Metabolism : మెటబాలిజం చురుకుగా ఉండాలంటే ఎలాంటి మార్పులు చేసుకోవాలి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మార్చే కీలక ప్రక్రియే 'మెటబాలిజం' (Metabolism). ఈ ప్రక్రియ సజావుగా సాగితేనే శరీర బరువు, జీర్ణవ్యవస్థ, రక్తంలో చక్కెర స్థాయిలు, హార్మోన్ల సమతుల్యత అదుపులో ఉంటాయి. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, శారీరక శ్రమ లోపించడం, నిద్రలేమి, ఒత్తిడి వంటివి జీవక్రియను నెమ్మదింపజేస్తాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మెటబాలిజంను చురుకుగా ఉంచుకోవడానికి వైద్య నిపుణులు సూచిస్తున్న మార్పులివే..

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

ప్రొటీన్ ఆహారం ముఖ్యం..

జీవక్రియ రేటును పెంచడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లు, కొవ్వులతో పోలిస్తే ప్రొటీన్‌ను జీర్ణం చేయడానికి శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. దీనికోసం గుడ్లు, పాలు, పెరుగు, పప్పుధాన్యాలు, గింజలు రోజూవారీ డైట్‌లో చేర్చుకోవాలి. వీటితో పాటు తాజా పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్, విటమిన్లు అందుతాయి.

కంటినిండా నిద్ర..

ఆరోగ్యకరమైన మెటబాలిజంకు నిద్ర చాలా అవసరం. నిద్రలేమి కారణంగా ఆకలిని ప్రేరేపించే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల బరువు పెరగడం, షుగర్ లెవల్స్ పెరగడం లాంటివి జరుగుతాయి. కాబట్టి పెద్దలు రోజూ 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాలి. నిద్రకు ఉపక్రమించే ముందు మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు దూరంగా ఉండటం మంచిది.

వ్యాయామం తప్పనిసరి..

శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. కండరాలు దృఢంగా మారడంతో పాటు అదనపు క్యాలరీలు కరుగుతాయి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్, సైక్లింగ్, యోగా లాంటివి చేయాలి. వారంలో రెండు రోజులు కండరాలను బలపరిచే వ్యాయామాలు (strength-training exercises) చేయడం మరీ మంచిది.

చురుకైన జీవక్రియ కోసం మరికొన్ని చిట్కాలు..

శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. రోజంతా తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి.భోజనం చేసిన తర్వాత కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు నడవాలి. గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం అనర్థదాయకం. ప్రతి అరగంటకోసారి లేదా గంటకోసారి లేచి రెండు నిమిషాలు అటూఇటూ నడవాలి. బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఎక్కువ సేపు పస్తులు ఉండటం, క్రాష్ డైట్‌లు చేయడం వల్ల మెటబాలిజం దెబ్బతింటుంది. సమతుల్య ఆహారం తీసుకోవాలి.
 ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయాలి.

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.