మినహాయింపులు ఉండవు. 'డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940' ప్రకారం వీటి తయారీ, అమ్మకాలకు డ్రగ్ లైసెన్స్ తీసుకోవడం వంద శాతం తప్పనిసరి. అయితే, 12 శాతం కంటే ఎక్కువ విటమిన్-ఏ ఉన్న నోటి ద్వారా తీసుకునే మందులకు మాత్రం దీని నుండి మినహాయింపు ఇచ్చారు.
కఠిన పర్యవేక్షణ.. ప్రజారోగ్య రక్షణే లక్ష్యం..
అధిక ఆల్కహాల్ గాఢత ఉన్న మందులు అధీకృత ఫార్మాస్యూటికల్ మార్గాల ద్వారా మాత్రమే పంపిణీ అయ్యేలా చూడటమే ఈ సవరణ ముఖ్య ఉద్దేశమని కేంద్రం పేర్కొంది.
దీనివల్ల కలిగే ప్రయోజనాలు..
యువత లేదా కొందరు వ్యక్తులు ఈ మందులను వ్యసనంగా మార్చుకునే ప్రమాదం తప్పుతుంది. అవసరమైన వారికే సరఫరా: నిజంగా అనారోగ్యంతో ఉండి, వైద్యుల సూచన మేరకు వాడే రోగులకు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. దేశంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్రజారోగ్య భద్రతను నిర్ధారించడానికి ఈ చర్య అత్యంత కీలకమైన ముందడుగని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల (జూన్ 16న) కూడా దగ్గు మందులతో (Cough Syrups) సహా పలు సిరప్‌ల విక్రయాలకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
