Good Habits : వయసు పైబడుతున్నా.. మెదడు చురుగ్గా ఉండాలంటే ఇలా చేయండి..!
సాక్షి లైఫ్ : వయసు పెరగడం అనేది సహజమైన ప్రక్రియ. వయసుతో పాటు శారీరక, మానసిక సామర్థ్యాలు కూడా క్రమంగా నెమ్మదిస్తాయి. సాధారణంగా 60 ఏళ్లు దాటిన తర్వాత చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం, పేర్లు గుర్తుకు రాకపోవడం, ఒకేసారి ఎక్కువ పనులు (multitasking) చేయలేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే, మతిమరుపు సమస్యలన్నింటినీ వయసు పైబడటం వల్లే వస్తున్నాయని నిర్లక్ష్యం చేయడం సరికాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వయసు పెరుగుతున్న కొద్దీ మన మెదడులో పలు నిర్మాణాత్మక మార్పులు చోటుచేసుకుంటాయి. నరాల కణాల (neurons) మధ్య కమ్యూనికేషన్ నెమ్మదించడం వల్ల సమాచారాన్ని గ్రహించే వేగం తగ్గుతుంది. అందుకే వృద్ధాప్యంలోనూ మెదడు చురుగ్గా పనిచేయాలంటే ముందు నుంచే జీవనశైలి, ఆహారపు అలవాట్లలో సానుకూల మార్పులు చేసుకోవడం ఎంతో అవసరం.
బ్రెయిన్ అట్రోఫీ అంటే..? మెదడు కుచించుకుపోవడం..
వైద్య నివేదికల ప్రకారం, 40 ఏళ్ల వయసు తర్వాత మెదడు పరిమాణం క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. దీనినే వైద్య పరిభాషలో 'బ్రెయిన్ అట్రోఫీ' లేదా 'బ్రెయిన్ శ్రింకేజ్' అంటారు. అయితే, మెదడును ఎప్పుడూ చురుగ్గా ఉంచే వ్యాపకాలను అలవర్చుకోవడం వల్ల ఈ ముడతలు పడే ప్రక్రియను నెమ్మదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏదైనా సంగీత వాయిద్యాన్ని నేర్చుకోవడం మెదడుకు అద్భుతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
సంగీతంతో మెదడుకు పూర్తిస్థాయి వ్యాయామం..
పియానో, గిటార్, తబలా లేదా వయోలిన్ వంటి వాయిద్యాలను నేర్చుకునేటప్పుడు మెదడులోని అనేక భాగాలు ఏకకాలంలో పనిచేస్తాయి. వాయిద్యాన్ని వాయించేటప్పుడు వేళ్ల కదలికల వల్ల మెదడులోని 'మోటార్ కార్టెక్స్' చురుగ్గా మారుతుంది. స్వరాలు, లయను వేగంగా గుర్తించడానికి 'ఆడిటరీ సిస్టమ్' నిరంతరం పనిచేస్తుంది.
కొత్త విషయాలను గ్రహించే క్రమంలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు సంబంధించిన భాగాలు ఉత్తేజితం అవుతాయి. సంగీతం నేర్చుకోవడం వల్ల మెదడుకు పూర్తి స్థాయి వ్యాయామం లభిస్తుందని, కణాల మధ్య కమ్యూనికేషన్ మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
మహిళలు గమనించాల్సిన విషయాలు..
మహిళల్లో మెనోపాజ్ (Menopause) తర్వాత వచ్చే హార్మోన్ల మార్పులు మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పడిపోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం మందగిస్తాయి. కాబట్టి మహిళలు వయసుతో పాటు వచ్చే ఈ సమస్యలను అధిగమించడానికి యోగా, ధ్యానం చేయడంతో పాటు నలుగురితో కలిసి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
