The 7-7-7 Formula : రోజుకు ఆ 21 నిమిషాలే.. పిల్లలతో మీ బంధాన్ని పెంచుతాయి..!
సాక్షి లైఫ్ : ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో పిల్లలతో తగినంత సమయం (Quality Time) గడపడం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది. అయితే, పిల్లలతో కమ్యూనికేషన్ పెంచుకోవడానికి, వారితో అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి '7-7-7 పేరెంటింగ్ రూల్' అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి డిజిటల్ పరధ్యానం లేకుండా రోజులో కేవలం 21 నిమిషాలు పిల్లల కోసం కేటాయించడమే ఈ నియమం ప్రధాన ఉద్దేశం.
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
ఏమిటీ '7-7-7' పేరెంటింగ్ రూల్..?
ఈ టెక్నిక్‌లో భాగంగా తల్లిదండ్రులు తమ పిల్లలతో ముఖ్యంగా టీనేజర్లతో రోజుకు 21 నిమిషాల సమయాన్ని గడపాలి. ఈ సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకోవాలి. ఉదయం పూట 7 నిమిషాలు, స్కూల్ నుంచి రాగానే 7 నిమిషాలు, రాత్రి నిద్రపోయే ముందు 7 నిమిషాలు పిల్లల కోసం కేటాయించాలి. ఈ సమయంలో టీవీలు, స్మార్ట్‌ఫోన్ల వినియోగానికి దూరంగా ఉండి, పూర్తిగా పిల్లల మీదే దృష్టి పెట్టడం అత్యంత ముఖ్యం.
ఈ రూల్‌ను ఎలా అమలు చేయాలి..?
ఉదయం పూట 7 నిమిషాలు..
రోజును పిల్లలతో సానుకూల వాతావరణంలో ప్రారంభించండి. ఈరోజు వారి ప్లాన్స్ ఏంటి? ఎలా ఫీల్ అవుతున్నారు? వంటి విషయాలను అడిగి తెలుసుకోండి. మీరు వారి మాటలకు విలువ ఇస్తున్నారనే భావన వారిలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది.
స్కూల్ నుంచి రాగానే 7 నిమిషాలు..
పిల్లలు స్కూల్ లేదా ట్యూషన్ నుంచి రాగానే హడావిడి పడకుండా వారితో కూర్చోండి. ఆ రోజు స్కూల్‌లో జరిగిన విశేషాలను అడగండి. కొత్తగా ఏం నేర్చుకున్నారు..? ఏదైనా విషయం వారిని బాధించిందా..? అని ఆరా తీయండి. వెంటనే సలహాలు ఇచ్చేయకుండా, ముందు వారు చెప్పేది ఓపిగ్గా వినండి.
నిద్రపోయే ముందు 7 నిమిషాలు..
రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ప్రశాంతంగా మాట్లాడటానికి ప్రయత్నించండి. పగలు జరిగిన చిన్న చిన్న విషయాలను చర్చిస్తూనే, వారి భయాలను, సంతోషాలను అర్థం చేసుకోండి. 'ఏ పరిస్థితిలోనైనా మేము నీకు అండగా ఉంటాం' అనే భరోసాను వాళ్లకు కల్పించండి.
ఈ అలవాటుతో కలిగే ప్రయోజనాలు..?
ప్రతిరోజూ ఈ 21 నిమిషాల సమయం కేటాయించడం వల్ల పిల్లలు, తల్లిదండ్రుల మధ్య నమ్మకం, బాండింగ్ పెరుగుతుంది.
పిల్లలు తమ మనసులోని భావాలను, భయాలను స్వేచ్ఛగా పంచుకోగలుగుతారు.
ముఖ్యంగా శారీరక, మానసిక మార్పులు జరిగే టీనేజ్ వయసులో ఉన్న పిల్లలకు ఈ అలవాటు ఎంతో మేలు చేస్తుంది. వారు మానసికంగా సురక్షితంగా ఉన్నామనే భావనకు లోనవుతారు.
కుటుంబ సభ్యుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గి, అపార్థాలకు తావు లేకుండా ఉంటుంది. ఈ నియమం ఉద్దేశం కేవలం పిల్లల పక్కన కూర్చోవడం కాదు, ఆ సమయాన్ని సార్థకం చేసుకోవడం. కాబట్టి ఈ 21 నిమిషాల వ్యవధిలో మొబైల్స్, ఇతర గ్యాడ్జెట్స్ ముట్టుకోవద్దు. వారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుకోకుండా, వారిని విమర్శించకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
ఇది కూడా చదవండి.. Plantar Fasciitis : ఉదయం మంచం దిగగానే మడమలో సూదులతో గుచ్చినట్టు నొప్పా..? ఐతే ప్లాంటర్ ఫాసిటిస్ కావొచ్చు..!
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
