Mental Health Issues : మానసిక సమస్యలు ఉన్నా బయటపడని బాధితులు.. చికిత్సకు అడ్డంకిగా మారుతున్న అపోహలు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ లాంటి సమస్యలు మనుషుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. అయినప్పటికీ, వైద్యులను సంప్రదించేందుకు సమాజంలో ఉన్న అపోహలు, నామోషీ వల్ల చాలామంది వెనకడుగు వేస్తున్నారు. సరైన సమయంలో వైద్య సహాయం అందకపోవడం వల్ల ఈ సమస్యలు ప్రాణాంతకంగా మారుతున్నాయని ప్రముఖ మానసిక ఆరోగ్య సేవా సంస్థ 'అమాహా' (Amaha) తన తాజా నివేదిక 'ది అమాహా మెంటల్ హెల్త్ రిపోర్ట్..అండర్‌స్టాండింగ్ ది జర్నీ టు కేర్ ఇన్ ఇండియా'లో వెల్లడించింది.

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఏడాది పాటు నిశ్శబ్ద వేదనే..

దేశవ్యాప్తంగా 13,825 మందిపై జరిపిన అధ్యయనంలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మానసిక క్షోభను అనుభవిస్తున్న వారిలో 53 శాతం మంది కనీసం ఏడాది పాటు ప్రొఫెషనల్ వైద్యులను లేదా కౌన్సిలర్లను కలవడం లేదు. సమస్య వచ్చిన నెల రోజుల్లోపు నిపుణులను సంప్రదించే వారు కేవలం 11.3 శాతం మాత్రమే. ఇలా సుదీర్ఘకాలం పాటు సమస్యను లోపలే దాచిపెట్టుకోవడం వల్ల అది దీర్ఘకాలిక వ్యాధిగా మారి ప్రాణాలకే ముప్పు తెస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యువతలో భయపెడుతున్న 'సెల్ఫ్ హార్మ్' ఆలోచనలు..

డాక్టర్‌ను కలవకముందే 56.2 శాతం మంది బాధితుల్లో తమను తాము గాయపరచుకోవాలనే (self-harm) ప్రమాదకరమైన ఆలోచనలు వస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. విద్యార్థుల్లో అత్యధికం..ఈ పరిస్థితి విద్యార్థుల్లో మరీ దారుణంగా ఉంది. ఏకంగా 71.7 శాతం మంది విద్యార్థులు స్వీయ హాని ఆలోచనలకు గురైనట్లు అంగీకరించారు.నిరుద్యోగులు, ఉద్యోగుల్లో.. నిరుద్యోగుల్లో 64.7 శాతం, అలాగే ఉద్యోగం చేస్తున్నవారిలో 53.2 శాతం మంది ఈ తరహా మానసిక వేదనను అనుభవించారు.

మత్తు వలయం.. వైద్య సహాయం తీసుకోకుండా తమ ఆందోళనలను తాత్కాలికంగా తగ్గించుకునేందుకు 15.4 శాతం మంది ముందుగా మద్యం, ఇతర మత్తు పదార్థాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే ఈ ధోరణి అధికంగా ఉంది.

ఒకేసారి ముసురుకుంటున్న పలు సమస్యలు..

బాధితుల్లో 94.9 శాతం మంది ఏకకాలంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ మానసిక సమస్యలతో పోరాడుతున్నారు. సగటున ఒక్కో వ్యక్తి ఐదు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు నివేదిక తెలిపింది.

72.1% మంది తీవ్రమైన ఆందోళన (Anxiety)

67.5% మంది మానసిక ఒత్తిడి (Stress)

58.3% మంది నిరంతర బాధ, నిరాశ (Low Mood/Depression)

55.6% మంది వ్యక్తిగత సంబంధాల్లో (Relationships) ఇబ్బందులు

54.1% మంది మూడ్ స్వింగ్స్ (Mood Swings)

 

సొంత ప్రయోగాలు వద్దు.. నిపుణుల సలహాయే ముద్దు..


సమస్య తలెత్తిన వెంటనే 55 శాతం స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నారు. మరో 44.6 శాతం మంది ఇంటర్నెట్ లేదా పుస్తకాల ద్వారా సొంతంగా నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒత్తిడి లేదా నిరాశ అనేది రోజువారీ జీవితంపై, వ్యక్తిగత పనులపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తొలిదశలోనే సైకియాట్రిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడమే ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.