High-Protein Diet : అధిక ప్రోటీన్ ఆహారంతో యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..? నిజానిజాలేంటో తెలుసుకోండి..!
సాక్షి లైఫ్ : నేటి ఆధునిక జీవనశైలిలో ఫిట్‌నెస్, బరువు తగ్గడం (Weight Loss) పై ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. ఇందుకోసం జిమ్‌కు వెళ్లేవారు, క్రీడాకారులు మాత్రమే కాకుండా సామాన్యులు సైతం తమ రోజువారీ మెనూలో 'అధిక ప్రోటీన్' (High-Protein) ఆహారానికి పెద్దపీట వేస్తున్నారు. అయితే, ప్రోటీన్లు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో 'యూరిక్ యాసిడ్' స్థాయిలు పెరిగిపోయి, కీళ్ల నొప్పులు, గౌట్ (Gout) వంటి వ్యాధులకు దారితీస్తుందనే భయం చాలా మందిలో ఉంది. ఈ ప్రచారంలో నిజమెంత? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి..?
మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాలలో 'ప్యూరిన్లు' (Purines) అనే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. శరీరం ఈ ప్యూరిన్లను విచ్ఛిన్నం చేసినప్పుడు 'యూరిక్ యాసిడ్' అనే వ్యర్థ పదార్థం ఉప ఉత్పత్తిగా (By-product) ఏర్పడుతుంది. సాధారణంగా ఇది రక్తం ద్వారా మూత్రపిండాలకు (Kidneys) చేరి, అక్కడ శుద్ధి చేయబడి మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. కానీ, శరీరంలో దీని ఉత్పత్తి ఎక్కువైనా లేదా కిడ్నీలు దీనిని సరిగ్గా బయటకు పంపలేకపోయినా.. ఇది కీళ్లలో స్పటికాలుగా (Crystals) పేరుకుపోయి తీవ్రమైన వాపులు, నొప్పులకు కారణమవుతుంది.
ప్రోటీన్లు అన్నీ ఒకటేనా..?
అధిక ప్రోటీన్ ఆహారం తీసుకున్న ప్రతి ఒక్కరిలో యూరిక్ యాసిడ్ పెరగదు. ఎందుకంటే మనం తీసుకునే ప్రోటీన్ వనరును బట్టి ఈ ముప్పు ఆధారపడి ఉంటుంది. సురక్షితమైన ప్రోటీన్లు..గుడ్లు, పాలు, పెరుగు, పనీర్ వంటి పాల ఉత్పత్తులతో పాటు పప్పుధాన్యాలు, శనగలు, బఠానీలు వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్ల వల్ల యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం చాలా తక్కువ.
ప్రమాదకరమైన ప్రోటీన్లు ఏమిటంటే..? రెడ్ మీట్, లివర్ వంటి అవయవ మాంసాలు (Organ Meats), కొన్ని రకాల సముద్రపు ఆహారాలు (sea foods) లో ప్యూరిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని అధికంగా తింటేనే ప్రమాదం పొంచి ఉంటుంది.
మితమే హితం..!
శరీర బరువు, శారీరక శ్రమను బట్టి తగిన మోతాదులో సమతుల్యంగా తీసుకునే అధిక ప్రోటీన్ ఆహారం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు అసాధారణంగా పెరగవు.
తెరపైకి 'డీహైడ్రేషన్' ముప్పు..!
చాలా మంది ప్రోటీన్ల పరిమాణాన్ని పెంచుతారు కానీ, నీళ్లు తాగడం తగ్గిస్తారు. శరీరంలో తగినంత నీరు లేకపోతే మూత్రపిండాలు యూరిక్ యాసిడ్‌ను సమర్థవంతంగా వడపోయలేవు. ఫలితంగా రక్తంలో దీని శాతం పెరుగుతుంది. అందుకే ఎక్కువ ప్రోటీన్ తీసుకునేవారు రోజంతా పుష్కలంగా నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ఎంతో అవసరం.
జీవనశైలి పాత్రే కీలకం..
యూరిక్ యాసిడ్ పెరగడానికి కేవలం ఆహారమే కాదు, మన అలవాట్లు కూడా ముఖ్య కారణమే.
ఊబకాయం (Obesity)..అధిక బరువు ఉన్నవారిలో శరీరం ఎక్కువ యూరిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మద్యపానం.. ముఖ్యంగా బీర్ వంటి పానీయాలు శరీరంలో యూరిక్ యాసిడ్ విడుదలను వేగవంతం చేస్తాయి.
వ్యాయామం లేకపోవడం..శారీరక శ్రమ లేని నిశ్చల జీవనశైలి ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తుంది.
అధిక ప్రోటీన్ ఆహారం నేరుగా యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణం కాదు. ప్యూరిన్లు ఎక్కువగా ఉండే మాంసాహారాన్ని అతిగా తీసుకోవడం, నీరు తక్కువగా తాగడం, అనారోగ్యకరమైన జీవనశైలి వల్లే అసలు సమస్య వస్తుంది. కాబట్టి, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, తగినంత నీరు తాగుతూ, సమతుల్యమైన ప్రోటీన్ ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కీళ్ల నొప్పులు లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు మాత్రం డైటీషియన్ లేదా వైద్యుల సలహా మేరకు డైట్ ప్లాన్ చేసుకోవాలి.
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
