Omega-3 Supplements : జ్ఞాపకశక్తి కోసం ఒమేగా-3 సప్లిమెంట్లు వాడుతున్నారా..? తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
సాక్షి లైఫ్ : మెదడు చురుగ్గా పనిచేయాలన్నా, జ్ఞాపకశక్తి మెరుగుపడాలన్నా 'ఒమేగా-3' ఫ్యాటీ యాసిడ్లు ఎంతో అవసరమని నిపుణులు తరచూ చెబుతుంటారు. అయితే, కృత్రిమంగా లభించే ఒమేగా-3 సప్లిమెంట్లు (Omega-3 supplements) వాడటం వల్ల మెదడు పనితీరులో చేకూరే అదనపు ప్రయోజనం ఏమీ లేదని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది.
గత అధ్యయనాలు ఏం చెప్పాయి..?
సాధారణంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు కణాల నిర్మాణానికి, నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేయడానికి, కణాల మధ్య సమాచార మార్పిడికి ఎంతగానో దోహదపడతాయి. రక్తంలో ఈ కొవ్వు ఆమ్లాల స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో ఆలోచనా సామర్థ్యం మెరుగ్గా ఉంటుందని, మతిమరుపు ముప్పు తక్కువగా ఉంటుందని గతంలో పలు పరిశోధనలు వెల్లడించాయి. అల్జీమర్స్ బారిన పడినవారిలో ఈ ఒమేగా-3 స్థాయిలు తక్కువగా ఉన్నట్లు కూడా గుర్తించారు. దీంతో సహజసిద్ధమైన ఆహారం ద్వారా కాకుండా.. చాలామంది జ్ఞాపకశక్తిని పెంచుకోవడం కోసం నేరుగా ఒమేగా-3 సప్లిమెంట్లపై ఆధారపడటం ప్రారంభించారు.
తాజా పరిశోధనలో తేలిందేమిటి..?
ఇటీవల జరిగిన క్లినికల్ ట్రయల్స్ ఈ పాత వాదనను తోసిపుచ్చుతున్నాయి. ఒమేగా-3 సప్లిమెంట్స్ వాడటం వల్ల మతిమరుపు లక్షణాలు తగ్గడం లేదా మెదడు పనితీరు అనూహ్యంగా మెరుగుపడటం వంటి ప్రయోజనాలేవీ లేవని శాస్త్రవేత్తలు తేల్చారు.
దీనిపై ప్రముఖ వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ క్రిస్టీన్ యాఫే మాట్లాడుతూ.. "నాడీ కణాల ఆరోగ్యానికి ఫ్యాటీ యాసిడ్లు అవసరమే అనిపించినప్పటికీ, సప్లిమెంట్ల రూపంలో వాటిని తీసుకోవడం వల్ల మెదడుకు చేకూరే ప్రయోజనాలను శాస్త్రీయ ఆధారాలు ఏమాత్రం సమర్థించడం లేదు" అని స్పష్టం చేశారు.
అధ్యయనం ఎలా జరిగింది..?
సహజంగా ఒమేగా-3 ఎక్కువగా లభించే చేపలు తక్కువగా తినే వృద్ధులపై పరిశోధకులు ఈ క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. ఈ వృద్ధులలో దాదాపు సగం మందికి జన్యుపరంగా మతిమరుపు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంది. వీరికి ఒమేగా-3 సప్లిమెంట్లను క్రమం తప్పకుండా అందించారు. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించగా.. వారి మెదడులో ఆ కొవ్వు ఆమ్లాల స్థాయిలు పెరిగినట్లు నిర్ధారించారు. అయితే, ఆశ్చర్యకరంగా వారి జ్ఞాపకశక్తి, ఆలోచనా తీరు ఎలాంటి సానుకూల మార్పులు లేదా మెరుగుదల కనిపించలేదని పరిశోధకులు వెల్లడించారు. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యలకు లేదా సప్లిమెంట్లు వాడే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
