గట్ హెల్త్ ను పెంపొందించే తమలపాకు
సాక్షి లైఫ్ : తమలపాకు రుచిగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే తమలపాకు మాత్రమే కాకుండా దాని ఆకులతో తయారుచేసిన నీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తమలపాకు నీళ్ల వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం.
తమలపాకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..?
భోజనం తర్వాత కొందరికి పాన్ తినడం అలవాటు. పాన్ ను కిళ్లీ అని కూడా అంటారు. ఇది ఆహారం జీర్ణం కావడానికి చాలాబాగా ఉపయోగపడుతుంది. అయితే తమలపాకులను నీళ్లలో మరిగించి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని మీకు తెలుసా..? అవును, తమలపాకు నీరు జలుబు, దగ్గును నివారించడంలో మేలు చేస్తుంది. ఇది కఫం,పిత్త దోషాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తీవ్రమైన దగ్గును నివారించి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి.. మధుమేహం ఉన్నవాళ్లు ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు..
తమలపాకు నీటిని ఎలా తయారు చేసుకోవాలి..?
3-4 తమలపాకులను కడిగి మూడు గ్లాసుల నీటిని ఒక గ్లాసు అయ్యేంత వరకూ మరిగించాలి. చల్లారిన తర్వాత రోజుకు రెండు మూడు సార్లు తాగాలి. ఇలా తాగడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
మధుమేహా నియంత్రణ..
తమలపాకు నీరు మధుమేహ వ్యాధిగ్రస్తుల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ని నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ నీరు తాగడం ద్వారా చక్కర స్థాయిలు అదుపులో ఉంచుకోవచ్చు.
గట్ హెల్త్ కు మేలు..
ఈ రోజుల్లో చాలా మంది మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళు మలబద్ధకం విషయంలో తమలపాకు నీటిని తాగడం వల్ల చాలా వరకు మేలు జరుగుతుంది. ముఖ్యంగా గట్ హెల్త్ మెరుగుపడుతుంది. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవు.
కఫం, పిత్త దోషాలను తొలగిస్తుంది..
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్న తమలపాకు నీరు కఫం, పిత్త దోషాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది గొంతు వాపును తగ్గించడంలో, ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తొలగించడంలో మంచి పనితీరు కనబరుస్తుంది.
జీర్ణశక్తి..
వాంతులు, విరేచనాలు వంటి సమస్యలను పరిష్కరించడంలో తమలపాకు నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నీరు జీర్ణ శక్తిని మెరుగు పరచడమే కాకుండా జీర్ణ శక్తిని ఆరోగ్యంగా ఉంచుతుంది.
దుర్వాసన తొలగిస్తుంది..
తమలపాకులతో తయారుచేసిన నీరు నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. దీనితో పాటు, ఇది దంతాలను శుభ్రంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి.. సెలెబ్రెటీలు వేడి నీళ్లు ఎందుకు తాగుతారో తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
