Digestion : జీర్ణశక్తి పెరగడానికి డిటాక్స్ డ్రింక్స్ నిజంగానే పనిచేస్తాయా..? బదులుగా ఏం చేయాలి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పండగల సీజన్‌లో పిండివంటలు, స్వీట్లు, నూనెలో వేయించిన పదార్థాలు తినడం సర్వసాధారణం. అయితే పండగ ముగిశాక చాలామందిని కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, పొట్ట బరువుగా అనిపించడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. వీటి నుంచి త్వరగా బయటపడేందుకు కొందరు 'డిటాక్స్ డ్రింక్స్' తాగడం, మరికొందరు క్రాష్ డైట్లు, సుదీర్ఘ ఉపవాసాల పేరిట ఆహారం మానేయడం చేస్తుంటారు. కానీ.. శరీరాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇలాంటి కఠిన పద్ధతులు అస్సలు అవసరం లేదని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 

ఆహారాన్ని పూర్తిగా మానేయడం కంటే.. దినచర్యను, ఆహారపు అలవాట్లను క్రమబద్ధీకరించుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థను సులభంగా గాడిలో పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..

1. పస్తులు వద్దు.. సమతుల ఆహారమే ముద్దు..  

పండగ తర్వాత ఒక్కసారిగా భోజనం మానేయడం లేదా కేవలం ద్రవ పదార్థాలపైనే ఆధారపడటం సరైన పద్ధతి కాదని డైటీషియన్ చెబుతున్నారు. దీనికి బదులుగా నిర్ణీత సమయానికి సమతుల ఆహారం తీసుకోవాలి. ఆహారంలో ఆకుకూరలు, సీజనల్ పండ్లు, తృణధాన్యాలు, ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలి. అయితే గ్యాస్, కడుపు ఉబ్బరంతో బాధపడేవారు ఒకేసారి ఎక్కువ మొత్తంలో పచ్చి సలాడ్లు లేదా పీచుపదార్థం (fiber) తినకూడదు. దీనివల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. జీర్ణవ్యవస్థ అలవాటు పడేలా ఫైబర్‌ను నెమ్మదిగా పెంచాలి.

2. ఇంటి భోజనానికే ప్రాధాన్యం..

కఠినమైన డైటింగ్‌లు, కృత్రిమ డిటాక్స్ పానీయాలకు దూరంగా ఉండాలని ఫంక్షనల్ మెడిసిన్ నిపుణురాలు ముగ్ధా ప్రధాన్ సూచిస్తున్నారు. జీర్ణశక్తి మెరుగుపడాలంటే ఇంట్లో అప్పటికప్పుడు వండిన తాజా, తేలికపాటి ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలి. బాగా ఉడికించిన కూరగాయలు, సులభంగా జీర్ణమయ్యే ప్రొటీన్ ఆహారం, పెరుగు వంటివి తీసుకోవడం వల్ల పొట్టకు ఎంతో హాయిగా ఉంటుంది.

3. తేలికపాటి వ్యాయామంతో మొదలుపెట్టండి..

పండగ తర్వాత పొట్ట బరువుగా ఉందని చాలామంది ఒక్కసారిగా కఠినమైన వ్యాయామాలు (heavy workouts) చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంపై అదనపు ఒత్తిడి పడుతుంది. ముందుగా రోజువారీ నడక (walking), సైక్లింగ్ వంటి తేలికపాటి శారీరక శ్రమతో మొదలుపెట్టాలి. శరీర సామర్థ్యాన్ని బట్టి నెమ్మదిగా వ్యాయామ సమయాన్ని పెంచుకోవాలి.

4. నీరు, నిద్ర కీలకం..

జీర్ణక్రియ సాఫీగా సాగాలంటే శరీరానికి తగినంత నీరు అందడం చాలా అవసరం. రోజంతా సరిపడా నీరు తాగడంతో పాటు, రాత్రిపూట కంటినిండా నిద్రపోవాలి. భోజన వేళలను క్రమబద్ధీకరించుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ త్వరగా కోలుకుని, శరీరం తిరిగి ఉత్సాహంగా మారుతుంది.

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.