పిల్లల్లో ఫిట్స్‌ సమస్యకు కారణాలు-చికిత్స మార్గాలు

 

సాక్షి లైఫ్ : చిన్నారుల్లో ఫిట్స్‌ (సీజర్స్‌) రావడం సాధారణంగా చూస్తుండేదే. ఇలా  ఫిట్స్‌ రావడాన్ని వైద్యపరిభాషలో ‘ఎపిలెప్సీ’గా చెబుతారు. పెద్దవాళ్లతో పోల్చినప్పుడు పిల్లల్లో వచ్చే సీజర్స్‌కు కారణాలూ, చికిత్సకు వారు స్పందించే తీరుతెన్నులూ...ఇవన్నీ కాస్త వేరుగా ఉంటాయి.

 ఈ సీజర్స్‌లోనూ ‘ఆబ్సెన్స్‌ సీజర్స్‌’ అనేవి ఇంకాస్త వేరు. నాలుగేళ్ల నుంచి 14 ఏళ్ల వయసు పిల్లల్లో వచ్చే వీటి కారణంగా చిన్నారులు ఏ భంగిమలో ఉన్నా... ఉన్నఉన్నవారు ట్లుగానే వారు స్పృహ కోల్పోతారు. 

ఇవి పిల్లల్లో అకస్మాత్తుగా మొదలవుతాయి. హఠాత్తుగా వాళ్లను స్పృహలో లేకుండా చేస్తాయి.  కనీసం 10 – 20 సెకండ్లు అలా ఉండిపోయి, మెల్లగా ఈలోకంలోకి వస్తారు. ఇలా హఠాత్తుగా కనిపించి, తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురిచేసే ‘ఆబ్సెన్స్‌ సీజర్స్‌’పై మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

చిన్నారుల్లో వచ్చే ‘అబ్సెన్స్‌ సీజర్స్‌’ అంటే..?పిల్లల్లో వచ్చే ఫిట్స్‌లో... ఆబ్సెన్స్‌ సీజర్స్‌ అనేవి కనీసం 20 నుంచి 25శాతంవరకు ఉంటాయి. సాధారణంగా ఇవి జన్యుపరమైన (జెనెటిక్‌), జీవక్రియ పరమైన (మెటబాలిక్‌) సమస్యల వల్ల వస్తుంటాయి. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లో ‘ఆబ్సెన్స్‌ సీజర్స్‌’ కేసులు ఎక్కువగా వస్తుంటాయి.

 అసాధారణంగా కొందరు చిన్నారుల్లో ఏడాదిలోపు వయసున్నప్పుడు కూడా ఇవి మొదలు కావచ్చు. చాలా మంది ఆరోగ్యకరమైన పిల్లల్లో హఠాత్తుగా మొదలైనప్పటికీ... కొందరు చిన్నారుల్లో మాత్రం... వారికి జ్వరం వచ్చినప్పుడు కనిపించే ఫిట్స్‌తో ఇవి మొదలవుతాయి.

అలాగే ఎదుగుదలలో లోపాలు (డెవలప్‌మెంటల్‌ డిలే) వంటి నాడీ సంబంధమైన సమస్యలున్నవారిలోనూ కనిపిస్తుంటాయి. ఇంక కొందరిలోనైతే... వాస్తవంగా కనుగొన్న నాటికి చాలా పూర్వం నుంచే... అంటే నెలలూ, ఏళ్ల కిందటి నుంచే ఇవి వస్తుంటాయి. కానీ తల్లిదండ్రులు (లేదా టీచర్లు) చాలా ఆలస్యంగా గుర్తిస్తారు. 

కానీ... వీటినంత తేలిగ్గా గుర్తించడం సాధ్యం కాకపోవడంతో పిల్లలేదో పగటి కలలు కంటున్నారనీ, ఏదో వాళ్ల లోకంలో వాళ్లు ఉన్నారంటూ తల్లిదండ్రులు, టీచర్లు, లేదా పిల్లల్ని చూసుకునే సంరక్షకులు పొరబడుతూ ఉండవచ్చు. సాధారణ సీజర్స్‌లో అవి వచ్చినట్లు తెలుస్తుంది. కానీ ఆబ్సెన్స్‌ సీజర్స్‌లో అవి వచ్చిన దాఖలా కూడా స్పష్టంగా తెలియదు. కొన్ని సందర్భాల్లో చాలాకాలం వరకూ తెలిసిరాదు. 

ప్రధాన కారణాలు.. 
 
తీవ్రమైన అలసట 
వేగంగా శ్వాస తీసుకోవడం 
పిల్లలు టీవీ, మొబైల్‌ చూస్తున్నప్పుడు తరచూ హఠాత్తుగా మారిపోతూ ఉండే కాంతిపుంజాలూ, ఫ్లాష్‌లైట్ల కారణంగా... ఆబ్సెన్స్‌ సీజర్స్‌ సమస్య తలెత్తుతుంది.

 
ఆబ్సెన్స్‌ సీజర్స్‌ లక్షణాలు..
 

అకస్మాత్తుగా ఏమిచేయాలో తెలియక పోవడాన్ని బిహేవియర్‌ అరెస్ట్‌ గా వ్యవహరిస్తారు. షాక్ లో ఉండిపోవడం ∙ముఖంలో ఎలాంటి కవళికలూ కనిపించకపోవడం, నిరంతరంగా కళ్లు ఆర్పుతూ ఉండటం, ఒంటి మీద బట్టలను లేదా ముఖాన్ని తడబాటుగా చేతి వేళ్లతో నలపడం, నోరు చప్పరించడం, మాటల్ని తప్పుగా, ముద్దగా ఉచ్చరిస్తూ ఉండటం, చేస్తున్నపనిని అకస్మాత్తుగా నిలిపివేయడం, ఆపివేయడం బయటివారు పిలుస్తున్నా జవాబివ్వకపోవడం, ఎలాంటి స్పందనలూ లేకపోవడం పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వాళ్లు బయటకు పూర్తిగా నార్మల్‌గానూ కనిపించవచ్చు. మాట్లాడటం మాత్రం చాలావరకు నార్మల్‌గా ఉండిపోవచ్చు. కొందరిలో మాత్రం కొంచెం అస్పష్టత కనిపించవచ్చు. 

ఈ లక్షణాలన్నీ వారు ఆటలాడుకుంటున్నప్పుడూ, టీవీ చూస్తున్నప్పుడూ లేదా కొన్నిసార్లు నిద్రలో కూడా కొనసాగుతుంటాయి. చిన్నారులు అన్యమనస్కంగా ఉండటమో లేదా ఏదో లోకంలో ఉన్నట్టు కనిపించడాన్ని తల్లిదండ్రులు గమనిస్తే వెంటనే డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లాలి. 

నిర్ధారణ ఎలా..?

ఆబ్సెన్స్‌ సీజర్స్‌లో ప్రధానంగా టిపికల్‌, అటిపికల్‌ అనే రకాలు ఉంటాయి. టిపికల్‌ సీజర్స్ ని ఎమ్మారై (బ్రెయిన్‌) వంటి పరీక్షలతో నిర్ధారించవచ్చు. ఇక అటిపికల్‌ రకాల విషయంలో ఇతర నాడీ సంబంధమైన సమస్యలనూ, జీవక్రియలకు సంబంధించిన, జన్యుసంబంధమైన మరికొన్ని పరీక్షలతో పాటు మెదడు,వెన్నుపూస చుట్టూ ఉండే ద్రవం (సెరిబ్రో స్పైనల్‌ ఫ్లుయిడ్‌ – సీఎస్‌ఎఫ్‌)ను పరీక్షించడం ద్వారా తెలుసుకుంటారు. 

ట్రీట్మెంట్.. 
 
సమస్య నిర్దారణ అయిన వెంటనే చికిత్స మొదలుపెట్టాలి. ఇందుకోసం ఫిట్స్‌ మందులు (యాంటీ సీజర్‌ మెడిసిన్స్‌) వాడాలి. వీటిని కనీసం రెండేళ్ల పాటు వాడాల్సి ఉంటుంది. అలా వాడుతూ ఉంటే వ్యాధి నుంచి కొంత ఉపశమనం లభించి, బాధితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాళ్ళ పరిస్థితిని గమనిస్తూ, దాని ప్రకారం మోతాదును క్రమంగా తగ్గిస్తూ పోవాలి. ఈ మందులు చిన్నారుల్లో... కేవలం ఫిట్స్‌ తగ్గించడం మాత్రమే కాదు, వాళ్ల జీవన నాణ్యతనూ మెరుగుపరుస్తాయి. స్కూల్లో వాళ్ల సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి.


70 శాతం కేసుల్లో.. 

సామాజికంగా ఒంటరి కాకుండా... నలుగురితో కలిసిపోయేలా చేస్తాయి. మందుల గుణం కనిపిస్తోందా లేదా అన్న విషయాన్ని నిర్ణీత వ్యవధుల్లో ఈఈజీ తీయడం ద్వారా పరిశీలిస్తూ ఉండాలి. ఇక సహాయ చికిత్సలుగా వాళ్లకు కీటోజెనిక్‌ డైట్‌ (కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం) ఇవ్వడం, వేగస్‌ నర్వ్‌ అనే నరాన్ని ప్రేరేపించడం (వేగస్‌ స్టిమ్యులేషన్‌) జరుగుతుంది. దాదాపు 70 శాతం కేసుల్లో చిన్నారులు యుక్తవయసునకు వచ్చేనాటికి మంచి స్పందన కనిపిస్తుంది.  


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : kids-health-care
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com