Air Pollution : కాలుష్య కోరల్లో ఆరోగ్యం..మాస్క్ ఒక్కటే సరిపోదు.. ఇంట్లోనూ ఈ జాగ్రత్తలు మస్ట్..!
సాక్షి లైఫ్ : నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉండే చలి వాతావరణం ఆహ్లాదాన్ని పంచినప్పటికీ, రోజురోజుకూ పెరిగిపోతున్న వాయు కాలుష్యం (air pollution) శ్వాసకోశ, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతోంది. చలిగాలులు, వాహనాల పొగ కలగలిసి గాలిని విషతుల్యంగా మారుస్తున్నాయి. కాలుష్యం నుంచి మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి పలు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అవేంటంటే..?
ఉదయం వేళ వ్యాయామాలు వద్దు..
వాతావరణంలో కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆరుబయట వాకింగ్, వ్యాయామం చేయడం ప్రమాదకరం. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు వాతావరణ పీడనం తగ్గి, సూక్ష్మ కాలుష్య కణాలు సులభంగా ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటాయి. కాబట్టి బయట తిరగడానికి బదులుగా ఇంట్లోనే యోగా, తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేసుకోవడం సురక్షితం.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
'ఎన్-95' మాస్కులతోనే రక్షణ..
బయటకు వెళ్లడం తప్పనిసరి అయితే నాణ్యమైన ఎన్-95 (N-95) లేదా సర్టిఫైడ్ మాస్కులు మాత్రమే ధరించాలి. సాధారణ క్లాత్ మాస్కులు సూక్ష్మమైన కాలుష్య కణాలను సమర్థవంతంగా అడ్డుకోలేవు. ముక్కు, నోరు పూర్తిగా కవర్ అయ్యేలా మాస్క్ పెట్టుకోవాలి.
ఇంట్లో గాలి స్వచ్ఛంగా ఉండేలా..
తలుపులు, కిటికీలు మూసి ఉంచినా కాలుష్యం ఇంట్లోకి చొరబడుతుంది. మీ అవసరం, బడ్జెట్ను బట్టి ఇంట్లో మంచి సామర్థ్యం గల 'ఎయిర్ ప్యూరిఫైయర్' వాడటం మేలు. కలబంద, స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ వంటి మొక్కలు అందాన్నిచ్చినా, అవి మాత్రమే ఇంట్లోని కాలుష్య కారకాలను పూర్తిగా నివారించలేవు.
హైడ్రేషన్, పోషకాహారం..
వాతావరణ కాలుష్యం నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి తగినంత నీరు తాగాలి. దీనివల్ల గొంతు పొడిబారకుండా ఉంటుంది. రోగనిరోధక శక్తిని స్థిరంగా ఉంచే నారింజ, ఉసిరి, జామ, నిమ్మకాయలతో పాటు ఆకుకూరలు, విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండే ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవాలి.
ప్రాణాయామంలో జాగ్రత్తలు..
భుజంగాసనం, గోముఖాసనాలతో పాటు నాడి శోధన, భ్రామరి వంటి ప్రాణాయామాలు శ్వాస వ్యవస్థను, నాడీ వ్యవస్థను మెరుగుపరు స్తాయి. అయితే గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరుబయట చేయకూడదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే ఊపిరి బిగబట్టే వ్యాయామాలకు దూరంగా ఉండాలి.
గాలి నాణ్యత సూచీ (AQI)..
ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. AQI 100 దాటినప్పుడు సెన్సిటివ్ వ్యక్తులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. ఇళ్లలో చీపురుతో ఊడ్చే బదులు, తడిగుడ్డతో ఫ్లోర్ క్లీన్ చేయాలి. హెపా (HEPA) ఫిల్టర్లు వాడటం ఉత్తమం. ఇంట్లో అగరుబత్తీలు, కొవ్వొత్తులు వెలిగించడం మానుకోవాలి. ముఖ్యంగా గుండె, ఆస్తమా రోగులు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, అవసరమైన టీకాలు ముందుగానే తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
