Rare IgG4-Related Disease Mimics Cancer : క్యాన్సర్‌ను పోలి ఉండే అరుదైన వ్యాధి 'IgG4' .. భారత్ లో విజృంభిస్తున్న న్యూ డిసీజ్.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : శరీరంలో క్యాన్సర్ లాంటి గడ్డలు కనిపిస్తే ఎవరైనా హడలిపోతారు. అయితే, కనిపించే ప్రతి గడ్డ క్యాన్సర్ కాకపోవచ్చు. క్యాన్సర్‌ను పోలి ఉండే 'IgG4-RD' (IgG4 Related Disease) అనే అరుదైన ఆటోఇమ్యూన్ వ్యాధిపై వైద్యులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని సకాలంలో గుర్తించకపోతే, రోగులు అనవసరంగా శస్త్రచికిత్సలు (surgeries) చేయించుకోవలసిన పరిస్థితి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇండోర్‌లో ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి 'IgG4-RD 2026' సదస్సులో భారతదేశంతో పాటు జపాన్, ఇటలీ వంటి పలు దేశాల నుంచి వచ్చిన 20 మందికి పైగా వైద్య నిపుణులు, సుమారు 350 మంది జనరల్ ఫిజీషియన్లు ఈ వ్యాధిపై విస్తృతంగా చర్చించారు.

 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

 

ఏంటి ఈ వ్యాధి..? అవయవాలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది..?

మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ (Immune System) లోపాలు లేదా పొరపాట్ల వల్ల వచ్చే అరుదైన సమస్యే ఈ IgG4-RD.

కణజాలాలు గట్టిపడటం..

ఈ వ్యాధి బారిన పడిన వారి శరీరంలో 'IgG4' అనే యాంటీబాడీల స్థాయి అసాధారణంగా పెరుగుతుంది. దీనివల్ల వివిధ అవయవాలలో తీవ్రమైన వాపు ఏర్పడి, కణజాలాలు గట్టిపడతాయి (Fibrosis).

అనేక అవయవాలపై దెబ్బ..

 ఇది ఒకేసారి శరీరంలోని బహుళ అవయవాలపై ప్రభావం చూపగలదు. ముఖ్యంగా క్లోమం (Pancreas), మూత్రపిండాలు (Kidneys), గుండె, కళ్ళు, లాలాజల గ్రంథులు, పిట్యూటరీ గ్రంథి వంటి కీలక భాగాలలో క్యాన్సర్ కణితుల లాంటి వాపులు ఏర్పడతాయి.

ఈ వ్యాధి వల్ల వచ్చే గడ్డలు చూడటానికి క్యాన్సర్ కణితి లాగే ఉంటాయి. దీనివల్ల చాలా మంది వైద్యులు పొరపాట్లకు లోనై తప్పుడు రోగ నిర్ధారణ చేసే ప్రమాదం ఉంది. ఫలితంగా రోగికి అవసరం లేకపోయినా ఆపరేషన్ చేసి ఆ భాగాలను తొలగించే అవకాశాలు ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.

మందులతోనే నయం.. 

ఈ వ్యాధి దైహికమైనది (Systemic Disease) అయినప్పటికీ, సరైన సమయంలో గుర్తిస్తే శస్త్రచికిత్సలు లేకుండా కేవలం మందులతోనే పూర్తిగా నయం చేయవచ్చని అంతర్జాతీయ నిపుణులు స్పష్టం చేశారు.

చికిత్సా విధానాలు..

జపాన్‌కు చెందిన ప్రొఫెసర్ హిసనోరి ఉమెహారా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే స్టెరాయిడ్లు, రోగనిరోధక శక్తిని నియంత్రించే ఇమ్యునోసప్రెసివ్ మందులు,'రిటుక్సిమాబ్' వంటి ఆధునిక బయోలాజికల్ థెరపీల ద్వారా విజయవంతంగా చికిత్స అందించవచ్చు. దీనివల్ల శాశ్వతంగా అవయవాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.

ఇతర వైద్యులూ అప్రమత్తం కావాలి.. 

సాధారణంగా ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు రోగులు మొదట జనరల్ ప్రాక్టీషనర్లు లేదా ఈఎన్‌టీ (ENT) నిపుణులను సంప్రది స్తుంటారు. అందువల్ల రుమటాలజీ విభాగంతో పాటు మిగిలిన అందరు వైద్యులలోనూ ఈ అరుదైన వ్యాధిపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని ముంబై హిందూజా ఆసుపత్రికి చెందిన నిపుణులు పేర్కొన్నారు. శరీరంలో కారణం తెలియని వాపులు లేదా ఒకేసారి బహుళ అవయవాల్లో సమస్యలు తలెత్తినప్పుడు, వైద్యులు IgG4 వ్యాధి అయ్యే అవకాశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని పరీక్షలు చేయాలని సదస్సు నిపుణులు సూచించారు.

 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.