Burnout Syndrome : శారీరక, మానసిక విశ్రాంతి లేకపోతే 'బర్న్అవుట్ సిండ్రోమ్'సమస్య..
సాక్షి లైఫ్ : కార్యాలయాల్లో రోజంతా పనిచేసిన తర్వాత అలసట, చిరాకు అనిపించడం సాధారణమే. కాసేపు విశ్రాంతి తీసుకుంటే చాలావరకు ఈ సమస్య తగ్గిపోతుంది. అయితే వృత్తిపరమైన ఒత్తిడి నిరంతరం కొనసాగుతూ, శారీరక,మానసిక విశ్రాంతి లభించకపోతే అది తీవ్రమైన 'బర్న్అవుట్' (Burnout) ముప్పుకు దారితీస్తుందని మానసిక ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల తలెత్తే ఈ సమస్య వ్యక్తిగత ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా పనితీరును కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది.
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
బర్న్అవుట్ అంటే ఏమిటి..?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. కార్యాలయంలో దీర్ఘకాలి కంగా కొనసాగే ఒత్తిడిని సరిగ్గా నిర్వహించలేకపోవడం వల్ల తలెత్తే తీవ్రమైన శారీరక, మానసిక అలసటనే 'బర్న్అవుట్ సిండ్రోమ్' (Burnout Syndrome) అంటారు. ఇది ఒకటి రెండు రోజుల తాత్కాలిక అలసట కాదు. కనీస విరామం లేకుండా నెలల తరబడి ఒత్తిడికి గురైనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రధాన కారణాలు..?
పని పరిమితిని మించి నిరంతరం బాధ్యతలు మీద వేసుకోవడం. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలనే ఒత్తిడి.. ఆఫీస్ వేళలు ముగిసినా ఈ-మెయిళ్లు, ఫోన్ కాల్స్, మెసేజ్లకు స్పందించాల్సి రావడం. వ్యక్తిగత జీవితం, కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేకపోవడం. నిరంతర ఆందోళన వల్ల తగినంత నిద్ర, విశ్రాంతి కరువవ్వడం.
కనిపించే ముఖ్య లక్షణాలు..
నిరంతర నిస్సత్తువ: నిద్రలేచిన వెంటనే అలసటగా అనిపించడం, రోజంతా శక్తి లేనట్లుగా శారీరక బలహీనత వేధించడం. ఒకప్పుడు ఎంతో ఉత్సాహంగా చేసిన పనులంటేనే భారం లేదా విరక్తిగా అనిపించడం, కార్యాలయానికి వెళ్లడానికే అనాసక్తి కలగడం.
ఏకాగ్రత లోపించడం.. సాధారణ పనులను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టడం, చిన్న విషయాలకే తీవ్ర గందరగోళం చెందడం. చిరాకు, నిరాశ.. చిన్నపాటి ప్రతికూలతలకే సహనం కోల్పోవడం, సహోద్యోగులు లేదా కుటుంబ సభ్యులపై కోపం ప్రదర్శించడం, పనితీరుపై నమ్మకం కోల్పోవడం.
బయటపడే మార్గాలివే..
స్పష్టమైన హద్దులు నిర్ణయించుకోవాలి.. ఆఫీస్ సమయం ముగిసిన తర్వాత పనికి సంబంధించిన కాల్స్, మెసేజ్లకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. 'వర్క్-లైఫ్ బ్యాలెన్స్' పాటించడం ప్రాథమిక సూత్రం. కంప్యూటర్ స్క్రీన్ల ముందు గంటల తరబడి కదలకుండా కూర్చోకుండా.. ప్రతి గంటకోసారి లేచి కాసేపు నడవడం, కళ్లకు విశ్రాంతి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి.
రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిరంతర నిద్ర ఉండేలా చూసుకోవాలి. నడక, యోగా లేదా ప్రాణాయామం వంటివి ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తాయి. అధిక ఒత్తిడికి గురవుతున్నప్పుడు విశ్వసనీయమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా కౌన్సిలర్లతో మాట్లాడి సమస్యకు పరిష్కారం కనుగొనాలి.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
