Amazing Benefits of Lemon Peels : నిమ్మ తొక్కలను ఇలా వాడితే ప్రయోజనాలెన్నో..!
సాక్షి లైఫ్ : సాధారణంగా వంటకాల్లో, శరబత్లలో నిమ్మరసం పిండిన తర్వాత చాలా మంది ఆ తొక్కలను పనికిరాని చెత్తగా భావించి పారేస్తుంటారు. కానీ, నిమ్మరసం కంటే దాని తొక్కల్లోనే పోషకాలు, సువాసన భరితమైన నూనెలు ఎక్కువగా ఉంటాయని మీకు తెలుసా..? నిమ్మ తొక్కలను పారేయకుండా కాస్త బుద్ధి ఉపయోగిస్తే... ఇటు ఇంటి పనులకు, అటు ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేకూరుతాయి. ఆ అద్భుతమైన ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
న్యాచురల్ ఫేస్ ప్యాక్..
నిమ్మ తొక్కలను ఎండబెట్టి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడికి కొద్దిగా పెరుగు లేదా రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే... చర్మంపై ఉండే అదనపు జిడ్డు తొలగిపోయి, ముఖం సహజమైన మెరుపును సంతరించుకుంటుంది.
గోళ్ల మెరుపునకు..
గోరువెచ్చని నీటిలో నిమ్మ తొక్కలను వేసి, అందులో చేతులు, పాదాల వేళ్లను కొద్దిసేపు నానబెట్టాలి. ఆపై తొక్కలతో గోళ్లపై మృదువుగా రుద్దితే గోళ్లపై ఉన్న పసుపు రంగు పోయి తెల్లగా, అందంగా మారుతాయి.
చుండ్రు సమస్యకు నివారణ..
నిమ్మ తొక్కల పేస్ట్‌ను పెరుగుతో కలిపి తలకు పట్టించి, అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
ఆరోగ్యానికి ఎంతో మేలు..
నోటి దుర్వాసన దూరం..ఎండబెట్టిన నిమ్మ తొక్కల పొడికి కొద్దిగా సైంధవ లవణం (Rock Salt) కలిపి పళ్లను తోముకుంటే నోటి దుర్వాసన పోవడమే కాకుండా చిగుళ్లు బలంగా తయారవుతాయి.
హెర్బల్ టీలో రుచి కోసం..
నిమ్మ తొక్కల పొడిని లేదా ఎండబెట్టిన తొక్కలను బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ కాచేటప్పుడు వేస్తే టీకి అద్భుతమైన ఫ్లేవర్ రావడమే కాకుండా శరీరానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి.
వంటల్లో, తోటపనిలో కూడా..
బేకింగ్, సలాడ్లలో: తాజా నిమ్మ తొక్క పైభాగాన్ని సన్నగా తురిమి (Lemon Zest) కేకులు, కుకీలు, సలాడ్లు లేదా పాస్తాపై చల్లుకుంటే ఆ వంటకాల రుచి, సువాసన రెట్టింపవుతాయి.
జిడ్డు వదిలించే క్లీనర్..
నిమ్మ తొక్కలను ఒక సీసాలో వేసి, అందులో వైట్ వెనిగర్ పోసి కొన్ని రోజుల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఆ నీటిని వడగట్టి స్ప్రే బాటిల్లో పోసుకుంటే అద్భుతమైన నేచురల్ క్లీనర్ సిద్ధమవుతుంది. దీనితో వంటగది స్టవ్, గట్టు, సింక్‌లపై ఉండే మొండి జిడ్డును సులభంగా వదిలించవచ్చు.
ఫ్రిడ్జ్ దుర్వాసనకు చెక్..
రిఫ్రిజిరేటర్ తెరిచినప్పుడు ఒక్కోసారి రకరకాల ఆహార పదార్థాల వల్ల వింత వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు ఒక చిన్న గిన్నెలో నిమ్మ తొక్కలను వేసి ఫ్రిడ్జ్‌లో ఉంచితే, అది దుర్వాసనను పీల్చేసి మంచి సువాసనను ఇస్తుంది.
గదిని తాజాగా మార్చే రూమ్ ఫ్రెషనర్..
ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో నిమ్మ తొక్కలు, కొద్దిగా దాల్చినచెక్క లేదా లవంగాలు వేసి బాగా మరిగించాలి. ఆ నీటి ఆవిరి ఇల్లంతా వ్యాపించడం వల్ల ఇల్లు సహజసిద్ధమైన సువాసనతో తాజాగా మారుతుంది. మొక్కలకు సహజ ఎరువు..నిమ్మ తొక్కలను చిన్న ముక్కలుగా కోసి కుండీల్లోని మట్టిలో కలపడం వల్ల మొక్కలకు మంచి పోషకాలు అందడమే కాకుండా, కీటకాలు, పురుగులు దరిచేరకుండా ఉంటాయి.
చూశారుగా! నిమ్మకాయ రసమే కాదు, దాని తొక్క కూడా ఎంత విలువైనదో..! కాబట్టి ఇప్పటి నుంచి నిమ్మ తొక్కలను డస్ట్‌బిన్‌లో పడేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించి, వాటిని భద్రపరచుకోండి.
