Prices of Cancer Medicines : క్యాన్సర్ బాధితులకు ఊరట.. గణనీయంగా తగ్గనున్న మెడిసిన్స్..
సాక్షి లైఫ్ : ప్రాణాంతక క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న వేలాది మంది నిరుపేద, మధ్యతరగతి రోగుల ఆర్థిక భారం కాస్త తగ్గనుంది. వ్యాధి చికిత్సలో కీలకంగా ఉపయోగించే యాంటీ క్యాన్సర్ మందుల గరిష్ఠ చిల్లర ధరలను (MRP) గణనీయంగా తగ్గిస్తూ జాతీయ ఔషధ ధరల నియంత్రణ ప్రాధికార సంస్థ (NPPA) తీసుకున్న నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ట్రేడ్ మార్జిన్లను గరిష్ఠంగా 30 శాతానికి పరిమితం చేయడంతో మార్కెట్లో ప్రధాన ఔషధాల ధరలు భారీగా తగ్గాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా రోగులకు ఏటా దాదాపు రూ.3,540 కోట్ల మేర ఆదా కానుందని అంచనా..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
పరిధిలోకి వచ్చినవి..121 రకాల ప్రత్యేక ఔషధాలకు చెందిన 1,364 ఫార్ములేషన్లు. జాబితాలో లేని 137 క్యాన్సర్ మందుల సరఫరా మార్జిన్‌పై 30% సీలింగ్. సవరించిన ధరల పట్టికను సమర్పించిన 85 ప్రముఖ ఫార్మా సంస్థలు. 679 బ్రాండ్లలో ధరలు 50 శాతానికి పైగా తగ్గుదల, అత్యధికంగా 96 శాతానికి పైగా కోత.
క్యాన్సర్ ఔషధాల ధరల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు రోగులకు భారీ ఊరటనిస్తున్నాయి. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 121 రకాల ప్రత్యేక ఔషధాలకు చెందిన 1,364 ఫార్ములేషన్లు కొత్త నిబంధనల పరిధిలోకి వచ్చాయి. ప్రధానంగా జాబితాలో లేని 137 క్యాన్సర్ మందుల సరఫరా మార్జిన్‌పై 30 శాతం సీలింగ్ విధించడంతో, దాదాపు 85 ప్రముఖ ఔషధ సంస్థలు సవరించిన సరికొత్త ధరల పట్టికను అధికారికంగా సమర్పించాయి. ఫలితంగా 679 బ్రాండ్లలో ధరలు సగానికి పైగా తగ్గగా, కొన్నింటిపై ఏకంగా 96 శాతానికి పైగా కోత పడింది.
ముఖ్యంగా ప్రాణాంతక క్యాన్సర్ చికిత్సలో కీలకమైన ఔషధాల ధరలు అనూహ్యంగా దిగివచ్చాయి. గతంలో 10 మాత్రల అనస్ట్రోజోల్ ధర రూ.700 ఉండగా, ఇప్పుడు అది రూ.100కే లభిస్తోంది. అలాగే రూ.25,000 పలికిన డెనోసుమాబ్ ధర భారీగా తగ్గి రూ.5,000కు చేరుకోగా, రూ.40,000 ఉన్న పాల్బోసిక్లిబ్ సగానికి పడిపోయి రూ.20,000కే అందుబాటులోకి వచ్చింది. ఇక రూ.83,000 ఖరీదు చేసే అత్యంత ఖరీదైన పెర్టుజుమాబ్ ఔషధం సైతం రూ.38,000కు తగ్గడంతో నిరుపేద, మధ్యతరగతి రోగుల జేబులకు భారీగా ఉపశమనం లభించినట్లయింది.
వైద్య నిపుణులుఈ నిర్ణయం వల్ల చికిత్స వ్యయం గణనీయంగా తగ్గి, సాధారణ కుటుంబాలకు ఉపశమనం లభిస్తుందని ప్రముఖ ఆంకాలజిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. "ధరల నియంత్రణ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. అయితే ఈ తగ్గింపు ప్రయోజనం క్షేత్రస్థాయిలో రోగులకు నిరంతరాయంగా చేరినప్పుడే అసలైన సార్థకత చేకూరుతుంది. మార్కెట్లో కృత్రిమ కొరత తలెత్తకుండా ఔషధాల నిరంతర సరఫరాను ప్రభుత్వం పర్యవేక్షించాలి.
ఒకవైపు ధరల తగ్గింపును స్వాగతిస్తున్నప్పటికీ, గరిష్ఠ చిల్లర ధరలు మారిన నేపథ్యంలో సాధారణ మెడికల్ షాపులు, స్టాకిస్టులు తీవ్ర సందిగ్ధంలో పడ్డారు. తాము ఇప్పటికే పాత ధరలకు కొనుగోలు చేసిన కోట్లాది రూపాయల నిల్వలు దుకాణాల్లో ఉన్నాయని, వాటిని కొత్త తక్కువ ధరలకు విక్రయిస్తే భారీ నష్టం వాటిల్లుతుందని తెలంగాణ డ్రగ్గిస్ట్స్ అండ్ కెమిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. కొత్త ఎంఆర్పీ ఉన్న స్టాకు మార్కెట్లోకి పూర్తిస్థాయిలో చేరుకోవ డానికి మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
