Kidneys Health care : మీ కిడ్నీలు పదిలమేనా..? ఈ పరీక్షలతో ఇట్టే తెలుసుకోవచ్చు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మన శరీరంలో మూత్రపిండాలు (kidneys) చేసే మేలు అంతాఇంతా కాదు. నిరంతరం రక్తాన్ని వడబోస్తూ.. అందులోని యూరియా, క్రియేటినిన్, ఇతర మలినాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అంతేకాకుండా, రక్తపోటును సమతుల్యంగా ఉంచే కొన్ని ముఖ్యమైన హార్మోన్లను సైతం ఇవి ఉత్పత్తి చేస్తాయి. అయితే, నేటి ఉరుకుల పరుగుల జీవితం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా కిడ్నీల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది.

కిడ్నీ వ్యాధుల విషయంలో ఉన్న అతిపెద్ద ముప్పు ఏంటంటే.. ఇవి ప్రాథమిక దశలో ఎలాంటి లక్షణాలను బయటపెట్టవు. వేరే ఏదైనా అనారోగ్య సమస్య కోసం పరీక్షలు చేయించుకున్నప్పుడు మాత్రమే చాలామందికి తమ కిడ్నీలు పాడయ్యాయన్న విషయం తెలుస్తుంటుంది. మరి మన కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో ముందే తెలుసుకోవడం ఎలా..? వైద్య నిపుణులు సూచిస్తున్న ఆ పరీక్షలేంటో చూద్దాం..

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

కేవలం క్రియేటినిన్ చూస్తే సరిపోదు..!

సాధారణంగా కిడ్నీల పనితీరు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది 'సీరం క్రియేటినిన్' పరీక్ష. కండరాల కదలికల వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక వ్యర్థ పదార్థమే ఈ క్రియేటినిన్. కిడ్నీలు దీనిని వడబోసి బయటకు పంపుతాయి. కిడ్నీల పనితీరు మందగించిన ప్పుడు రక్తంలో క్రియేటినిన్ స్థాయిలు పెరుగుతాయి. దీన్ని బట్టి కిడ్నీల సమస్యను గుర్తిస్తారు. అయితే, కండరాల పరిమాణం వంటి ఇతర అంశాలు కూడా క్రియేటినిన్ స్థాయిలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి, కేవలం క్రియేటినిన్ స్థాయిలను చూసి కిడ్నీల ఆరోగ్యాన్ని వంద శాతం అంచనా వేయలేము.

వడపోత సామర్థ్యానికి.. 'ఈజీఎఫ్ఆర్ (eGFR)'..

కిడ్నీలు రక్తాన్ని ఎంత సమర్థవంతంగా వడబోస్తున్నాయో కచ్చితంగా తెలుసుకోవడానికి వైద్యులు 'ఈజీఎఫ్ఆర్ (Estimated Glomerular Filtration Rate)' పరీక్షను సూచిస్తారు. క్రియేటినిన్ నివేదిక, వయసు, లింగ భేదం ఆధారంగా వడపోత సామర్థ్యాన్ని ఈ పరీక్ష ద్వారా లెక్కకడతారు.

మూత్రంలో ప్రొటీన్ పోతోందా? (UACR టెస్ట్)..

కిడ్నీలు వ్యర్థాలను మాత్రమే బయటకు పంపి, రక్తంలో ఉండే అవసరమైన ప్రొటీన్లను శరీరంలోనే నిలుపుతాయి. కానీ, కిడ్నీ వడపోత ప్రక్రియ దెబ్బతిన్నప్పుడు 'ఆల్బుమిన్' అనే ప్రొటీన్ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. దీన్ని గుర్తించేందుకు 'యూరిన్ ఆల్బుమిన్-టు-క్రియేటినిన్ రేషియో' (UACR) పరీక్ష చేస్తారు. దీని ఫలితం 30 మిల్లీగ్రాములు/గ్రాము (30 mg/g) కంటే తక్కువ ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. అంతకంటే ఎక్కువ ఉంటే కిడ్నీల పనితీరు మందగించినట్లుగా భావించాలి.

అప్రమత్తత ఎవరికి అవసరం..?

మధుమేహం (diabetes), అధిక రక్తపోటు (high blood pressure) ఉన్నవారిలో కిడ్నీలు త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి వీరు తమ కిడ్నీల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పైన పేర్కొన్న పరీక్షలతో పాటుగా వయసు, వ్యాధి లక్షణాలను బట్టి బ్లడ్ యూరియా నైట్రోజన్ (BUN), ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజ్ వంటి ఇతర పరీక్షలను కూడా వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా చేయించుకోవాలి.

 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.