Golden Rules to Reduce Stress : ఒత్తిడికి చెక్.. మానసిక ప్రశాంతతకు 8 బంగారు సూత్రాలు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో శారీరక దృఢత్వానికి ఇచ్చే ప్రాధాన్యం మానసిక ఆరోగ్యానికి ఇవ్వడం లేదు. పని ఒత్తిడి, నిద్రలేమి, అధిక సోషల్ మీడియా వాడకం, వ్యక్తిగత సమస్యలు చాలామందిని నిరంతర ఆందోళన, కుంగుబాటులోకి నెడుతున్నాయి. మనసును ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంచుకోవడానికి నిపుణులు సూచిస్తున్న 8 ప్రభావవంతమైన అలవాట్లను గురించి తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

1. కంటినిండా నిద్ర.. మెదడుకు సరికొత్త శక్తి..

శరీరానికే కాదు, మెదడు పనితీరు చురుగ్గా ఉండాలన్నా 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర తప్పనిసరి. రోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోవాలి. నిద్రపోయే కనీసం గంట ముందు మొబైల్ పక్కన పెట్టడం వల్ల గాఢనిద్ర పట్టి, మరుసటి రోజు మానసిక ఉల్లాసం పెరుగుతుంది.

2. రోజూ 30 నిమిషాల వ్యాయామం..

శారీరక శ్రమ మానసిక స్థితిని నేరుగా ప్రభావితం చేస్తుంది. రోజూ కనీసం 20-30 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్, యోగా లేదా నచ్చిన వ్యాయామం చేయడం వల్ల మెదడులో 'ఎండార్ఫిన్లు' (endorphins) విడుదలై ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి.

3. 'డిజిటల్ డిటాక్స్' తప్పనిసరి..

నిరంతరం సోషల్ మీడియా చూడటం, ఇతరుల జీవితాలతో మనల్ని పోల్చుకోవడం మానసిక అశాంతికి ప్రధాన కారణం. రోజులో కనీసం ఒకటి లేదా రెండు గంటలు స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉంటూ డిజిటల్ విరామం ప్రకటించాలి.

4. మనసు విప్పి మాట్లాడండి..

ఏదైనా సమస్య లేదా ఆందోళన వేధిస్తున్నప్పుడు దాన్ని మనసులోనే దాచుకోవద్దు. కుటుంబ సభ్యులు, ప్రాణస్నేహితులు లేదా నమ్మకమైన వ్యక్తులతో బాధను పంచుకోవాలి. సమస్యను ఇతరులతో పంచుకున్నప్పుడు మెదడుపై ఉన్న భారం గణనీయంగా తగ్గుతుంది.

5. ప్రాణాయామం.. ధ్యానం..

ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో 10 నిమిషాల పాటు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు (deep breathing) చేయాలి. ఇది నాడీ వ్యవస్థను శాంతపరిచి, మానసిక అలసటను తగ్గిస్తుంది.

6. పోషకాహారమే పరమౌషధం..

ఆహారపు అలవాట్లు కూడా మూడ్‌పై ప్రభావం చూపుతాయి. తాజా పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, ప్రొటీన్లతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్, అధిక కెఫిన్, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించి, తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.

7. పని మధ్యలో చిన్నపాటి విరామాలు..

గంటల తరబడి ఒకేచోట కూర్చుని పనిచేయడం లేదా చదవడం వల్ల మానసిక అలసట పెరుగుతుంది. ప్రతి 45–50 నిమిషాలకోసారి రెండు నిమిషాలు లేచి అటూఇటూ నడవడం, కళ్లు మూసుకుని రిలాక్స్ అవ్వడం వల్ల ఏకాగ్రత మళ్లీ పుంజుకుంటుంది.

8. ‘మీ కోసం’ కొంత సమయం..

ఉరుకుల పరుగుల జీవితంలో రోజూ కొంత సమయాన్ని వ్యక్తిగత ఆనందం కోసం కేటాయించాలి. సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, మొక్కల పెంపకం లేదా మీకు నచ్చిన అభిరుచులకు (hobbies) ప్రాధాన్యమివ్వాలి.

నిపుణుల సలహా ఎప్పుడు అవసరం..?

నిరంతర నిరాశ, భయం, ఆందోళన, నిద్రలేమి రోజువారీ పనులపై తీవ్ర ప్రభావం చూపుతుంటే స్వయంగా తగ్గించుకోవాలని ప్రయత్నించడం కంటే.. సంకోచించకుండా మానసిక ఆరోగ్య నిపుణులను (psychiatrist or counselor) సంప్రదించాలి.

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.