For Fresh Air : ఇంట్లో ఈ 10 మొక్కలు ఉంటే.. స్వచ్ఛమైన గాలి, సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం..!
సాక్షి లైఫ్ : ఇల్లు అందంగా కనిపించడానికి ఖరీదైన అలంకరణ వస్తువులే అవసరం లేదు. పచ్చని మొక్కలు కూడా ఇంటి రూపురేఖలను మార్చేస్తాయి. ఈ రోజుల్లో ఇళ్లల్లో ఇండోర్ ప్లాంట్స్ (Indoor Plants) పెంచడం బాగా ట్రెండ్ అవుతోంది. చిన్న ఫ్లాట్స్ నుంచి పెద్ద ఇళ్ల వరకు.. బాల్కనీలు, డ్రాయింగ్ రూమ్స్, బెడ్రూమ్స్ ఇలా ఎక్కడైనా వీటిని పెంచుకోవచ్చు. ఇవి ఇంటికి సహజమైన అందాన్నివ్వడమే కాకుండా గాలిని శుభ్రపరిచి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాంతి తక్కువగా ఉండే ప్రదేశాల్లో కూడా సులభంగా పెరిగే 10 రకాల ఇండోర్ ప్లాంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
1. స్నేక్ ప్లాంట్ (Snake Plant)..
పొడవాటి, కత్తి ఆకారంలో ఉండే ఆకులతో ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి తరచుగా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశాల్లోనూ ఇది సులభంగా పెరుగుతుంది. గాలిలోని మలినాలను తొలగించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
2. స్పైడర్ ప్లాంట్ (Spider Plant)..
ఆకుపచ్చ, తెలుపు రంగుల చారలతో ఉండే ఆకులతో ఇది అందంగా కనిపిస్తుంది. దీని ఆకులు కిందికి వేలాడుతూ ఉంటాయి కాబట్టి హ్యాంగింగ్ పాట్స్ (Hanging Pots)లో పెంచుకోవడానికి ఇది అనువైనది. ఇంట్లో కాస్త వెలుతురు పడే మూలల్లో దీన్ని ఉంచవచ్చు.
3. అరెకా పామ్ (Areca Palm)..
ఇంట్లో కాస్త ఆహ్లాదకరమైన వాతావరణం కావాలంటే ఈ మొక్కను ఎంచుకోవచ్చు. దీని పొడవైన, విశాలమైన ఆకులు గదికి ప్రత్యేక అందాన్నిస్తాయి. వెలుతురు బాగా వచ్చే లివింగ్ రూమ్ లేదా హాల్లో దీన్ని పెట్టుకోవచ్చు.
4. మనీ ప్లాంట్ (Money Plant)..
ఇళ్లల్లో ఎక్కువగా పెంచుకునే మొక్కల్లో ఇది మొదటి వరుసలో ఉంటుంది. ఈ తీగ వేగంగా పెరుగుతుంది. గోడలు, షెల్ఫ్‌లు లేదా హ్యాంగింగ్ కుండీల్లో దీన్ని అలంకరించుకోవచ్చు. మట్టిలోనే కాకుండా కేవలం నీళ్లలో కూడా ఇది సులభంగా పెరుగుతుంది.
5. పీస్ లిల్లీ (Peace Lily)..
ముదురు ఆకుపచ్చని ఆకులు, తెల్లటి పూలతో ఈ మొక్క ఇంటికి ఎంతో ఆకర్షణను ఇస్తుంది. నేరుగా ఎండ పడని, కాస్త వెలుతురు వచ్చే ప్రదేశాల్లో దీనిని ఉంచడం మంచిది.
6. అలోవెరా (కలబంద) Aloe Vera..
కలబందను ఇంట్లో లేదా బాల్కనీలో సులభంగా పెంచుకోవచ్చు. దీని ఆకుల్లో జెల్ ఉంటుంది. దీనికి ఎక్కువ నీరు అవసరం లేదు, కానీ మంచి వెలుతురు తగిలితే బాగా పెరుగుతుంది.
7. బోస్టన్ ఫెర్న్ (Boston Fern)..
దట్టమైన ఆకుపచ్చని ఆకులు ఇష్టపడేవారికి ఇది సరైన ఎంపిక. దీని ఆకులు నలువైపులా వ్యాపించి హ్యాంగింగ్ బాస్కెట్స్లో చాలా అందంగా కనిపిస్తాయి. నేరుగా ఎండ పడని ప్రదేశాల్లో దీన్ని ఉంచాలి.
8. రబ్బర్ ప్లాంట్ (Rubber Plant)..
పెద్దవిగా, మెరుస్తూ ఉండే ముదురు ఆకుపచ్చని ఆకులతో ఈ మొక్క ఆకర్షణీయంగా ఉంటుంది. లివింగ్ రూమ్‌లోని ఖాళీ ప్రదేశాల్లో పెడితే హుందాగా కనిపిస్తుంది. కుండీలోని మట్టి ఆరిపోయిన తర్వాత మాత్రమే దీనికి నీరు పోయాలి.
9. బాంబూ పామ్ (Bamboo Palm)..
సన్నని కాండం, విశాలమైన ఆకులతో ఉండే ఈ మొక్క ఇండోర్ డెకరేషన్‌కు అద్భుతమైన ఎంపిక. ఇంటికి పచ్చదనాన్ని తీసుకురావడంలో ఇది ముందుంటుంది.
10. డ్రెసీనా (Dracaena)..
పొడవాటి ఆకర్షణీయమైన ఆకులతో ఉండే దీన్ని ఇళ్ల అలంకరణలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో ఆకుల రంగు, ఆకారాన్ని బట్టి పలు రకాలు ఉంటాయి. గదిలో కాస్త పరోక్ష వెలుతురు వచ్చే చోట దీన్ని పెట్టుకోవచ్చు.
పిల్లలు ఉన్న ఇంట్లో మొక్కలు పెంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మొక్కలను వారి చేతికి అందనంత ఎత్తులో ఉంచాలి. ముఖ్యంగా స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్, పీస్ లిల్లీ, డ్రెసీనా లాంటి మొక్కల ఆకులను పిల్లలు నోట్లో పెట్టుకోకుండా దూరంగా ఉంచడం మంచిది. చిన్నపిల్లలు మట్టితో ఆడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, కుండీల్లోని మట్టిని ముట్టుకోకుండా, నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్తపడాలి.
మొక్కలకు ఎరువులు లేదా కీటక నాశినులు వేసేటప్పుడు పిల్లలను ఆ ప్రదేశానికి పూర్తిగా దూరంగా ఉంచాలి. బరువైన కుండీలను ధృడమైన స్టాండ్స్‌పై ఉంచాలి. పిల్లలు పట్టుకుని లాగితే మీద పడిపోయేలా అస్థిరంగా అస్సలు ఉంచకూడదు.
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
