War Impact : యుద్ధం ఎఫెక్ట్ : మరింత భారం కానున్న దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలు.. 

షేర్ చేయండి:
War Impact : యుద్ధం ఎఫెక్ట్ : మరింత భారం కానున్న దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలు.. 

సాక్షి లైఫ్ : పశ్చిమ ఆసియాలో అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు కేవలం చమురు, దౌత్య రంగానికే పరిమితం కాకుండా.. ఇప్పుడు సామాన్యుడి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. గ్యాస్, ఇంధన సంక్షోభం దాటి ఈ యుద్ధ వాతావరణం ఇప్పుడు ఫార్మా రంగాన్ని, ఆరోగ్య సంరక్షణ సేవలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. మందుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల సరఫరా గొలుసు విచ్ఛిన్నం కావడంతో ప్రాణరక్షక ఔషధాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలు మరింత భారంగా మారనున్నాయని నిపుణులు హెచ్చరిస్తు న్నారు.

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

ఏపీఐల కొరత..నష్టాల్లో ఫార్మా సంస్థలు..

ప్రపంచ ఫార్మా రంగం అంతర్జాతీయ ముడి పదార్థాల సరఫరాపైనే ఆధారపడి నడుస్తోంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో సముద్ర రవాణా మార్గాల్లో ప్రమాదాలు పెరగడం, లాజిస్టిక్స్ వ్యయం భారమవ్వడం, అంతర్జాతీయంగా కరెన్సీ రేట్లలో మార్పుల వల్ల 'యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్' (API) ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్లాటినం ధరలు సైతం పెరగడంతో కీమోథెరపీ మందుల తయారీ కంపెనీలకు భారీగా నష్టాలు వస్తున్నాయి. ప్రస్తుత నియంత్రిత ధరల వద్ద ఔషధాల ఉత్పత్తి లాభదాయకం కాకపోవడంతో, కొన్ని కంపెనీలు ఉత్పత్తిని తగ్గించడమో లేదా నిలిపివేయడమో చేస్తున్నాయి. సుమారు 82 మందుల ధరల పెంపునకు అనుమతించాలని ఫార్మా రంగానికి చెందిన నివేదికలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.

క్యాన్సర్ చికిత్సకు బ్రేక్..!

క్యాన్సర్ నిర్మూలనలో కీలక పాత్ర పోషించే అత్యవసర కీమోథెరపీ మందులైన సిస్ప్లాటిన్ (Cisplatin), కార్బోప్లాటిన్ (Carboplatin) లతో పాటు టెటానస్ నివారణకు వాడే ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ల ధరలు దేశీయంగా పెరుగుతున్నాయి. ఊపిరితిత్తులు, అండాశయం, మూత్రాశయం, జీర్ణాశయం, తల, మెడ భాగాల్లో వచ్చే క్యాన్సర్ల చికిత్సలో ఈ మందులు అత్యంత కీలకం. దేశవ్యాప్తంగా గత రెండు మూడు వారాలుగా ప్రధాన ఆసుపత్రులలో ఈ ఔషధాల లభ్యత గణనీయంగా తగ్గిపోవడంతో రోగులకు సకాలంలో కీమోథెరపీ అందించడం కష్టంగా మారుతోంది.

చికిత్స ఆలస్యమైతే రోగి ప్రాణాలకే ముప్పని వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్ మందుల కొరత తీవ్రంగా ఉంది. అడ్వాన్స్‌డ్ క్యాన్సర్ బాధితుల్లో 60 నుంచి 70 శాతం మందికి ఇవే ప్రాణాధారం. సమయానికి ఇవి అందకపోతే వ్యాధి ముదిరే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

 ప్రపంచవ్యాప్తంగా ఇవి అత్యంత ముఖ్యమైన కీమోథెరపీ మందులు. వీటికి సమానమైన సమర్థవంతమైన ప్రత్యామ్నాయాలు మార్కెట్లో లేవు. ఈ కొరత చికిత్స ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారు. మందులు సకాలంలో లభించకపోవడం వల్ల చికిత్స కాలపరిమితి పెరిగిపోతుంది. ఇది రోగుల మానసిక ధైర్యాన్ని కూడా దెబ్బతీస్తుంద వారు అంటున్నారు.

పరిష్కారం ఏమిటి మరి..?

ఈ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆరోగ్య రంగ నిపుణులు సూచిస్తున్నారు. విదేశాలపై ఆధారపడటం తగ్గించి, అత్యవసర ముడి పదార్థాల దేశీయ ఉత్పత్తిని వేగంగా పెంచాలని కోరుతున్నారు. అలాగే జాతీయ కార్యక్రమాల ద్వారా వ్యూహాత్మకంగా ప్రాణరక్షక మందుల నిల్వలను పోగుచేయడం, అంతర్జాతీయ సరఫరా మార్గాలను నిరంతరం పర్యవేక్షించడం ద్వారానే ఈ ఔషధాల కొరతకు శాశ్వత చెక్ పెట్టగలమని స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.