Gen Z Mental Stress : మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న జెన్ జీస్.. చికిత్సకు వెనుకంజ..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : బాహ్య ప్రపంచానికి నవ్వుతూ కనిపిస్తారు.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు.. కానీ మనసులో మాత్రం చెప్పలేని ఆవేదన, ఆందోళన వారిని వెంటాడుతుంటాయి. జెన్ జీస్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మానసిక ఒత్తిడి తీవ్ర రూపం దాల్చుతోంది. భావవ్యక్తీకరణలో ముందుంటారని భావించే నేటి తరం.. అసలైన మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రం నలుగురితో పంచుకోవడానికి, వైద్య నిపుణుల సాయం తీసుకోవడానికి తీవ్ర సంకోచం ప్రదర్శిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

గణాంకాలు ఏం చెబుతున్నాయి..?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురిలో ఒకరు దాదాపు 120 కోట్ల మంది ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారు. వీటిలో ఆందోళన (Anxiety), కుంగుబాటు (depression) అత్యంత సాధారణమైనవి.

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 

భారత్‌లో పరిస్థితి..

దేశంలో దాదాపు 15 కోట్ల మందికి పైగా మానసిక ఆరోగ్య సంరక్షణ అవసరమని అంచనా. వేగవంతమైన జీవనశైలి, పోటీ వాతావరణం కారణంగా గ్రామీణ ప్రాంతాలతో (6.9శాతం)పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోని వయోజనుల్లో 13.5శాతం ఈ సమస్య గా ఉంది.

నిపుణుల వద్దకు 10 శాతమే..

 ఇటీవల వెలువడిన అధ్యయనాల ప్రకారం, 13 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కుల్లో సగానికి పైగా యువత తమ భావోద్వేగ సమస్యలను సొంతంగానే దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కేవలం 9 నుంచి 10 శాతం మంది మాత్రమే మానసిక నిపుణులను సంప్రదిస్తున్నారు.

బయటపడకుండా దాచే ప్రయత్నం..

యువతలో దాదాపు 40 శాతానికి పైగా లోపల బాధపడుతున్నప్పటికీ ‘అంతా బాగుంది’ అని నటించడానికే ప్రాధాన్యమిస్తున్నారు. సమస్యపై దృష్టి పడకుండా ఉండేందుకు నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వడం, స్క్రీన్లకు అతుక్కుపోవడం అలవాటుగా మార్చుకుంటున్నారు. సైకియాట్రిస్ట్ లేదా కౌన్సిలర్ వద్దకు వెళ్తే సమాజం లేదా స్నేహితులు ‘పిచ్చివాడు’ అని ముద్ర వేస్తారేమోనన్న అభద్రతాభావం యువతను వెంటాడుతోంది. కుటుంబంలో లేదా సమాజంలో భావోద్వేగాలను పంచుకున్నప్పుడు వారి అసలు బాధను అర్థం చేసుకోకుండా.. 'దృఢంగా ఉండు', 'పనిపై దృష్టి పెట్టు' వంటి సలహాలు ఇవ్వడం వల్ల యువత తమ భావాలను మరింతగా అణచివేసుకుంటోంది.

కృత్రిమ మేధ (AI)తో స్వాంతన సరిపోదు..!

కొంతమంది యువత నిపుణులను సంప్రదించడానికి బదులుగా ఏఐ చాట్‌బాట్‌లతో తమ బాధలను పంచుకుంటున్నారు. ఇది తాత్కాలి కంగా కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసిక రుగ్మత తీవ్రతను అంచనా వేయడానికి వ్యక్తిగత చరిత్ర, కుటుంబ నేపథ్యం, శారీరక మార్పులు వంటి ఎన్నో అంశాలను వైద్యులు పరిశీలించాల్సి ఉంటుంది. తీవ్రమైన కుంగుబాటు లేదా ఆత్మహత్య ఆలోచనలు ఉన్నప్పుడు ఏఐ ఇచ్చే సాధారణ సమాధానాలు ప్రమాదాన్ని మరింత పెంచే అవకాశం ఉంది.

ఎప్పుడు నిపుణులను సంప్రదించాలి..?

నిద్రలేమి లేదా అతిగా నిద్రపోవడం, ఆహారం సరిగ్గా తీసుకోలేక పోవడం, ఆకలి మందగించడం, గతంలో ఎంతో ఆసక్తిగా చేసిన పనుల పట్ల విరక్తి కలగడం, నిరంతర నిరాశ, భవిష్యత్తుపై భయం, ఒంటరిగా ఉండాలనే భావన, పనులపై ఏకాగ్రత కుదరక పోవడం.. మానసిక రుగ్మత అనేది గుండెజబ్బు లేదా మధుమేహం లాంటి ఒక శారీరక రుగ్మతే తప్ప బలహీనత కాదు. తొలి దశలోనే గుర్తించి సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్‌ను సంప్రదిస్తే కౌన్సిలింగ్, అవసరమైన చికిత్సల ద్వారా త్వరగా సాధారణ స్థితికి చేరుకోవచ్చు.

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.