World Suicide Prevention Day-2026 : నాకు బతకాలని లేదు’ అని ఎవరైనా అంటే.. కుటుంబ సభ్యులు వెంటనే ఏం చేయాలి..?
సాక్షి లైఫ్ : ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న జరుపుకుంటారు. ఎవరైనా తమ ఆత్మీయులు లేదా స్నేహితులు "నాకు బతకాలని లేదు" లేదా "నా జీవితానికి ఇక అర్థం లేదు" అని పదే పదే అంటుంటే, దానిని కేవలం కోపమో లేదా తాత్కాలిక ఒత్తిడో అని తేలికగా తీసుకోకుండా వెంటనే అప్రమత్తం కావాలని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
వెంటనే ఏం చేయాలి అంటే..?
ఒంటరిగా వదిలేయకండి.. వారు అలా అన్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా ఉంచకూడదు. వారి దగ్గరే ఉండి, మనసులోని బాధను ఓపికగా చెప్పనివ్వాలి. "నీకు నేనున్నాను, మనం కలిసి ఈ సమస్యను దాటుదాం" అని భరోసా ఇవ్వాలి.
నేరుగా అడగండి.. నీకు హాని చేసుకోవాలనే ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా? అని ప్రశాంతంగా, నేరుగా అడగండి. ఇలా అడిగితే వారికి కొత్తగా ఆ ఆలోచనలు వస్తాయేమో అని భయపడాల్సిన అవసరం లేదు. వారి మానసిక సంఘర్షణ తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఇది సాయపడుతుంది. ప్రమాదకర వస్తువులు దూరం.. వారి చుట్టుపక్కల ఏదైనా హాని కలిగించే వస్తువులు అంటే కత్తులు, మందులు, తాడు వంటివి ఉంటే వెంటనే వాటన్నింటినీ వారి కంటికి కనిపించకుండా తీసివేయాలని ప్రముఖ సైకాలజిస్ట్ డా. హిప్నో ప్రద్మాకమలాకర్ వెల్లడిస్తున్నారు.
చేయకూడని పొరపాట్లు..
సలహాలు, తీర్పులు వద్దు..వారిని విమర్శించడం లేదా తప్పుపట్టడం చేయకూడదు. వారు చెప్పేది పూర్తిగా వినకుండా మధ్యలోనే సలహాలు ఇవ్వడం, వాదించడం మానుకోవాలి. భావాలను నిర్లక్ష్యం చేయవద్దు.. "అంతా సర్దుకుంటుందిలే", "నీకేం తక్కువైంది..?", "ఎక్కువగా ఆలోచించకు" లాంటి మాటలు అనకండి. ఇవి వారిని మరింత ఒంటరితనంలోకి నెట్టేస్తాయి.
నిపుణుల సాయం తప్పనిసరి..
ఆత్మహత్య ఆలోచనలు అనేవి తీవ్రమైన మానసిక ఆరోగ్య సంక్షోభానికి సంకేతం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మానసిక వైద్యులను (సైకియాట్రిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్) సంప్రదించాలి. ఒకవేళ వారు వైద్యుల వద్దకు వెళ్లడానికి నిరాకరించినా, వారితో వాదించకుండా, వారి భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ కచ్చితంగా నిపుణుల సాయం తీసుకోవాలని చెబుతున్నారు హిప్నో ప్రద్మాకమలాకర్.
హెల్ప్‌లైన్ నంబర్లు..
మానసిక ఒత్తిడిలో ఉన్నవారికి తక్షణ సాయం అందించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెలీ-మానస్ (Tele-MANAS) టోల్-ఫ్రీ నంబర్ 14416 కి కాల్ చేసి కౌన్సెలింగ్ పొందవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సాయం కోసం 112 కు డయల్ చేయవచ్చు.
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
