The Real Truth : హాలీవుడ్ స్టార్స్ జీరో సైజ్ వెనుక అసలు నిజాలివే..!
సాక్షి లైఫ్ : ప్రతిష్టాత్మక ఆస్కార్ 2026 వేడుకలు ఒకవైపు అవార్డుల సందడితో మెరిసిపోతుంటే.. మరోవైపు హాలీవుడ్ ప్రముఖుల శారీరక మార్పులు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రెడ్ కార్పెట్‌పై స్టార్స్ జీరో సైజ్ కు మారడం వెనుక 'ఒజెంపిక్' (Ozempic) వంటి బరువు తగ్గించే మందుల మితిమీరిన వాడకం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
డయాబెటిస్ మందుతో బరువు తగ్గొచ్చా..?
నిజానికి 'ఒజెంపిక్' (GLP-1) అనేది టైప్-2 డయాబెటిస్ చికిత్స కోసం రూపొందించిన మందు. అయితే, తక్కువ సమయంలోనే అధిక బరువు తగ్గి, యవ్వనంగా కనిపించాలనే కోరికతో సెలబ్రిటీలు దీనిని విచ్చలవిడిగా వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆస్కార్ వేడుకల్లో డెమీ మూర్, నికోల్ కిడ్‌మన్, ఎమ్మా స్టోన్ వంటి అగ్రతారలు మునుపటి కంటే చాలా సన్నగా కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. 63 ఏళ్ల వయసులోనూ యవ్వనం కోసం పాకులాడుతూ తారలు తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది.
తిరిగి వస్తున్న 'హెరాయిన్ చిక్' ధోరణి..?
1990ల కాలంలో అత్యంత సన్నగా, పక్కటెముకలు బయటకు కనిపించేలా ఉండటాన్ని 'హెరాయిన్ చిక్' స్టైల్‌గా భావించేవారు. ఇప్పుడు మళ్లీ అదే ప్రమాదకరమైన ట్రెండ్ హాలీవుడ్‌లో కనిపిస్తోంది. ఇప్పటికే ఓప్రా విన్ఫ్రే, రెబెల్ విల్సన్ వంటి వారు తాము బరువు తగ్గడానికి మందులు వాడామని బహిరంగంగానే అంగీకరించారు. అయితే, మరికొందరు తారలు తమ సన్నబడటం వెనుక ఉన్న రహస్యాన్ని దాస్తున్నప్పటికీ, వారి శరీరాల్లో కనిపిస్తున్న మార్పులు ఓజెంపిక్ వాడకాన్ని స్పష్టం చేస్తున్నాయి.
తీవ్రమైన దుష్ప్రభావాలు.. హెచ్చరిస్తున్న నిపుణులు..
అందంగా కనిపించడం కోసం వాడే ఈ మందుల వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. క్లోమ గ్రంథి వాపు(inflammation of the pancreas)వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తవచ్చు. వేగంగా బరువు తగ్గడం వల్ల చర్మం వదులుగా మారిపోవడం, ఎముకలు బలహీనపడటం, దంతాలు ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిరంతరం వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు పీడించవచ్చు.
గ్లామర్ ప్రపంచంలో పోటీని తట్టుకోవడానికి ప్రాణాల మీదకు తెచ్చుకునే ఇటువంటి ప్రయోగాలు చేయడం సరికాదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కృత్రిమ పద్ధతుల్లో కాకుండా సహజ సిద్ధమైన వ్యాయామం, సరైన ఆహారంతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
