Banana : ఉదయాన్నే పరగడుపున అరటిపండు తినొచ్చా..? లాభనష్టాలు..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే పండ్లలో అరటిపండుది ప్రత్యేక స్థానం. ఇందులో పొటాషియం, పీచు పదార్థం (fiber), విటమిన్ బి6, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్లు వంటి ఎన్నో కీలక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే చాలామంది తమ దినచర్యను అరటిపండుతోనే ప్రారంభిస్తుంటారు. అయితే, రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు తినడం ఆరోగ్యానికి నిజంగానే మంచిదా..? లేక దీనివల్ల ఏవైనా ఇబ్బందులు తలెత్తుతాయా..? అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

పరగడుపున అరటిపండు తింటే కలిగే ప్రయోజనాలు.. 

 అరటిపండులోని సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. ఉదయాన్నే దీనిని తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా పనిచేయడానికి కావలసిన బలం లభిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

అరటిపండులో సమృద్ధిగా ఉండే పొటాషియం రక్తపోటును (BP) అదుపులో ఉంచడానికి కీలకంగా తోడ్పడుతుంది. శరీరంలోని ద్రవాల సమతుల్యతను కాపాడటంలోనూ, కండరాలు సక్రమంగా పనిచేయడంలోనూ పొటాషియం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులోని విటమిన్ బి6 మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు, ప్రోటీన్ జీవక్రియకు, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

ఖాళీ కడుపుతో తింటే ఎదురయ్యే సమస్యలు.. 

 జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉండేవారికి పరగడుపున అరటిపండు తినడం వల్ల కడుపు బరువుగా అనిపించడం లేదా ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇందులో సహజ కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల రక్తంలోని షుగర్ స్థాయిల(blood sugar levels)పై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మధుమేహం (diabetes) ఉన్నవారు బాగా పండిన అరటిపండ్లను తినే విషయంలో, పరిమాణం విషయంలో జాగ్రత్త వహించాలి.
 
కొందరికి అరటిపండులోని ఫైబర్, కార్బోహైడ్రేట్ల కారణంగా గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు కలుగవచ్చు. అరటిపండు లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మూత్రపిండాల (kidney) సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహా మేరకే దీనిని తీసుకోవాలి.

అరటిపండు తినడానికి సరైన సమయం, పద్ధతి ఏది..?

అరటిపండు తినడానికి ఇదే నిర్దిష్ట సమయం అని ఏమీ లేదు. ఉదయం అల్పాహారంలో, మధ్యాహ్నం లేదా వ్యాయామం చేసే ముందు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే, ఖాళీ కడుపుతో ఒట్టి అరటిపండు తినడం కంటే ఇతర పోషకాహారాలతో కలిపి తీసుకోవడం మరింత శ్రేయస్కరం.

అరటిపండును పెరుగుతో కలిపి తినవచ్చు. ఓట్స్‌లో ముక్కలుగా వేసుకుని తీసుకోవచ్చు. అరటిపండుతో పాటు కొన్ని బాదం లేదా వాల్‌నట్స్ తినడం మంచిది. జీర్ణ సమస్యలు లేనివారు పాలతో కలిపి కూడా తీసుకోవచ్చు.

ఎలాంటి వాళ్లు పరగడుపున తినకపోవడం మంచిది..?

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాల్సిన డయాబెటిస్ బాధితులు. పొటాషియం తక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచించిన కిడ్నీ వ్యాధిగ్రస్తులు. అరటిపండు తిన్నప్పుడు గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా అలర్జీ లక్షణాలు కనిపించేవారు. ఖాళీ కడుపుతో తింటే కడుపులో అసౌకర్యంగా అనిపించేవారు.

ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు, అరటిపండు తింటే ఇబ్బంది పడనివారు తమ రోజువారీ సమతుల్య ఆహారంలో భాగంగా ఒక అరటిపండును నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అయితే, కేవలం అరటిపండుతోనే శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అందవు కాబట్టి.. ఇతర తాజా పండ్లు, ఆకుకూరలు, ప్రోటీన్లు, తృణధాన్యాలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.