Dengue vs Swine Flu : డెంగీ, స్వైన్ ఫ్లూ.. ఈ రెండింటికీ తేడా ఏంటి..? లక్షణాలు ఎలా ఉంటాయంటే..?
సాక్షి లైఫ్ : వాతావరణంలో మార్పుల కారణంగా ప్రస్తుతం జ్వరాల తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా డెంగీ (Dengue), స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ రెండు వ్యాధుల్లోనూ మొదట కనిపించేది తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులే కావడంతో.. ఏది ఏ జ్వరమో గుర్తించడం సాధారణ ప్రజలకు కష్టంగా మారుతోంది. సకాలంలో వ్యాధిని గుర్తించి సరైన చికిత్స అందిస్తే ప్రమాదం నుంచి సులభంగా బయటపడొచ్చు. ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు, లక్షణాలు, నివారణ మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రధాన వ్యత్యాసం ఇదే..
ఈ రెండు వ్యాధులు వ్యాపించే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. డెంగీ వ్యాధి సోకిన 'ఏడిస్' (Aedes) అనే దోమ కుట్టడం వల్ల మనుషులకు వ్యాపిస్తుంది. స్వైన్ ఫ్లూ గాలి ద్వారా వ్యాపించే అంటువ్యాధి. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఇతరులకు సులభంగా సోకుతుంది.
డెంగీ లక్షణాలు ఎలా ఉంటాయి..?
డెంగీ వైరస్ సోకిన 4 నుంచి 10 రోజుల్లో ఈ లక్షణాలు బయట పడతాయి. ఇవి 2 నుంచి 7 రోజుల పాటు వేధిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రధాన లక్షణాలు ఇలా ఉంటాయి..
తీవ్రమైన జ్వరం, భరించలేని తలనొప్పి.
కళ్ల వెనుక భాగంలో నొప్పి.
కండరాలు, కీళ్ల నొప్పులు.
వికారం, వాంతులు.
చర్మంపై ఎర్రటి దద్దుర్లు రావడం.
విపరీతమైన నీరసం, అలసట.
కొన్నిసార్లు గ్రంథులలో వాపు కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు: తీవ్రమైన జ్వరం తర్వాత కడుపులో భరించలేని నొప్పి రావడం, పదే పదే వాంతులు కావడం, ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తం కారడం, వాంతి లేదా మలంలో రక్తం పడటం, శ్వాస వేగంగా తీసుకోవడం.. వంటివి డెంగీ తీవ్రరూపం దాల్చడానికి సంకేతాలు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించి అత్యవసర చికిత్స అందించాలి.
స్వైన్ ఫ్లూ (H1N1) లక్షణాలు..?
స్వైన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల వచ్చే ఈ వ్యాధి లక్షణాలు సాధారణ ఫ్లూ అంటే జలుబు, జ్వరం మాదిరిగానే ఉంటాయి.
అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం.
పొడి దగ్గు, గొంతులో గరగర లేదా నొప్పి.
ముక్కు కారడం.
తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు.
చలిగా అనిపించడం, విపరీతమైన అలసట.
కొందరిలో వాంతులు, విరేచనాలు కూడా కావచ్చు. వ్యాధి తీవ్రమైతే న్యుమోనియాకు దారితీసి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి.
వైద్య పరీక్షలే కీలకం..
జ్వరం వచ్చిన వెంటనే సొంత వైద్యం చేసుకోకూడదు. వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకోవాలి. డెంగీ నిర్ధారణకు కచ్చితంగా రక్త పరీక్షలు అవసరం. ఫ్లూ లక్షణాలను బట్టి వైద్యులు క్లినికల్ ఎవాల్యుయేషన్ ద్వారా తగిన పరీక్షలు, మందులు సూచిస్తారు.
డెంగీ, స్వైన్ ఫ్లూ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన నివారణా చర్యలు తప్పనిసరిగా పాటించాలి. డెంగీ నివారణ కోసం ముందుగా ఇంటి పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తపడాలి. దోమల బెడదను నివారించడానికి రిపెల్లెంట్స్, కాయిల్స్ వాడటంతో పాటు, ముఖ్యంగా పగటిపూట దోమలు కుట్టకుండా శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులను ధరించాలి.
ముఖ్యంగా స్వైన్ ఫ్లూ దరిచేరకుండా ఉండాలంటే వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ చేతులను తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. దగ్గు లేదా తుమ్ములు వచ్చినప్పుడు ముఖానికి మాస్క్ లేదా కర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. అవసరాన్ని బట్టి వైద్యుల సలహాతో ముందుజాగ్రత్తగా ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవాలి.
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
