సాక్షి లైఫ్ : వేడినీళ్లు, చన్నీళ్లు ఈ రెండింటిలో వేటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది..? అనే విషయాలపై చాలా మందిలో అనేక డౌట్స్ ఉంటాయి. వేడి నీటితో స్నానం చేస్తే శరీరంలో అలసట పోతుందని కొందరు చెబుతుంటారు. మరికొందరేమో చన్నీటి స్నానం శరీరానికి చాలా మంచిదని అంటుంటారు. అసలు ఏ నీళ్లతో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
వేడినీళ్ల స్నానం..
వేడినీళ్లతో స్నానం చేస్తే ఒళ్లంతా హాయిగా అనిపిస్తుంది. కానీ ఉదయం పూట స్నానం చేసినప్పుడు వేడినీళ్లతో చేయడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేడి నీటితో స్నానం చేస్తే శరీరం మొత్తం రిలాక్స్ అయ్యి, నిద్ర వచ్చినట్లుగా ఉంటుంది. దీనివల్ల రోజంతా అలసటగా అనిపిస్తుంది. ఈ ప్రభావంతో ఆఫీసులకు, బయట పనులకు వెళ్లిన వాళ్లకు కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు.
హీటర్లు, గీజర్లు..
పూర్వ కాలంలో ఋషులు, మునులు తెల్లవారుజామున 4గంటలలోపే నిద్ర లేచి చన్నీళ్లతో స్నానం చేసేవాళ్లు. అలా తెల్లవారుజాము సమయం లో చన్నీటితో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నా యని అందుకే ఋషులు ఆ సమయంలో నదుల్లోను, సెలయేర్లలోనూ స్నానం చేసేవాళ్లు. ప్రస్తుతం చాలామంది వేడి నీళ్లతోనే స్నానం చేస్తున్నారు. ప్రతి ఇంట్లో హీటర్లు, గీజర్లు తప్పనిసరి అయిపోయాయి.
చలికాలంలో..
వాస్తవానికి ఏ నీటితో స్నానం చేయడం మంచిది..? చన్నీళ్లతోనా...? వేడినీళ్లతోనా..? అంటే.. చన్నీళ్లే ఉత్తమమని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. చన్నీళ్లతో స్నానం చేయడం అందరికీ మంచిది కాదు. కొంతమంది సైనస్, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడేవారు ఉంటారు. చలికాలంలో చన్నీటితో స్నానం చేస్తే వారి సమస్య మరింత ఎక్కువ అవుతుంది. తలపట్టేసినట్టు ఉండటమే కాకుండా తలనొప్పి కూడా పెరుగుతుంది. కాబట్టి వాళ్లు చలికాలంలో వేడినీటితో స్నానం చేయడమే మంచిది. అదే వేసవి కాలంలో వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి ఎవరైనా చన్నీటితో స్నానం చేయవచ్చు.
కొంత ఇబ్బందిగా అనిపించినా..
చన్నీళ్లతో స్నానం చేసేప్పుడు మొదట కొంత ఇబ్బందిగా అనిపించినా.. ఒంటిపై చన్నీళ్లు పడగానే శరీరం మొత్తం ఉత్తేజిత మవుతుంది. దెబ్బకు నిద్రమత్తు వదిలిపోతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండగలుగుతారు. అందుకే వేడినీళ్ల కంటే చన్నీళ్లతో స్నానం చేయడమే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల ముఖంలో అందం కూడా పెరుగుతుందంట.
ముఖంపై..
చన్నీటితో స్నానం చేయడం వల్ల ముఖంపై ఉన్న చిన్న చిన్న రంధ్రాలు పోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంశాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చిన ఐస్ మాస్క్ ఇప్పుడు చాలా పాపులర్ అయింది. దీన్ని ఉపయోగించి చాలామంది లాభాలు పొందుతున్నారు. ఐస్ మాస్క్ అంటే.. ఒక పాత్రలో చల్లటి నీటిని తీసుకుని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్‌ను కూడా వేస్తారు. ముఖాన్ని కాసేపు ఆ పాత్రలో ఉంచుతారు.
గోరువెచ్చటి నీటితో..
దీనివల్ల ముఖంపై ఉన్న రంధ్రాలు తగ్గడమే కాకుండా మొహం తాజాగా మారుతుంది. దీంతో అందంగా కనిపిస్తారు. రాత్రిపూట వేడినీటితో స్నానం చేయడం మంచిది. గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం, కండరాలు మొత్తం రిలాక్స్ అవుతాయి. దీనివల్ల పొద్దుట్నుంచి పనిచేసి అలసిపోయిన శరీరానికి ఉపశమనం లభించడమేకాకుండా, హాయిగా నిద్రపడుతుంది. కాబట్టి రాత్రిపూట మాత్రం చన్నీళ్ల కంటే వేడినీటితో స్నానం చేయడమే ఉత్తమమని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి.. ఆర్గానిక్ పండ్లను గుర్తించడమెలా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com