Diabetes in Children : పిల్లల్లోనూ మధుమేహం ముప్పు.. ఈ 5 లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు..!
సాక్షి లైఫ్ : డయాబెటిస్ (diabetes) అంటే కేవలం పెద్దలకే వచ్చే వ్యాధి అని చాలామంది భావిస్తుంటారు. కానీ, చిన్నారులు సైతం దీని బారిన పడే ప్రమాదం ఉంది. పిల్లల్లో కనిపించే చిన్నచిన్న అనారోగ్య మార్పులను వాతావరణ ప్రభావమో, ఆటల వల్ల కలిగే అలసటో అని తల్లిదండ్రులు తేలికగా తీసుకుంటారు. ముఖ్యంగా పిల్లల్లో వచ్చే ‘టైప్-1 డయాబెటిస్’(Type 1 diabetes)లక్షణాలు కొద్ది రోజులు లేదా వారాల్లోనే వేగంగా బయటపడతాయి. అందుకే ఆరంభంలోనే ఈ సంకేతాలను గుర్తించి అప్రమత్తం కావడం ఎంతో అవసరం.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
చిన్నారుల్లో మధుమేహాన్ని సూచించే ప్రధాన లక్షణాలు..
1. తరచూ మూత్ర విసర్జన..
పిల్లలు సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్తుంటే తల్లిదండ్రులు గమనించాలి. రాత్రివేళల్లో పలుమార్లు నిద్రలేచి బాత్రూమ్కు వెళ్లడం లేదా అప్పటికే మానేసిన పక్క తడిపే అలవాటు మళ్లీ మొదలవ్వడం వంటివి మధుమేహానికి సంకేతాలు కావచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, శరీరం దాన్ని మూత్రం ద్వారా బయటకు పంపేందుకు ప్రయత్నిస్తుంది. ఫలితంగా మూత్ర విసర్జన పెరుగుతుంది.
2. అతిగా దాహం వేయడం..
తరచూ మూత్ర విసర్జన జరగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీనివల్ల పిల్లలు మాటిమాటికీ నీళ్లు అడుగుతుంటారు. ఎంత నీరు తాగినా ఇంకా దాహంగానే ఉందని చెబుతుంటే దాన్ని సాధారణ విషయంగా కొట్టిపారేయకూడదు.
3. కారణం లేకుండా బరువు తగ్గడం..
పిల్లలు ఎప్పటిలాగే సరైన మోతాదులో ఆహారం తీసుకుంటున్నా, క్రమంగా బరువు తగ్గిపోతుంటే జాగ్రత్త పడాలి. శరీరానికి అవసరమైన శక్తిని అందించేందుకు గ్లూకోజ్ సరిగ్గా అందనప్పుడు, శరీరం తనలో నిల్వ ఉన్న కొవ్వును, కండరాలను కరిగించడం ప్రారంభిస్తుంది. దీనివల్లే బరువు అకస్మాత్తుగా తగ్గుతుంది.
4. నిరంతర అలసట, నీరసం..
ఎప్పుడూ ఉత్సాహంగా ఆడుకునే చిన్నారి ఒక్కసారిగా ఆటలపై ఆసక్తి కోల్పోవడం, త్వరగా అలసిపోవడం, బడిలో చదువుపై ఏకాగ్రత నిలపలేకపోవడం వంటి మార్పులు కనిపిస్తే అప్రమత్తం కావాలి. శరీరంలోని చక్కెరను కణాలు శక్తిగా మార్చుకోలేకపోవడం వల్లే ఇలాంటి తీవ్రమైన నీరసం ఆవరిస్తుంది.
5. చూపు మసకబారడం..
పుస్తకాలు చదువుతున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా దూరంగా ఉన్న వస్తువులను గుర్తించడంలో పిల్లలు ఇబ్బంది పడుతుంటే నిర్లక్ష్యం చేయొద్దు. రక్తంలో చక్కెర స్థాయిలు (blood sugar levels) పెరగడం వల్ల కంటి చూపుపై తాత్కాలిక ప్రభావం పడి, అక్షరాలు, వస్తువులు మసకగా కనిపించే అవకాశం ఉంది.
తల్లిదండ్రులు ఏం చేయాలి..?
పైన పేర్కొన్న లక్షణాల్లో ఏవైనా వరుసగా కనిపిస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి రక్తంలో చక్కెర (blood sugar) పరీక్ష చేయించాలి. ఒకవేళ చిన్నారిలో వాంతులు, తీవ్రమైన కడుపునొప్పి, వేగంగా లేదా భారంగా శ్వాస తీసుకోవడం, విపరీతమైన మగత వంటి లక్షణాలు కనిపిస్తే అది అత్యవసర పరిస్థితికి సంకేతం. వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
అపోహలు వీడండి..
పిల్లలు ఎక్కువగా తీపి పదార్థాలు తినడం వల్లే టైప్-1 డయాబెటిస్ వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో జరిగే కొన్ని మార్పుల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. సకాలంలో వ్యాధిని గుర్తించి, వైద్యుల సూచనల మేరకు సరైన చికిత్స అందిస్తే చిన్నారులు కూడా ఇతరుల్లాగే ఆరోగ్యకరమైన, చురుకైన జీవితాన్ని గడపవచ్చని నిపుణులు భరోసా ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
