Bad Memories : మెదడు నుంచి చేదు జ్ఞాపకాల తొలగించొచ్చు.. బోస్టన్ శాస్త్రవేత్తల వినూత్న పరిశోధన..!
సాక్షి లైఫ్ : జీవితంలో కొందరికి ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలు ఉంటే, మరికొందరికి నిద్రలేకుండా చేసే చేదు అనుభవాలు, తీవ్ర మానసిక క్షోభను మిగిల్చే సంఘటనలు వెంటాడుతుంటాయి. ‘ఆ చేదు జ్ఞాపకం మెదడు నుంచి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే ఎంత బాగుండు’ అని చాలామంది అనుకుంటారు. ఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమైన ఈ ఆలోచనను నిజం చేసే దిశగా న్యూరో సైంటిస్టులు ముందడుగు వేశారు.
బోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు మెదడులోని న్యూరాన్ల స్థాయిలో మార్పులు చేయడం ద్వారా తీవ్రమైన వేదనను కలిగించే జ్ఞాపకాలను తొలగించడం, లేదా వాటి తీవ్రతను తగ్గించడం సాధ్యమేనని ప్రయోగపూర్వకంగా నిరూపించారు.
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
జ్ఞాపకాల భౌతిక ముద్ర ‘ఎన్గ్రామ్’ అంటే ఏమిటి..?
మన మెదడు ఒక సంఘటనను లేదా అనుభవాన్ని గుర్తుంచుకు న్నప్పుడు, న్యూరాన్ల సమూహాల్లో ఒక శాశ్వత భౌతిక మార్పు లేదా ముద్ర ఏర్పడుతుంది. నాడీశాస్త్రంలో దీనిని ‘ఎన్గ్రామ్’ (Engram) అని పిలుస్తారు.
బోస్టన్ విశ్వవిద్యాలయం ‘సెంటర్ ఫర్ బ్రెయిన్ అండ్ మెమరీ’ అసోసియేట్ ప్రొఫెసర్ స్టీవ్ రామిరెజ్ బృందం చేపట్టిన తాజా అధ్యయనాల్లో ఈ ఎన్గ్రామ్లపై కీలక పురోగతి లభించింది. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో నిర్దిష్ట జ్ఞాపకాలకు కారణమయ్యే న్యూరాన్లను శాస్త్రవేత్తలు గుర్తించారు.
వెలుగుతో జ్ఞాపకాల పునరుద్ధరణ.. మార్పు..!
పరిశోధకులు ఆప్టోజెనెటిక్స్ (Optogenetics) అనే అధునాతన సాంకేతికతను ఉపయోగించారు. కాంతి కిరణాల సాయంతో నిర్దిష్ట నాడీ కణాలను ఉత్తేజపరిచి, గత జ్ఞాపకాలను కృత్రిమంగా మళ్లీ గుర్తుకు తెచ్చేలా చేశారు.
అంతేకాకుండా, బాధాకరమైన భావోద్వేగాలతో ముడిపడి ఉన్న కణాలను లక్ష్యంగా చేసుకుని నియంత్రించడం ద్వారా ఆ చేదు జ్ఞాపకాల ప్రభావాన్ని తగ్గించడంలోనూ, ఎంపిక చేసిన జ్ఞాపకాలను తుడిచివేయడంలోనూ విజయం సాధించారు.
మానసిక సమస్యల చికిత్సలో సరికొత్త ఆశలు..
ప్రస్తుతం ఈ ప్రయోగాలు జంతువులకే పరిమితమైనప్పటికీ, మానసిక ఆరోగ్య రంగంలో ఇది సరికొత్త విప్లవానికి నాంది పలకవచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు. పీటీఎస్డీ (PTSD) బాధితులకు ఊరట..తీవ్ర ప్రమాదాలు, హింస లేదా యుద్ధ అనుభవాల వల్ల వచ్చే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) బాధితులకు భవిష్యత్తులో ఈ సాంకేతికత సంజీవనిలా మారవచ్చు.
ఆందోళన, కుంగుబాటు నియంత్రణ..తీవ్రమైన డిప్రెషన్, ఫోబియాలు అంటే అకారణ భయాలు తగ్గించడానికి దోహదపడుతుంది. బాధను తగ్గించడమే ప్రధాన లక్ష్యం..జ్ఞాపకాన్ని పూర్తిగా చెరిపివేయడం కంటే, ఆ సంఘటన తాలూకు భయం, తీవ్ర వేదనను తగ్గించడమే ఈ పరిశోధనల ప్రధాన ఉద్దేశమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మానవులపై ఈ తరహా చికిత్సలు అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పట్టినప్పటికీ, మనసును కుంగదీసే చేదు జ్ఞాపకాల సంకెళ్ల నుంచి విముక్తి లభించే రోజు ఎంతో దూరంలో లేదని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.
ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
