Chronic Inflammation effect : శరీరంలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్:. తీవ్ర వ్యాధులకు ముందస్తు హెచ్చరిక..!
సాక్షి లైఫ్ : శరీరానికి ఏదైనా గాయమైనప్పుడు లేదా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఆ ప్రాంతంలో ఎర్రగా కందిపోవడం, వాపు రావడం సహజం. ఇది మన దేహానికి సహజంగా ఉండే 'రోగనిరోధక వ్యవస్థ' ( immune system) స్పందించే తీరు. గాయం మానేకొద్దీ ఆ వాపు దానంతట అదే తగ్గిపోతుంది. కానీ, ఎలాంటి కారణం లేకుండా శరీరంలో తరచూ వాపు వస్తుంటే లేదా వాపు దీర్ఘకాలం పాటు తగ్గకుండా అలాగే ఉంటే.. దాన్ని వైద్య పరిభాషలో 'క్రానిక్ ఇన్ఫ్లమేషన్' (chronic inflammation) అంటారు. లోపల పొంచి ఉన్న ఏదో పెద్ద ప్రమాదానికి ఇది ముందస్తు సంకేతం కావొచ్చు.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
క్రానిక్ ఇన్ఫ్లమేషన్ లక్షణాలు..
ఈ దీర్ఘకాలిక వాపు కొన్నిసార్లు బయటకు స్పష్టంగా కనిపించకపోవచ్చు. కానీ ఎలాంటి కారణం లేకుండా విపరీతమైన అలసట, కీళ్ల నొప్పులు, కండరాలు పట్టేయడం, పదే పదే అనారోగ్యంగా లేదా నీరసంగా అనిపించడం లాంటివి దీని ప్రధాన లక్షణాలు.
ఏయే వ్యాధులకు దారితీస్తుందంటే..
మధుమేహం (Diabetes)..దీర్ఘకాలిక వాపు వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance) పెరుగుతుంది. దీనికి ఊబకాయం కూడా తోడైతే టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తీవ్రమవుతుంది. గుండె జబ్బులు..ఇన్ఫ్లమేషన్ కారణంగా రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. భవిష్యత్తులో ఇది హార్ట్ ఎటాక్ వంటి గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. ఫ్యాటీ లివర్..ఈ దీర్ఘకాలిక వాపు మెటబాలిక్ ఫ్యాటీ లివర్ ముప్పును పెంచుతుంది. ఇది ముదిరితే కాలేయం దెబ్బతినే (fibrosis) ప్రమాదం ఉంది.
క్యాన్సర్ ముప్పు..
శరీరంలో సుదీర్ఘకాలం పాటు వాపును అలాగే వదిలేయడం వల్ల భవిష్యత్తులో కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. శరీరంలో ఈ వాపు ఉందో లేదో డాక్టర్ సలహాతో సీఆర్పీ (CRP), ఈఎస్ఆర్ (ESR) వంటి రక్త పరీక్షల ద్వారా సులభంగా గుర్తించవచ్చు.
నివారణకు ఏం చేయాలి..?
శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే ఏకైక మార్గం. యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు మెండుగా ఉండే ఆకుకూరలు, సీజనల్ పండ్లు, తృణధాన్యాలు, నట్స్, గింజలను రోజువారీ డైట్లో చేర్చుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, ఉప్పు, నూనెలో వేయించినవి, జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. తగినంత నిద్ర శరీరానికి చాలా అవసరం. మానసిక ఒత్తిడిని జయించేందుకు యోగా, ధ్యానం లాంటివి సాధన చేయాలి.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
