Earbuds side effects : ఇయర్‌బడ్స్‌తో వచ్చే అనారోగ్యసమస్యలేంటి..?
సాక్షి లైఫ్ : స్నానం చేసిన ప్రతిసారీ చెవులు శుభ్రం చేసుకోవడానికి కాటన్ ఇయర్‌బడ్స్ వాడటం చాలామందికి రోజువారీ అలవాటు. చెవుల్లో పేరుకుపోయే గులిమిని పూర్తిగా తొలగించేందుకు ఇవే మేలైన మార్గమని చాలామంది భావిస్తుంటారు. కానీ వైద్య నిపుణుల మాట వేరేలా ఉంది. ఈ అలవాటు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. అసలు చెవి గులిమి మురికి కాదు, అది దుమ్ము, బ్యాక్టీరియా, చిన్న కీటకాల నుంచి చెవిని కాపాడే ఒక సహజ రక్షణ కవచం. ఇయర్‌బడ్స్ వాడకం వల్ల ఈ రక్షణ పొరకే హాని కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇయర్‌బడ్స్‌తో వచ్చే సమస్యలేంటి..?
గులిమిని బయటకు తీయాలనుకుని ఇయర్‌బడ్ పెడితే, అది వాస్తవానికి గులిమిని చెవి లోపలికి మరింత నెట్టేస్తుంది. దీనివల్ల గులిమి గట్టిపడి చెవి మూసుకుపోయే పరిస్థితి తలెత్తవచ్చు.
ఇయర్‌బడ్ అవసరానికి మించి లోపలికి వెళితే సున్నితమైన కర్ణభేరికి దెబ్బ తగిలే, చిల్లు పడే ప్రమాదం ఉంటుంది. ఇది వినికిడి శక్తిని దెబ్బతీయవచ్చు.
ఇన్ఫెక్షన్ల ముప్పు..
పదేపదే చెవిలో ఇయర్‌బడ్ పెట్టడం వల్ల చెవి లోపలి చర్మంపై సూక్ష్మగాయాలు ఏర్పడతాయి. వీటి ద్వారా బ్యాక్టీరియా ప్రవేశించి ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. ఇయర్‌బడ్స్‌ను మితిమీరి వాడటం వల్ల చెవిలో నొప్పి, దురద, అసౌకర్యం వంటివి ఎదురుకావచ్చు. గులిమి చెవిని దుమ్ము, నీరు, బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది. దీన్ని పదేపదే తీసేయడం వల్ల చెవి సహజ రక్షణ వ్యవస్థ బలహీన పడుతుంది.
చెవులు శుభ్రం చేసుకోవడానికి సరైన మార్గం ఇదే..
చెవుల్లోకి ఇయర్‌బడ్స్ కానీ, పదునైన వస్తువులు కానీ పెట్టవద్దు..చెవి బయటి భాగాన్ని పొడిగా, శుభ్రంగా ఉన్న గుడ్డతో మాత్రమే తుడుచుకోవాలి. గులిమి మరీ ఎక్కువగా పేరుకుపోతున్నట్టు అనిపిస్తే ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించాలి. డాక్టర్ సూచించిన ఇయర్ డ్రాప్స్‌ను మాత్రమే వాడాలి. చెవి గులిమి దానంతట అదే బయటకు వచ్చేస్తుంది కాబట్టి, అనవసరంగా శుభ్రం చేసుకోవడం మానుకోవాలి.
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.
చెవిలో నిరంతర నొప్పి, వినికిడి తగ్గడం, చెవి నుంచి నీరు లేదా చీము కారడం, తీవ్రమైన దురద లేదా మంట, చెవిలో రింగుమనే శబ్దం, తలతిరగడం వంటివి కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాటన్ ఇయర్‌బడ్స్‌తో చెవులు శుభ్రం చేసుకోవడం సురక్షితం కాదని, ఈ అలవాటు గులిమి పేరుకుపోవడం, ఇన్ఫెక్షన్లు, వినికిడి సమస్యలకు దారితీయవచ్చని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యకరమైన చెవుల కోసం అనవసరమైన శుభ్రత మానుకుని, అవసరమైనప్పుడు మాత్రమే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి..Jamun Benifits : జీర్ణ సమస్యలకు సరైన దివ్యౌషధం నేరేడు పండు..
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
