Warning Signs : పాదాలు ఎప్పుడూ చల్లగా ఉంటున్నాయా..? నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదు..!
సాక్షి లైఫ్ : మన ఆరోగ్యం సరిగాలేనప్పుడు శరీరంలో కొన్ని సందర్భాల్లో పలురకాల సంకేతాలు కనిపిస్తాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పాదాలు చల్లబడటం సహజం. కానీ, అన్ని కాలాల్లోనూ పాదాలు చల్లగా, మొద్దుబారినట్లు అనిపిస్తుంటే మాత్రం అప్రమత్తం కావాల్సిందే..! చాలామంది దీనిని వాతావరణ మార్పులు లేదా అలసట వల్ల వచ్చిన సమస్యగా భావించి తేలిగ్గా తీసుకుంటారు. కానీ, ఇది శరీరంలోని అంతర్గత ఆరోగ్య సమస్యలకు ఒక స్పష్టమైన సంకేతం కావొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వెనుక ఉన్న కారణాలు, పొంచి ఉన్న ఆరోగ్య సమస్యల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అత్యవసరం.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
రక్త ప్రసరణలో లోపాలే ప్రధాన కారణం..
శరీర దిగువ భాగానికి, ముఖ్యంగా పాదాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడమే (Poor blood circulation) పాదాలు చల్లబడటానికి ప్రధాన కారణం. రక్తనాళాల్లో (arteries) కొలెస్ట్రాల్ లేదా ఇతర వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల అవి ఇరుకుగా, గట్టిగా మారుతాయి. దీనివల్ల పాదాలకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలను తీసుకెళ్లే రక్తం సరైన మోతాదులో సరఫరా కాదు. ఈ పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగితే కణజాలం దెబ్బతిని, నడవడంలోనూ తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి.
ఏయే వ్యాధులకు ఇది సంకేతం..?
పాదాలు తరచుగా చల్లబడటం అనేది కేవలం రక్త ప్రసరణ సమస్య మాత్రమే కాకుండా, పలు అనారోగ్య సమస్యలకు కూడా ముందస్తు సంకేతం కావొచ్చు. రక్తహీనత (Anemia).. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం వల్ల తరచుగా చలిగా అనిపించడంతో పాటు పాదాలు చల్లబడతాయి. థైరాయిడ్ సమస్యలు.. థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించి, హార్మోన్ల ఉత్పత్తి తగ్గినప్పుడు (hypothyroidism) శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే ప్రక్రియ దెబ్బతింటుంది.
గుండె సమస్యలు..గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గినప్పుడు శరీరంలోని చివరి అవయవాలైన పాదాలకు రక్త సరఫరా నెమ్మదిస్తుంది. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD)..ధమనులు కుంచించుకుపోయి కాళ్లకు రక్త ప్రసరణ ఆగిపోయే ప్రమాదకర స్థితి ఇది. నరాల బలహీనత.. నరాలు దెబ్బతినడం వల్ల పాదాల్లో స్పర్శ కోల్పోయి, ఎప్పుడూ చల్లగా ఉన్న భావన కలుగుతుంది.
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి..?
ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా, నడవకపోయినా పాదాల్లో నిరంతరం నొప్పి వస్తుంటే.. అది 'విటమిన్ బి-12' లోపం లేదా మధుమేహ రోగుల్లో వచ్చే 'డయాబెటిక్ న్యూరోపతీ'కి సంకేతం కావొచ్చు. పాదాలు, చీలమండల వద్ద తరచుగా వాపులు రావడం, తిమ్మిర్లు ఎక్కడం, సూదులతో గుచ్చినట్లు అనిపించడం, ఎప్పుడూ చల్లగానే ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. సొంత వైద్యం చేసుకోకుండా, వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే పెను ముప్పును నివారించవచ్చు.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
