Brushing Your Teeth : పళ్ళు తోముకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే ఈ ముప్పు తప్పదు..!
సాక్షి లైఫ్ : అందమైన చిరునవ్వు ముఖానికి మరింత నిగారింపును ఇస్తుంది. అయితే, ఆ చిరునవ్వు వెనుక ఆరోగ్యకరమైన దంతాలు ఉండటం చాలా ముఖ్యం. చాలామంది ప్రతిరోజూ పళ్ళు తోముకుంటారు కానీ, సరైన పద్ధతిని పాటించరు. దీనివల్ల పళ్ళు శుభ్రపడకపోగా.. నోటి దుర్వాసన, పిప్పి పళ్ళు, చిగుళ్ళ వాపు వంటి అనేక సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దంతాలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవడానికి వైద్యులు సూచిస్తున్న కొన్ని ముఖ్యమైన చిట్కాలు మీకోసం..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
రోజుకు రెండుసార్లు తప్పనిసరి..
ఉదయం నిద్రలేచిన తర్వాత బ్రష్ చేయడం ఎంత ముఖ్యమో.. రాత్రి పడుకునే ముందు దంతాలను శుభ్రం చేసుకోవడం కూడా అంతకంటే ముఖ్యం. రాత్రిపూట బ్రష్ చేయకపోతే, రోజంతా మనం తిన్న ఆహార కణాలు పళ్ళ మధ్య ఉండిపోయి బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఇది దంత క్షయానికి దారితీస్తుంది.
రెండు నిమిషాల సూత్రం..
చాలామంది ఏదో చుట్టపుచూపుగా కొన్ని సెకన్ల పాటు బ్రష్‌ను నోట్లో తిప్పి ముగించేస్తుంటారు. కానీ, దంతాలలోని ప్రతి మూల శుభ్రపడాలంటే కనీసం రెండు నిమిషాల పాటు బ్రష్ చేయాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అప్పుడే పళ్ళపై పేరుకుపోయిన ప్లాక్ (జిగురు లాంటి పొర) తొలగిపోతుంది.
బ్రష్ ఎంపికలో జాగ్రత్త..!
మెత్తని బ్రిసిల్స్ (Soft Bristles): గట్టిగా ఉండే బ్రష్‌లను వాడటం వల్ల దంతాలపై ఉండే రక్షణ పొర (ఎనామెల్) దెబ్బతింటుంది. చిగుళ్ళ నుండి రక్తం కారే ప్రమాదం ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ సాఫ్ట్ బ్రిసిల్స్ ఉన్న టూత్‌బ్రష్‌నే ఎంచుకోవాలి.
మార్చడం మరువకండి: టూత్‌బ్రష్‌ను నెలల తరబడి వాడకూడదు. బ్రష్ వెంట్రుకలు అరిగిపోతే అది పళ్ళను సరిగ్గా శుభ్రం చేయలేదు. అందుకే ప్రతి 3 నెలలకు ఒకసారి పాత బ్రష్‌ను మార్చి, కొత్త బ్రష్‌ను ఉపయోగించాలి.
తోమే పద్ధతి మార్చుకోండి..
పళ్ళను గట్టిగా ముందుకు, వెనుకకు రుద్దడం తప్పుడు పద్ధతి. దీనివల్ల చిగుళ్ళు బలహీనపడతాయి. బ్రష్‌ను సున్నితంగా, వృత్తాకార కదలికల్లో (Circular Motion) తిప్పుతూ తోమాలి. ఇది దంతాల సందుల్లో ఉన్న మురికిని సులభంగా తొలగిస్తుంది.
నాలుక శుభ్రత కూడా ముఖ్యమే..
నోటి దుర్వాసనకు ప్రధాన కారణం నాలుకపై పేరుకుపోయే బ్యాక్టీరియా. పళ్ళు తోముకోవడంతో పాటు, ప్రతిరోజూ నాలుకను కూడా సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. అప్పుడే నోరు తాజా శ్వాసతో శుభ్రంగా ఉంటుంది. పళ్ళను తోమేటప్పుడు ఎక్కువ ఒత్తిడి ఐతే ఉపయోగించకండి. చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ దంతాలు జీవితకాలం పదిలంగా ఉంటాయి.
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
