antibiotics for children పిల్లలకు పదే పదే యాంటీబయాటిక్స్ వాడుతున్నారా..? భవిష్యత్తులో అది పెనుముప్పుగా మారొచ్చు..!
సాక్షి లైఫ్ : పిల్లలకు కాస్త జ్వరం, జలుబు, లేదా దగ్గు రాగానే వెంటనే యాంటీబయాటిక్స్ వేసేస్తున్నారా? డాక్టర్ సలహా లేకుండానే మెడికల్ షాపుల్లో మందులు కొని పిల్లలకు ఇస్తున్నారా..? అయితే, మీరు వారికి మేలు చేయడం కాదు.. తెలియకుండానే ప్రాణాంతక ముప్పును కొనితెస్తున్నారు. అవును, ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో 'యాంటీబయాటిక్ నిరోధకత' (Antibiotic Resistance) వేగంగా పెరుగుతోందని, ఇది భవిష్యత్తులో ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు పెను సవాలుగా మారనుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
అసలేమిటీ యాంటీబయాటిక్ నిరోధకత..?
ఒకప్పుడు బ్యాక్టీరియాను సంహరించడానికి యాంటీబయాటిక్స్‌ను అద్భుత ఔషధంగా (Wonder drugs) భావించేవారు. కానీ, ఇప్పుడు ఆ మందులనే తట్టుకునేంత బలంగా బ్యాక్టీరియాలు రూపాంతరం చెందుతున్నాయి. మందులను విచ్చలవిడిగా వాడటం వల్ల బ్యాక్టీరియాలు 'సూపర్‌బగ్స్'గా మారుతున్నాయి. దీనివల్ల ఒకప్పుడు సులభంగా చనిపోయే బ్యాక్టీరియాలపై ఇప్పుడు మందులు ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో చిన్నపాటి సాధారణ ఇన్ఫెక్షన్లకు కూడా వైద్యం చేయడం కష్టంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయి..?
'జామా పీడియాట్రిక్స్' (JAMA Pediatrics) అనే ప్రఖ్యాత మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా నివేదిక ప్రకారం.. పిల్లల్లో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే రెండు ప్రధాన బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్‌ను తట్టుకునే శక్తిని వేగంగా పెంచుకుంటున్నాయి.
అసినెటోబాక్టర్ బౌమన్నీ (Acinetobacter baumannii)..
ఆసుపత్రిలో చేరిన రోగులలో రక్త ఇన్ఫెక్షన్లు, నిమోనియా వంటి తీవ్రమైన సమస్యలకు కారణమవుతున్న ఈ బ్యాక్టీరియా.. అత్యంత ఔషధ-నిరోధక బ్యాక్టీరియాగా ఉద్భవించింది. మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు (UTI), కాలేయ సమస్యలకు కారణమయ్యే ఈ బ్యాక్టీరియా కూడా ఆగ్నేయాసియా తదితర ప్రాంతాల్లో మందులకు లొంగకుండా తయారవుతోంది. పిల్లలకు వాడే సురక్షితమైన మందుల ఎంపికలు ఇప్పటికే తక్కువగా ఉండటంతో, భవిష్యత్తులో పిల్లలే దీనికి ఎక్కువగా బలయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఈ ముప్పు ఎందుకు పెరుగుతోంది..? ప్రధాన కారణాలివే..
సాధారణ జలుబు, ఫ్లూ వంటివి వైరస్ వల్ల వస్తాయి. వీటిపై యాంటీబయాటిక్స్ అస్సలు పనిచేయవు. అయినా జ్వరం వస్తే చాలు, యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు.
కోర్సు పూర్తి చేయకపోవడం..
డాక్టర్ ఐదు రోజులు మందులు వాడమంటే.. పిల్లలకు కాస్త జ్వరం తగ్గగానే రెండు రోజులకే మందులు ఆపేస్తుంటారు. దీనివల్ల శరీరంలో మిగిలిపోయిన బ్యాక్టీరియా మళ్లీ దాడి చేయడమే కాకుండా, ఆ మందును తట్టుకునే శక్తిని (Resistance) సంతరించుకుంటుంది. డాక్టర్ సూచన లేకుండా మెడికల్ షాపుల్లో నేరుగా మందులు కొనడం, పాత ప్రిస్క్రిప్షన్ చూసి మళ్లీ అవే మందులు వాడటం, మోతాదు (Dose) ఎక్కువగా లేదా తక్కువగా వేయడం ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి.
తల్లిదండ్రులు గుర్తించుకోవాల్సిన విషయం..
చెవి, గొంతు లేదా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వచ్చిన వెంటనే హై-డోస్ యాంటీబయాటిక్స్ వాడకూడదు. కేవలం డాక్టర్ సూచించినప్పుడు, వారు చెప్పినన్ని రోజులు పూర్తిగా మందులు వాడటం ద్వారా మాత్రమే ఈ 'యాంటీబయాటిక్ నిరోధకత' ముప్పు నుంచి మన పిల్లలను రక్షించుకోవచ్చు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
