Food : రుచి కోసం మీరు కూడా 'ఇలాంటి స్లో పాయిజన్ ఫుడ్' తీసుకుంటున్నారా..? డైటీషియన్స్ హెచ్చరిక..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రస్తుత హడావిడి జీవితంలో మనకు తెలియకుండానే మనం స్లో పాయిజన్ ను ఫుడ్ రూపంలో తీసుకుంటున్నాం. కేవలం రుచికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే ముప్పుల గురించి డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు. ఆధునిక జీవనశైలిలో భాగంగా మారిన కొన్ని ఆహారపు అలవాట్లు మనల్ని దీర్ఘకాలిక రోగాల వైపు ఎలా నెట్టేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

 

1. పానీయాల రూపంలో పొంచి ఉన్న ముప్పు..  

ఎండ వేడి నుంచి ఉపశమనం కోసమో, లేదా సరదా కోసమో తాగే శీతల పానీయాలు (Soft drinks), ప్యాక్ చేసిన పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్ శరీరానికి తక్షణమే అదనపు కేలరీలను చేర్చుతాయి. వీటిలో ఉండే అధిక చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతుంది. దీనివల్ల ప్యాంక్రియాస్‌పై ఒత్తిడి పెరిగి ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది.

దీర్ఘకాలిక వ్యాధులు..

ఈ పానీయాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయం, టైప్-2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్ మరియు గుండె జబ్బుల ముప్పు ముప్పేట దాడి చేస్తుంది.

2. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్.. నోటికి రుచి.. ఒంటికి చేటు..

చిప్స్, నమకీన్లు, ఫ్లేవర్డ్ స్నాక్స్ వంటి అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అయితే వీటి వెనుక దాగున్న చేదు నిజాలు ఇవే:

అధిక సోడియం..నిల్వ ఉంచేందుకు, రుచి కోసం వీటిలో వాడే ఉప్పు (salt), అనారోగ్యకరమైన కొవ్వులు రక్తపోటును (BP) పెంచుతాయి.

పోషకాల లోపం..ఈ తరహా ఆహారాల్లో పీచు పదార్థం (ఫైబర్), విటమిన్లు శూన్యం. ఫలితంగా ఇవి కడుపు నింపుతాయి కానీ శరీరానికి కావాల్సిన పోషణను అందించవు.

3. బేకరీ ఉత్పత్తులతో జాగ్రత్త..!

కేకులు, పేస్ట్రీలు, డోనట్స్, బిస్కెట్లు, కుకీలలో మైదా, డాల్డా, రిఫైండ్ షుగర్ అధికంగా ఉంటాయి. మీకు తీపి తినాలనిపించినప్పుడు బేకరీ వస్తువులకు దూరంగా ఉండి, పరిమిత పరిమాణంలో ఇంట్లో చేసిన మిఠాయిలు లేదా తాజా పండ్లను ఎంచుకోవడం ఉత్తమం. ఇది దంత సమస్యలను మరియు బరువు పెరగడాన్ని అరికడుతుంది.

4. ఇన్‌స్టంట్ నూడుల్స్, రెడీ టు ఈట్ ఫుడ్..

సమయం ఆదా అవుతుందనే ఉద్దేశంతో చాలామంది ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్యాకెట్లలో దొరికే రెడీ టు ఈట్ ఫుడ్ పై ఆధారపడుతున్నారు. వీటిలో వాడే ప్రిజర్వేటివ్‌లు (నిల్వ ఉంచే రసాయనాలు) ,మోనోసోడియం గ్లుటామేట్ (టేస్టింగ్ సాల్ట్) జీర్ణక్రియను పూర్తిగా దెబ్బతీస్తాయి. ఎల్లప్పుడూ ఇంట్లో వండిన వేడి వేడి తాజా భోజనానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.

శరీరానికే కాదు.. మానసిక ఆరోగ్యానికీ నష్టం..!

అనారోగ్యకరమైన ఆహారాలు కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక సమతుల్యతను కూడా దెబ్బతీస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. జంక్ ఫుడ్ వల్ల శరీరంలో పెరిగే ఇన్ఫ్లమేషన్ కారణంగా ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

పిల్లల్లో ప్రభావం ఎలా ఉంటుంది అంటే..?

చిన్న వయసులోనే జంక్ ఫుడ్‌కు బానిసలవడం వల్ల పిల్లల్లో స్థూలకాయంతో పాటు, ఏకాగ్రత లోపించడం (ADHD) వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. రుచి తాత్కాలికం.. ఆరోగ్యం శాశ్వతం. కాబట్టి ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు వీలైనంత దూరంగా ఉంటూ.. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని మన దినచర్యలో భాగం చేసుకుందాం. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం..

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.