Burn First Aid : కాలిన గాయాలపై టూత్‌పేస్ట్ రాస్తున్నారా..? అది ఎంత ప్రమాదమో తెలుసా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వంటగదిలో హడావుడిగా పనిచేస్తున్నప్పుడు వేడి నూనె తుంపర్లు పడటం, వేడి పాత్రలు తగలడం వల్ల చేతులు కాలడం సహజం. ఇలాంట ప్పుడు చాలామంది వెంటనే చేసే పని.. కాలిన చోట టూత్‌పేస్ట్ రాయడం. ఇలా చేస్తే మంట తగ్గి, చల్లదనం వస్తుందని నమ్ముతుంటారు. కానీ, వైద్య నిపుణుల ప్రకారం ఇలా చేయడం ఏమాత్రం సురక్షితం కాదు.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

టూత్‌పేస్ట్‌ ఎందుకు రాయకూడదు..?

టూత్‌పేస్ట్ దంతాల శుభ్రత కోసం తయారు చేసిందే తప్ప కాలిన గాయాలను తగ్గించడానికి కాదు. ఇందులో ఉండే మింట్ ఫ్లేవర్, ఇతర రసాయనాలు కాలిన చర్మానికి మరింత మంటను, ఇరిటేషన్ ను కలిగిస్తాయి. గాయంపై పేస్ట్ రాయడం వల్ల ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. అంతేకాకుండా ఆసుపత్రికి వెళ్లినప్పుడు.. గాయం తీవ్రతను వైద్యులు సరిగ్గా అంచనా వేయడానికి ఈ పేస్ట్ అడ్డంకిగా మారుతుంది.

కాలిన వెంటనే ఏం చేయాలి..?

కాలిన భాగాన్ని వెంటనే కనీసం 20 నిమిషాల పాటు చల్లటి నీటి ధార అంటే ట్యాప్ వాటర్ కింద ఉంచాలి. దీనివల్ల చర్మం ఉష్ణోగ్రత తగ్గి, లోపలి కణజాలం దెబ్బతినకుండా ఉంటుంది. చేతికి ఉంగరాలు, వాచీలు లేదా బిగుతుగా ఉండే దుస్తులు ఉంటే.. చర్మం ఉబ్బకముందే సున్నితంగా తీసేయాలి. ఒకవేళ కాలిన చర్మానికి దుస్తులు అతుక్కుపోతే.. వాటిని బలవంతంగా లాగే ప్రయత్నం చేయకూడదు. దీనివల్ల చర్మం దెబ్బతింటుంది. నీటితో చల్లబరిచిన తర్వాత శుభ్రమైన, చర్మానికి అంటుకోని (Non-stick) పల్చటి బ్యాండేజ్ వేయాలి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

కాలిన చోట నీటి బుడగలు వస్తే వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ చిదప కూడదు. ఇలా చేస్తే బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లు వస్తాయి. గాయం మీద టూత్‌పేస్ట్ మాత్రమే కాకుండా నెయ్యి, నూనె లేదా ఐస్ మంచు ముక్కలు వంటివి కూడా అస్సలు పెట్టకూడదు. ముఖం, చేతులు, పాదాలపై కాలినా.. గాయం పెద్దదైనా తీవ్రత ఎక్కువగా ఉన్నా ఇంటి చిట్కాలపై ఆధారపడకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చిన్నపిల్లలు, వృద్ధులకు కాలిన గాయాలైతే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.