Cancer Cases Rising Rapidly in Telangana : తెలంగాణలో పెరుగుతున్న క్యాన్సర్ మహమ్మారి.. అగ్రస్థానంలో హనుమకొండ, హైదరాబాద్‌..!

షేర్ చేయండి:
Cancer Cases Rising Rapidly in Telangana : తెలంగాణలో పెరుగుతున్న క్యాన్సర్ మహమ్మారి.. అగ్రస్థానంలో హనుమకొండ, హైదరాబాద్‌..!

సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి తీవ్రంగా వేధిస్తోందని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రూపొందించిన 'క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణ' నివేదికలో పలు ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలోని దాదాపు 90 శాతం జనాభాను విశ్లేషించి రూపొందించిన ఈ నివేదికను ప్రముఖ ఆంకాలజిస్ట్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నూరి దత్తాత్రేయుడు ఇటీవల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి సమర్పించారు.

ఈ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో సగటున ప్రతి లక్ష మంది జనాభాకు ఏడాదికి 52 క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. జిల్లాల వారీగా చూస్తే హనుమకొండ జిల్లా అత్యధిక కేసులతో అగ్రస్థానంలో ఉండగా, రాజధాని నగరం హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.

జిల్లాల వారీగా క్యాన్సర్ తీవ్రత (ప్రతి లక్ష మంది జనాభాకు ఏడాదికి..)


రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలలో 25 జిల్లాల్లో క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

అత్యధిక కేసులు నమోదైన అగ్ర జిల్లాలు:
హనుమకొండ: 79 కేసులు

హైదరాబాద్: 72 కేసులు

కరీంనగర్: 65 కేసులు

పెద్దపల్లి: 63 కేసులు

రాజన్న సిరిసిల్ల: 63 కేసులు

జగిత్యాల: 60 కేసులు

జయశంకర్ భూపాలపల్లి: 59 కేసులు

అత్యల్ప కేసులు నమోదైన చివరి 3 జిల్లాలు:
జోగులాంబ గద్వాల: 31 కేసులు

కొమరం భీమ్ ఆసిఫాబాద్: 35 కేసులు

ఆదిలాబాద్: 35 కేసులు

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్ 

ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 

పట్టణ ప్రాంతాల్లో ముప్పు ఎందుకు ఎక్కువ..?

హైదరాబాద్, రంగారెడ్డి వంటి పట్టణ జిల్లాల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు ఉన్నప్పటికీ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు కావడానికి ప్రధాన కారణాలు ఇవే..

శారీరక శ్రమ లేకపోవడం, మితిమీరిన మానసిక ఒత్తిడి. జంక్ ఫుడ్స్, రసాయనాలు ఎక్కువగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం.నగరాల్లో పెరిగిపోతున్న వాయు, జల కాలుష్యాలు. ప్రారంభ దశలో స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోకపోవడం వల్ల వ్యాధి ముదిరిన తర్వాత వెలుగుచూడటం.

చికిత్సా కేంద్రాల కేంద్రీకరణ: హైదరాబాద్‌లో ప్రధాన క్యాన్సర్ ఆసుపత్రులు ఉండటం వల్ల పొరుగు జిల్లాల, రాష్ట్రాల రోగులు ఇక్కడికే రావడం కూడా నగరంలో కేసులు ఎక్కువగా చూపించడానికి ఒక కారణం కావచ్చునని నిపుణులు భావిస్తున్నారు.

భవిష్యత్ కార్యాచరణకు 'రోడ్‌మ్యాప్'..


రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ డేటా ఆధారంగా రూపొందించిన ఈ అట్లాస్.. రాష్ట్రంలో క్యాన్సర్ నివారణకు, ముందస్తు గుర్తింపునకు,చికిత్స ప్రణాళికకు ఒక దిక్సూచిలా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఏ ఏ ప్రాంతాల్లో క్యాన్సర్ ప్రభావం ఎక్కువగా ఉందో గుర్తించి, అక్కడ ప్రత్యేక స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

క్యాన్సర్ రోగులు చికిత్స కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణించే భారాన్ని తగ్గించేందుకు.. రాష్ట్రవ్యాప్తంగా 33 క్యాన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి, కీమోథెరపీ, రేడియేషన్ సేవలను వికేంద్రీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

 క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిస్థాయిలో నయం చేయవచ్చు. గత నెలలోనే తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్‌ను 'నోటిఫైబుల్ డిసీజ్' గా ప్రకటించింది. కాబట్టి, 40 ఏళ్లు దాటిన వారు, ముఖ్యంగా కుటుంబ చరిత్ర ఉన్నవారు ఏటా క్రమం తప్పకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ముందస్తు రక్షణకు ఎంతో అవసరం.

 

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.