Ebola Virus : ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ వైద్యారోగ్య శాఖ హై అలర్ట్..

షేర్ చేయండి:
Ebola Virus : ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ వైద్యారోగ్య శాఖ హై అలర్ట్..

సాక్షి లైఫ్ : ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ (Ebola Virus) మళ్లీ కలకలం సృష్టిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతర్జాతీయంగా మరణాల సంఖ్య పెరుగుతుండటం, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఏపీ వైద్యారోగ్య శాఖ హై అలర్ట్ ప్రకటించింది. మహమ్మారి ముప్పును ఎదుర్కొనేందుకు వీలుగా ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర వైద్య సేవలపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది.

విమానాశ్రయాలు, పోర్టుల్లో గట్టి నిఘా..

ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై అధికారులు నిరంతర నిఘా ఉంచారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు విధిగా థర్మల్ స్క్రీనింగ్, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల్లో ఎబోలా లక్షణాలు ఏమాత్రం కనిపించినా వారిని వెంటనే ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. వారితో ప్రయాణించిన ఇతరులను కూడా ట్రాక్ చేయనున్నారు. విమానాశ్రయాలతో పాటు విశాఖ పోర్టులోనూ తనిఖీలను ముమ్మరం చేశారు. సరిహద్దు జిల్లాల యంత్రాంగాలను కూడా అప్రమత్తం చేశారు.

ఆస్పత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు.. 

వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వైద్యారోగ్య శాఖ అన్ని జిల్లాల్లోనూ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధికారులను ఆదేశించారు. కీలక నగరాల్లోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో (GGH) ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశారు. అత్యవసర పరిస్థితులను తట్టుకునేందుకు వీలుగా తగినన్ని పీపీఈ (PPE) కిట్లు, వైరస్ నిర్ధారణ కిట్లను అందుబాటులో ఉంచారు.

అత్యవసరమైతే తప్ప..

క్షేత్రస్థాయిలో ఆశా (ASHA) వర్కర్లు, ఏఎన్ఎం (ANM) సిబ్బందికి వైరస్ లక్షణాల గుర్తింపుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్రికా దేశాల పర్యటనలకు వెళ్లవద్దని ప్రభుత్వం సూచించింది. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారిలో తీవ్రమైన జ్వరం, ఒంటినొప్పులు, వాంతులు, లేదా రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక ఆరోగ్య అధికారులను సంప్రదించాలని కోరింది. రాష్ట్ర ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేవలం ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే ఈ హై అలర్ట్ ప్రకటించినట్లు వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది.

 

ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.